Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమృతకాలంలో ఆర్థిక నైరాశ్యం...!

twitter-iconwatsapp-iconfb-icon
అమృతకాలంలో ఆర్థిక నైరాశ్యం...!

‘అంతరంగం అట్టడుగున అందరమూ మానవులమే’– నిజమే. అయితే, అన్ని ఆనందాలూ ఆర్థిక భద్రతతోనే ముడివడి ఉన్నాయని విశ్వసించడంలో మనమందరమూ మరింత పరిపూర్ణ మనుషులం కదా. తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మూడు సందేశాలను ఇచ్చింది. అవి: ఆర్థిక అవస్థలను తొలగించాలి, ఆర్థిక అవస్థలను తొలగించాలి, ఆర్థిక అవస్థలను తొలగించాలి. అమృత కాల్ గురించి చేసిన ఘోషల కంటే ఈ సందేశాలు పాలక పక్షానికి మరింత బిగ్గరగా ప్రమాద ఘంటికలు మోగించాయి. ప్రతిపక్షం విషయానికి వస్తే అవి దానికి ఒక అవకాశాన్ని కల్పించడంతో పాటు, ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన ఒక బాధ్యతను కూడా గుర్తు చేశాయి.


ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ ‘ఇండియా టుడే’ చాలా సంవత్సరాలుగా ‘జాతి మనస్థితి సర్వే’ (మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే)లను నిర్వహిస్తోంది. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవి ప్రామాణికమైనవిగా అందరి మన్ననలు పొందుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 2022 జూలై 15–31 తేదీల మధ్య సార్వత్రక ఎన్నికలు నిర్వహించినట్టయితే బీజేపీకి 283 (2019లో 303 సీట్లు సాధించుకున్నది) సీట్లు, ఎన్‌డిఏ 307 (గత సార్వత్రక ఎన్నికల్లో 353 సీట్లను గెలుచుకున్నది) స్థానాలు లభించేవి.


అయితే ఈ అంకెలను మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అసలు ఎన్నికలకు 20 నెలల ముందు వేసిన సీట్ల అంచనాను సీరియస్‌గా పట్టించుకోకూడదు. ఇక రెండో కారణం ఈ సర్వేను బిహార్ పరిణామాలకు ముందు నిర్వహించారు. సర్వే నిర్వాహకులు ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఒక ఆకస్మిక సర్వేను నిర్వహించగా బీజేపీ 8 సీట్లను, ఎన్‌డీఏ 21 సీట్లను కోల్పోతాయని వెల్లడయింది.


మరో కారణాన్ని కూడా నేను చెప్పితీరాలి. ‘జాతి మనస్థితి సర్వే’లో భాగంగా యథాప్రకారం ప్రజలను వారి ఇంటి వద్దే ముఖాముఖీ ఇంటర్వ్యూ చేసే ఆనవాయితీని ఈ ఏడాది జనవరి నుంచి నిలిపివేశారు. అలా ఇంటర్వ్యూలు నిర్వహించడమనేది గత ఆరు దశాబ్దాలుగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యకలాపాల్లో అత్యంత ప్రామాణికంగా పరిగణింపబడుతూ వస్తోంది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవెలప్‌మెంట్ సొసైటీస్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయితే ‘జాతి మనస్థితి సర్వే’ బాధ్యతలను కొత్తగా చేపట్టిన సి – ఓటర్ అనే ఏజెన్సీ ఈ పద్ధతికి స్వస్తిచెప్పి పూర్తిగా టెలిఫోనిక్ సర్వేలను నిర్వహిస్తోంది. టెలిఫోనిక్ సర్వేలను నిర్వహించడంలో ఖర్చులు తక్కువ కనుక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పద్ధతినే అనుసరించడం పరిపాటి అయింది. సరే, ఇప్పుడు మనదేశంలో సెల్‌ఫోన్ లేని వారెవరు? ఈ కారణంగా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలనే నిర్వహించడం ఒక సుస్థిర ఆనవాయితీ అయిపోయింది. అయితే టెలిఫోన్ కాల్స్‌కు ప్రతిస్పందించిన వారి జెండర్, కులం, వర్గం సంబంధిత సమాచారమేమీ తెలియదు. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిణామాలకు ఏ వర్గం వారు ఎలా స్పందించారు, మతపరమైన ఉద్రిక్తతలపై ఏ మతం వారి భావాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ సర్వే నివేదికలు స్పష్టం చేయడం లేదు.


