జీతాలివ్వండి మహాప్రభో!

ABN , First Publish Date - 2021-05-27T05:40:24+05:30 IST

వరంగల్ మహానగరపాలక సంస్థ నగరంలోని చెత్తకుప్పలను డంపింగ్ యార్డ్ వద్దకు చేర్చేందుకు 2018లో స్వచ్ఛ టిప్పర్‌లతో తరలించేందుకు పూనుకుంది...

జీతాలివ్వండి మహాప్రభో!

వరంగల్ మహానగరపాలక సంస్థ నగరంలోని చెత్తకుప్పలను డంపింగ్ యార్డ్ వద్దకు చేర్చేందుకు 2018లో స్వచ్ఛ టిప్పర్‌లతో తరలించేందుకు పూనుకుంది. ఆ వాహనాలను ఎస్సీఎస్టీలకు 47 వేల రూపాయలకు, బిసిలకు 87 వేలకు, ప్రభుత్వమే సమకూర్చింది. ప్రతి డ్రైవర్‌కు 600 ఇళ్లను కేటాయిస్తామని ఇంటికి నెలకు 60 రూపాయలు వసూలు చేయడం ద్వారా 36 వేలు జీతం పొందవచ్చని ఆనాటి మేయర్, కమిషనర్, హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. కానీ వాస్తవంలో వసూళ్ళు అందులో సగం కూడా కావడంలేదు. కొంతమందికైతే, ఆరువేలతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సరిగా పనిచేయకుంటే ఇఎంఐ చెల్లించబోమని డ్రైవర్లను అధికారులు బెదిస్తున్నారు. వసూళ్ళు సరిగా కాక డ్రైవర్లు అప్పుల పాలయ్యారు. అగ్రిమెంట్ అయిన అయిదేళ్ల తర్వాతయినా వాహనం సొంతం అవుతుందన్న ఆశతో నష్టాలను భరిస్తున్నారు. అయితే ఈ మధ్య నగరంలోని కుటుంబాల వద్ద ఇంటిబిల్లులోనే ప్రతి నెల ట్రిప్పర్ డ్రైవర్లకివ్వాల్సిన ఆరునెలల సొమ్మును ప్రభుత్వ అధికారులు వసూలు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో నగరవాసులు చెత్తకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు ప్రచారం చేశారు. డ్రైవర్లు ప్రతి నెల ఇంటింటి వారిని అడిగే అవసరం లేదని, రూ.15వేలు జీతంగా నేరుగా మేమే ఇస్తామని, వాహనాలకు డీజిల్ పోస్తామని కూడా చెప్పారు. కానీ ఆ జీతాన్ని కూడా మూడు నెలలుగా అధికారులివ్వడం లేదు. చెత్తను తరలించే ఓ కార్మికుడు కరోనాతో చనిపోయాడు. ఇప్పటికైనా స్వచ్ఛ టిప్పర్ డ్రైవర్లకు వెంటనే మూడు నెలల జీతం చెల్లించాలని, కరోనాకాలంలో చేసే సేవలకు గాను 10వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని విజ్ఞప్తి.

రాంపేట రంజిత్

వరంగల్‌

Updated Date - 2021-05-27T05:40:24+05:30 IST