ఆకాశవాణి న్యూస్‌రీడర్‌ ఏడిద గోపాలరావు ఇక లేరు

ABN , First Publish Date - 2020-11-13T09:59:36+05:30 IST

‘ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు’ అంటూ తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన చిరపరిచిత స్వరం మూగబోయింది.

ఆకాశవాణి న్యూస్‌రీడర్‌ ఏడిద గోపాలరావు ఇక లేరు

మూడు దశాబ్దాలపాటు వార్తాపఠనం

రంగస్థల గాంధీగా పేరుప్రఖ్యాతులు

హైదరాబాద్‌లో ముగిసిన అంత్యక్రియలు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు’ అంటూ తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన చిరపరిచిత స్వరం మూగబోయింది. మూడు దశాబ్దాల పాటు ఢిల్లీ, ఆకాశవాణి తెలుగు విభాగంలో న్యూస్‌రీడర్‌గా పనిచేసిన ఏడిద గోపాలరావు (83) ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం హఫీజ్‌పేట్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు రెండో తమ్ముడే గోపాలరావు. ఆయన 1966 నుంచి 1996 వరకూ న్యూస్‌ రీడర్‌గా ఆకాశవాణిలో సేవలందించారు. సోషలిస్టు రష్యాలోని మాస్కో రేడియోలోనూ నాలుగేళ్లు పనిచేశారు. పన్నెండు గంటలపాటు నిర్విరామంగా వార్తలు చదివి ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’కెక్కారు. ‘కరుణామయుడు’ సినిమాలోనూ ఆయన నటించారు. గోపాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొత్తపేట. ఆయన భార్య సుమలత సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంత ఉద్యోగిని. ఆయన కొడుకు శ్యాంరాజ చెన్నైలో స్థిరపడ్డారు. కూతురు మెహర్‌ కొంతకాలం కిందట కన్నుమూశారు. గోపాలరావుకు రంగస్థల గాంధీగా పేరు. ‘నేతాజీ’, ‘బాపు చెప్పినమాట’ నాటికల్లోని బాపూజీ పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గాంధీ ఏకపాత్రాభినయంలో గోపాలరావు వందకుపైగా ప్రదర్శనలిచ్చారు.


సరస నవరస సాంస్కృతిక సంస్థను నెలకొల్పి, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలలో జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తన అనుభవాల సమాహారం ‘అరవై వసంతాల ఏడిద గోపాలరావు’, ‘గోపాలతరంగాలు’ కవితా సంకలనం తదితర పుస్తకాలు రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డుల స్ర్కీనింగు కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు. చినజీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఢిల్లీ కేంద్రానికి గోపాలరావు కొంతకాలం బాధ్యుడిగానూ వ్యవహరించారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ ‘మహాప్రస్థానం’లో ఏడిద గోపాలరావు అంత్యక్రియలు ముగిశాయి. కాగా.. ఏడిద గోపాలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆకాశవాణి, దూరదర్శన్‌ ప్రోగ్రామ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం తెలిపారు.

Updated Date - 2020-11-13T09:59:36+05:30 IST