ఈ పరిమితులను అలా ఉంచితే ఈ తాజా సర్వే మనకు వివిధ అంశాలపై అపార సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా ప్రజాభిప్రాయంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో స్పష్టం చేసింది. తొట్ట తొలుత చెప్పవలసిన విషయమేమిటంటే ఆర్థిక వ్యవస్థ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని సర్వే భాగస్వాములు ఖండితంగా చెప్పారు. ‘భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అనే ప్రశ్నకు అత్యధిక ప్రతి స్పందనలు ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవే కావడం గమనార్హం. 27శాతం మంది ధరల పెరుగుదలను, 25శాతం మంది నిరుద్యోగాన్ని, 7శాతం మంది పేదరికాన్ని పేర్కొన్నారు. ఇది స్పష్టం చేస్తున్నదేమిటి? అందరి మనసులనూ ఆర్థిక సమస్యలే కలవరపరుస్తున్నాయనే కాదూ? పైగా అధికారిక, అనధికారిక సమాచారమంతా ఈ వాస్తవాన్నే ధ్రువీకరిస్తోంది. ధరల పెరుగుదల అత్యధికులను అమితంగా ఆందోళనపరుస్తోంది. నిరుద్యోగం కలపరపరుస్తోందని చెప్పిన వారి శాతం చాలా తక్కువగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.


ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి గురించిన తమ అంచనాలను దాని భవిష్యత్తుకూ వర్తింపచేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. భారతీయులు ఆశావాదులనే విషయాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తోన్న ప్రజాభిప్రాయ సేకరణలు స్పష్టం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వర్తమాన స్థితిగతులు ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అవి తప్పకుండా మెరుగుపడతాయనే పరిపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం భారతీయుల విశిష్ట లక్షణంగా ఉంది. ఈ నేఫథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు వచ్చే ఆరు నెలల్లో మరింతగా దిగజారనున్నాయని 34శాతం మంది గట్టిగా అభిప్రాయపడడం నన్ను విస్మయపరిచింది. ఆరు నెలల క్రితం నిర్వహించిన ఇదే సర్వేలో 31శాతం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఆరు నెలల్లో తప్పకుండా మెరుగుపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొవిడ్ రెండవ దశలో మినహా దేశ ప్రజలను ఆర్థిక నైరాశ్యం ఇంతగా ఆవహించిన మరో సందర్భమేదీ నాకు గుర్తు రావడం లేదు.


సర్వేల నిర్వహణలో అనుభవజ్ఞుడిగా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలకు ప్రజల ప్రతిస్పందనలను నేను పూర్తిగా విశ్వసిస్తాను. ‘జాతి మనస్థితి సర్వే’లో గత ఆరు సంవత్సరాలుగా అడుగుతున్న ప్రశ్న ఒకటి ఉంది. అది: ‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీ ఆర్థిక పరిస్థితి ఏవిధంగా మారింది?’ నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించి ఈ ప్రశ్నను అడగడం గమనార్హం. ఆయనకు ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతున్నందున ఆ ప్రశ్నకు సానుకూల స్పందనలే ఎక్కువగా వచ్చే ఆస్కారముంది. అయితే తాజా సర్వేలో 36శాతం మంది తమ ఆర్థిక పరిస్థితులు బాగా దిగజారిపోయాయని స్పష్టంగా చెప్పారు. 2014 తరువాత తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పిన వారు 28శాతం మంది మాత్రమే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ భవిష్యతు గురించి కూడా ఇదే వైఖ రిని వ్యక్తం చేసిన వారే అధికంగా ఉన్నారు. సమీప భవిష్యత్తులో దేశ ఆర్థికం మెరుగుపడుతుందని భావించిన వారి కంటే ఇంకా ఘోరంగా దిగజారిపోతుందని చెప్పిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కఠోర వాస్తవాలు ఏ ప్రభుత్వాన్ని అయినా కలవరపరుస్తాయి. అలాగే ఎన్నికల గోదాలోకి దిగినప్పుడు ప్రతిపక్షాల నుంచి పాలకపక్షాలు తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం అనివార్యమవుతుంది. అయితే దుర్భర ఆర్థిక పరిస్థితులకు ప్రభుత్వమే కారణమని ప్రజలు భావిస్తున్నారా లేదా అనే విషయంపైనే ఆ పరిణామాలు చోటుచేసుకోవడం లేదా చోటుచేసుకోకపోవడమనేది ఆధారపడి ఉంది.


