ఎంబీఎస్‌ జువెలర్స్‌ కేసులో రూ.364 కోట్ల ఆస్తుల జప్తు

ABN , First Publish Date - 2021-08-29T06:27:31+05:30 IST

నగల వ్యాపార సంస్థ ఎంబీఎస్‌ జువెలర్స్‌కు చెందిన రూ. 363.51 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో...

ఎంబీఎస్‌ జువెలర్స్‌ కేసులో రూ.364 కోట్ల ఆస్తుల జప్తు

  • అక్రమంగా విదేశాలకు బంగారం ఎగుమతి
  • ప్రభుత్వానికి రూ.505 కోట్ల నష్టం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): నగల వ్యాపార సంస్థ ఎంబీఎస్‌ జువెలర్స్‌కు చెందిన రూ. 363.51 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు ఆ సంస్థ ఎండీ సుకేశ్‌ గుప్తా, ప్రమోటర్లు అనురాగ్‌ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తాలకు  చెందిన 45 స్థిరాస్తులను జప్తు  చేసినట్లు ఈడీ వెల్లడించింది. బంగారం ఎగుమతుల్లో భారీగా అక్రమాలకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)కి పన్నులు చెల్లించకుండా అక్రమంగా నిధులను మళ్లించారని (మనీలాండరింగ్‌) పేర్కొంది. దీంతో ఎంఎంటీసీకి రూ.505 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. బంగారం లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎంబీఎస్‌ జువెలర్స్‌ ఎండీ సుకేశ్‌ గుప్తాను 2014లో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ వ్యవహారంలో చార్జీషీట్‌లను కోర్టులో దాఖలు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ (పెమా) నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. అక్రమంగా ఎగుమతి చేయడంతో పాటు పెద్దమొత్తంలో విదేశాలకు నగదు లావాదేవీలు జరిగాయని గుర్తించింది. హైదరాబాద్‌లోని ఎంఎంటీసీ అధికారులతో కుమ్మక్కై సుకేశ్‌ గుప్తా మోసానికి పాల్పడ్డారని, తద్వారా భారీగా లాభాలను గడించాడని పేర్కొంది. ఆ లాభాన్ని చూపుతూ ఆయన పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తులో బయటకు వచ్చింది. 


రూ.222 కోట్ల జరిమానా:  కాగా ఈ మనీలాండరింగ్‌ కేసులో ఎంబీఎస్‌ జువెలర్స్‌, ఆ సంస్థ ఎండీ సుకేశ్‌ గుప్తాకు రూ.222 కోట్ల జరిమానాను ఈడీ గతంలోనే విధించింది. 5 శాతం మార్జిన్‌ను ఎంబీఎస్‌ చెల్లించకుండానే.. 82 లావాదేవీలు చేసిందని పేర్కొంది. ఈ కేసు విచారణలో సుకేష్‌ గుప్తా దర్యాప్తు అధికారులకు సహకరించలేదు. ఆ లావాదేవీలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాను చెల్లించలేదు. ‘‘సుకేష్‌ గుప్తా 2019లో ఎంఎంటీసీతో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. ఆ సమయంలో ఎలాంటి నగదును చెల్లించలేదు. ఈ నేపథ్యంలో 45 స్థిరాస్తులకు చెందిన రూ.364 కోట్లను జప్తు చేశాం.’’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ప్రొసీడింగ్స్‌కు సంబంధించి హైకోర్టు  ఇప్పటికే స్టే విధించిందని, అది ఇంకా అమల్లోనే ఉందని ఎంబీఎస్‌ గ్రూప్‌ న్యాయవాది ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయం ఇంకా సుప్రీం కోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-29T06:27:31+05:30 IST