క్విడ్‌ ప్రొ కో కిందే పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-02-21T09:21:27+05:30 IST

‘క్విడ్‌ ప్రొ కో’ కింద లబ్ధి పొందడం కోసమే వైఎ్‌స జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌.శ్రీనివాసన్‌ పెట్టుబడులు పెట్టారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌

క్విడ్‌ ప్రొ కో కిందే పెట్టుబడులు

జగన్‌ సంస్థల్లో 140.32 కోట్లు పెట్టారు

వాటితో సంబంధం లేదంటే కుదరదు

కంపెనీల నిర్ణయాలకు డైరెక్టర్లదే బాధ్యత

శ్రీనివాసన్‌ పిటిషన్‌ కొట్టివేయండి: ఈడీ 

తీవ్ర ఆర్థిక నేరాలపై ఉదాసీనత తగదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది

హైకోర్టులో ఈడీ కౌంటర్‌ అఫిడవిట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘క్విడ్‌ ప్రొ కో’ కింద లబ్ధి పొందడం కోసమే వైఎ్‌స జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌.శ్రీనివాసన్‌ పెట్టుబడులు పెట్టారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్పష్టం చేసింది. ఈ పెట్టుబడులకు, తనకు సంబంధం లేదని ఆయన తప్పించుకోలేరని, సంస్థ వైస్‌ చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆయన బాధ్యత వహించాల్సిదేనని ఈడీ డిప్యూడీ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం హైకోర్టుకు నివేదించారు. కంపెనీలు తీసుకునే నిర్ణయానికి డైరెక్టర్లు బాధ్యత వహించాల్సిందేనని ఈడీ, ఫెరా తదితర చట్టాల్లో ఉందని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక నేరాభియోగాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో విచారణ పూర్తిచేసి నిగ్గుతేల్చాల్సి ఉందని.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోరాదని కోరారు. ఈడీ కేసును రద్దు చేయాలని, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో సుబ్రహ్మణ్యం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘జగన్‌ సంస్థలైన జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ, సిలికాన్‌ బిల్డర్స్‌ సంస్థల్లోకి క్విడ్‌ ప్రొ కో కింద పెట్టుబడులు మళ్లించారు.


జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నప్పటికీ.. అప్పటి రాష్ట్రప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు జగన్‌కు చెందిన గ్రూపు సంస్థల్లో ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ.140.32 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో భారతి సిమెంట్స్‌లో 95.32 కోట్లు, జగతి పబ్లికేషన్స్‌లో రూ.40 కోట్లు, కార్మెల్‌ ఏషియాలో 5 కోట్లు పెట్టింది. విషయం తన దృష్టికి రాలేదని శ్రీనివాసన్‌ చెప్పడం కేసు నుంచి తప్పించుకోడానికి చేస్తున్న ప్రయత్నమే. ఇండియా సిమెంట్స్‌ బోర్డు సమావేశంలో రూ.125 కోట్ల వరకు కార్పొరేట్‌ లోన్స్‌/అడ్వాన్స్‌ కింద పెట్టుబడులు పెట్టాలని 2010 ఏప్రిల్‌ 14న నిర్ణయించింది. అదే రోజున భారతి సిమెంట్స్‌ సంస్థకు చెందిన షేర్లను ఎక్కువ ప్రీమియంతో కొనుగోలు చేసి రూ.121 కోట్లు మళ్లించింది. ఇందుకు ప్రతిఫలంగా  క్విడ్‌ ప్రొ కో కింద కడప జిల్లా చౌడూర్‌లో 2.60 ఎకరాల లీజును 5 నుంచి 20 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. కాగ్నా నది నుంచి 13మిలియన్‌ ఘనపుటడుగుల నీటిని వినియోగించుకోడానికి అనుమతిస్తూ మరో జీవో జారీచేసింది. ఇదంతా క్విడ్‌ ప్రొ కో కిందే జరిగింది. పీఎంఎల్‌ఏ-2002 చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారు. ఈ అభియోగాలపై నిందితులను విచారించి వాంగ్మూలాలు కూడా రికార్డు చేశాం’ అని వెల్లడించారు.


తీవ్ర ఆర్థిక నేరాలు దేశ ప్రగతికి అడ్డుగా మారుతున్నాయని, ఇటువంటి నేరాల పట్ల ఉదాసీనంగా ఉండరాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కౌంటర్‌ అఫిడవిట్‌లో ఉటంకించారు. తీవ్ర ఆర్థిక నేరాభియోగాలు ఉన్న నేపథ్యంలో పిటిషనర్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉన్న ఈడీ కేసు విచారణ జరగాలన్నారు. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని, ఈ కేసులో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరారు.  

Updated Date - 2020-02-21T09:21:27+05:30 IST