మరి తాజా సర్వే ఫలితాలు ఈ విషయంలోనూ మోదీ సర్కార్‌కు మోదం కలిగించేవిగా లేవు. ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల సానుకూలత వ్యక్తం చేసినవారు 48శాతం మంది మాత్రమే. గత ఆరు సంవత్సరాలలో మోదీ సర్కార్ ఆర్థిక విధానాల పట్ల సానుకూలత అంత తక్కువగా ఉండడం ఇదే మొదటిసారి. మోదీ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన వారు 29శాతం మేరకు ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. ఎన్డీఏ ప్రభుత్వ ‘పెద్ద వైఫల్యం’ ఏమిటని ప్రశ్నించగా అత్యధిక స్పందనలు ఆర్థిక వ్యవస్థ సంబంధితమైనవిగా ఉన్నాయి. అవి: ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి. ఆర్థిక విధానంపై ప్రతికూల అంచనా, సానుకూల మూల్యాంకాన్ని ఇంకా మించలేదు. అయితే మొత్తం మీద ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల సానుకూల వైఖరి బాగా వ్యక్తమయింది. కశ్మీర్, అయోధ్యలో ఆలయ నిర్మాణం, అవినీతి, ఆశ్చర్యకరంగా కొవిడ్ మొదలైన అంశాలు ఈ సానుకూల వైఖరికి కారణాలని చెప్పవచ్చు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోవడం ప్రభుత్వాన్ని అమితంగా ఆందోళనకు గురిచేయడం ఖాయం.


నరేంద్ర మోదీ ప్రభుత్వ అంతానికి ఇది ఆరంభమా? అలా భావించడం తొందరపాటు నిర్ణయమే కాగలదు. ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్ఠలకు కొదవ లేదు. అయితే ఆయన పాలన సవ్యంగా లేదని గట్టిగా అభిప్రాయపడుతున్న వారి సంఖ్య మున్నెన్నడూ లేని రీతిలో అధికంగా ఉన్నది. ప్రజాదరణ విషయంలో ఆయనకు చేరువగా వచ్చే ప్రతిపక్ష నాయకుడు ఎవరూ లేరు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వారూ అత్యధికంగా ఉన్నారు. అయితే ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం, భావ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడం పట్ల ప్రజాగ్రహం పెద్దగా వ్యక్తం కాలేదు. ఉదారవాద ప్రజాస్వామ్య గొప్పదనాని కంటే పాలకుల దురహంకార ప్రవృత్తి, కక్ష సాధింపు ధోరణులకే మన ప్రజలు ఎక్కువగా అలవాటుపడిపోయారు మరి. 2024 సార్వత్రక ఎన్నికల ఫలితాలు ఖాయంగా బీజేపీకే అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయం ఒకటి గట్టిగా వ్యక్తమవుతోంది. అయితే వాస్తవమేమిటి? వాస్తవాలు ఆ అభిప్రాయాన్ని బలపరిచేవిగా లేవు. బీజేపీ ప్రచార వ్యూహాలలో భాగంగానే ఆ అభిప్రాయానికి అమిత ప్రాచుర్యం లభిస్తోంది. అటువంటి వ్యవహారాల్లో బీజేపీ చాలా దిట్ట. అలా అని ఓటమి దిశగా బీజేపీ పయనిస్తోందనడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు. బిహార్ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ దుర్భర పరిస్థితుల కారణంగా జాతీయ పాలకపక్షం గట్టి పోటీ నెదుర్కొంటుందనడంలో సందేహం లేదు. ఈ చారిత్రక బాధ్యతను సమర్థంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది.

అమృతకాలంలో ఆర్థిక నైరాశ్యం...!

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.