వై.రామవరం, జనవరి 16: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి అన్నారు. ఆదివారం ఆయన స్థానిక ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను ఖండించారు. 11వ పీఆర్సీలో 23శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం బాధాకరమని, ఇది 9వ, 10వ పీఆర్సీలతో పోలిస్తే చాలాతక్కువన్నారు. ఉపాధ్యాయులకు హౌసింగ్ అలవెన్సులు ప్రకటించాలని, పాత పెన్షను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 3, 4వ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతల ప్రక్రియలను చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులోకి నెట్టే పనులను మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మల్లిపూడి రాజు, మండలాధ్యక్షుడు పల్లాల గంగాధరరెడ్డి, గౌరవాధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, చిన్న ఈశ్వరరెడ్డి, ప్రభాకరరెడ్డి, ఎర్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.