కొండపైకి కరెంటు బస్సు!

ABN , First Publish Date - 2021-01-14T07:51:44+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయి. తిరుమల కొండపైకి పర్యావరణ రహిత బస్సులు నడిపేందుకు ప్రభుత్వాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ అనుమతి కోరింది.

కొండపైకి కరెంటు బస్సు!

తిరుమలకు తిప్పాలని కోరిన టీటీడీ

ప్రభుత్వ అనుమతి కోసం ఆర్టీసీ ప్రతిపాదన


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయి. తిరుమల కొండపైకి పర్యావరణ రహిత బస్సులు నడిపేందుకు ప్రభుత్వాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ అనుమతి కోరింది. సర్కారు పచ్చజెండా ఊపితే త్వరలో టెండర్లు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. డీజిల్‌ ధరల పెరుగుదలతో భారాన్ని తగ్గించుకోవడానికి 2019లో ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావించింది. వాటి ఖరీదు బాగా ఎక్కువ కావడంతో కేంద్రప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినా గిట్టుబాటు కాదని తేలడంతో ఆ యోచన విరమించుకుని అద్దె ప్రాతిపదికన 350 బస్సులు తీసుకోవాలని టెండర్లు ఆహ్వానించింది. పలు సంస్థలతో ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించి గ్రాస్‌ కాస్ట్‌ పద్ధతిన 12 ఏళ్ల కాలానికి అద్దెకు తీసుకునేందుకు సమ్మతించింది. అయితే డీజీల్‌ బస్సుల తరహాలో కి.మీ. ప్రాతిపదికన చెల్లించాలని సంస్థలు కోరడంతో అందుకు అంగీకరించింది. 2019 అక్టోబరు 14లోగా టెక్నికల్‌ బిడ్లు, నవంబరు 1లోపు ఫైనాన్షియల్‌ బిడ్ల గడువుతో టెండర్లు ఆహ్వానించింది.  అయితే టెండర్లలో పాల్గొన్న సంస్థలు కి.మీ. అద్దె రూ.60కి పైగా కోట్‌ చేశాయి. ఆర్టీసీ బస్సుల్లో సరాసరి ఆదాయం కిలోమీటరుకు రూ.35 దాటడం లేదని, అలాంటప్పుడు ఇంత అద్దె చెల్లించడం సాధ్యంకాదని అధికారులు తేల్చారు. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటం, ఏపీలో ఏకంగా 12ఏళ్లు అద్దెకు తీసుకుంటున్న నేపథ్యంలో రూ.40లోపు ధరకు ఇచ్చేందుకు అంగీకరించాలని సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో ఆయా సంస్థల ప్రతినిధులను కోరగా చాలామంది వెనకడుగు వేశారు.


ఇదే సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీన ప్రక్రియ, ఆ తర్వాత కోవిడ్‌ నేపథ్యంలో ఏడాదికి పైగా టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొండపైకి పర్యావరణ రహిత బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీని టీటీడీ కోరింది. దీంతో ఏడుకొండలపైకి నడిపేందుకు 50 బస్సులు అద్దెకు తీసుకోవాలా, విశాఖ, విజయవాడల్లో కూడా 50చొప్పున నడిపేలా మొత్తం 150 బస్సుల కోసం టెండర్లు పిలవాలా అని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగానే టెండర్లు నిర్వహించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. 

Updated Date - 2021-01-14T07:51:44+05:30 IST