ఈ-క్రాపింగ్‌ 100శాతం పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2022-08-06T09:20:48+05:30 IST

ఈ-క్రాపింగ్‌ 100శాతం పూర్తవ్వాలి

ఈ-క్రాపింగ్‌ 100శాతం పూర్తవ్వాలి

వెబ్‌ల్యాండ్‌లో పొరపాట్లుంటే సరిదిద్దాలి

ఎరువుల సరఫరాలో లోపాలుండకూడదు

వ్యవసాయ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు


అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంటల నమోదు(ఈ-క్రాపింగ్‌) సెప్టెంబరు మొదటి వారంలోగా నూరు శాతం పూర్తి చేయాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. ఆర్బీకేల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలో వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష జరిపారు. ఈ క్రాపింగ్‌ తర్వాత భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు కూడా ఇవ్వాలని చెప్పారు. ఈ క్రాపింగ్‌ చేసినప్పుడే జియో ట్యాగింగ్‌, వెబ్‌ల్యాండ్‌తోనూ అనుసంధానం చేస్తున్నామని అధికారులు చెప్పగా, వెబ్‌ల్యాండ్‌లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాలని చెప్పారు.  ‘వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్‌ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్‌ పనిచేసేలా చూడాలి. రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపాలి. ఎరువుల సరఫరాలో లోపాలు ఉండకూడదు. విత్తన సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తదితర అంశాలపై ప్రతి ఆర్బీకే నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులకు డ్రోన్లపై శిక్షణ ఇప్పించాల’ని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఖరీ్‌ఫలో రాష్ట్రంలో 18.8లక్షల హెక్టార్లలో విత్తనం పడిందని, 16.2ు అధికంగా వర్షపాతం నమోదైందని, రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సమీక్షలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T09:20:48+05:30 IST