చరిత్ర ఎరుగని ఆర్థిక అరాచకం

ABN , First Publish Date - 2022-01-11T06:06:28+05:30 IST

వచ్చేమే నెలాఖరుకు జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. సాధించింది ఏమిటో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ గొప్ప పని లేదు. మహాద్భుతాలు సాకారం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని చరిత్ర ఎరుగని...

చరిత్ర ఎరుగని ఆర్థిక అరాచకం

వచ్చేమే నెలాఖరుకు జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. సాధించింది ఏమిటో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ గొప్ప పని లేదు. మహాద్భుతాలు సాకారం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని చరిత్ర ఎరుగని సంక్షోభంలోకి, ప్రజల్ని గతమెన్నడూ ఎరుగని బాధల్లోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా స్వార్థ నాయకులతో అభివృద్ధి చెందవు. సమర్థత, సామాజిక దృక్పథం ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ అనుభవించడానికి, ఆరగించడానికి, కక్ష సాధింపులకే వినియోగించారు. ఆయన దుష్పరిపాలన రాష్ట్రాన్ని ఎంతటి అథోగతి పట్టించిందో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక కూడా వెల్లడించింది. 


జన ఖజానా దోచుకోవడమే ఏకైక ఎజెండాగా కొలువు తీరిన జగన్ జమానాలో అక్రమాలు ఎంత విశృంఖలంగా సాగుతున్నాయో కాగ్ నివేదిక కళ్ళకు కట్టింది. జగన్ ప్రభుత్వ విధానాలను కాగ్ తూర్పారబట్టింది. శాసనసభ నిబంధనలను నీరుగారుస్తున్నారని, సభ ఆమోదం పొందకుండానే అనుబంధ పద్దులు ఎలా ఖర్చు చేస్తారని, ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని కాగ్ హెచ్చరించింది. బడ్జెట్టులో చూపకుండా అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్న వ్యవహారాన్ని తప్పు పట్టింది. ఆర్థిక అరాచకంతో రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు, రాజకీయ ప్రయోజనమే ముఖ్యం అన్న విధంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రమేగతిన బాగుపడేను! ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. శక్తికి మించి చేస్తున్న అప్పులు ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? అప్పులు, అబద్ధాలు... ఇవే జగన్ ప్రభుత్వం సాధించిన ఘన కార్యాలు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని గగ్గోలు పెట్టిన పెద్దమనుషులు తమ హయాంలో చేసిన హద్దులు లేని అప్పులకు ఏం సమాధానం చెబుతారు? ఆనాడు తప్పుగా కనిపించిన అప్పులు నేడు ఒప్పుగా కనిపిస్తున్నాయా? తెచ్చిన ప్రతి అప్పుపైన, ఖర్చుపైన లెక్కలు రాశామని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. అలాగైతే రాష్ట్ర అభివృద్ధిపైన, తెచ్చిన అప్పులపైన శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచగలరా?   


రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఆందోళనకరమైన వాస్తవాలు వెలువడబోతున్నాయి. మూసిపెడితే పాచిపోతుంది అనే సామెత త్వరలోనే నిజం కానున్నది. ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆంధ్రప్రదేశ్ ని మింగేయబోతున్నాయి. పూట గడవాలంటే కొత్త అప్పులు తీసుకోక తప్పటం లేదు. రెండున్నరేళ్లు భారీగా అప్పులు తేవడం తప్ప ఎక్కడా ఒక్క ఆస్తిని సృష్టించలేదు. తెచ్చిన ఋణాల్లో 80శాతం రెవెన్యూ వ్యయానికే ఖర్చు చేశారని కాగ్ తప్పుపట్టింది. తెచ్చిన ఋణాలను ఆస్తుల కల్పనకు వాడకుండా, ఇలా రెవెన్యూ వ్యయాల కోసం ఎక్కువ ఖర్చు చెయ్యడం వల్ల భవిష్యత్తులో తీర్చాల్సిన ఋణభారం బాగా పెరిగిపోయి రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర ఋణాలను పద్దుల్లో చూపకపోవడం వల్లనే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎమ్. చట్టానికి లోబడే ఉన్నట్లు కనిపిస్తున్నాయని, వాటిని కూడా పరిగణిస్తే నిబంధనలు దాటి ఉండేవని కాగ్ తెలిపింది.


ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంపై వాస్తవిక అంచనాలను రూపొందించుకోవడంలోను, రెవెన్యూ వ్యయ నియంత్రణలోను విఫలమైందని, అందుకే రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిందని కాగ్ తెలిపింది. రెవెన్యూ లోటు 2018–19లో 12శాతంగా ఉండగా 2019–20లో 23.81శాతంగా నమోదైంది. 2018–19తో పోలిస్తే ఇది 90.24శాతం ఎక్కువ. 2019–20 బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వ రెవెన్యూ లోటు రూ.1,779కోట్లు చూపగా అది ఏకంగా రూ.26,441కోట్లుగా నమోదైంది. 2022లోనైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలన్న ఆలోచన ప్రభుత్వంలో కనపడటం లేదు. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక దిశగా అడుగులు పడటం లేదు. రెండున్నరేళ్ల తన పాలనా దుష్ఫలితాలపై సమీక్ష లేదు. రాష్ట్ర భవిష్యత్తు తల్చుకుంటే ఆందోళనకరంగా ఉంది. 2022లో కూడా ఇవే వైఫల్యాలు ఎదురైతే ఇక ఈ రాష్ట్రాన్ని బాగుచేయడం ఎవరికీ శక్యం కాదు. 


2018–19తో పోలిస్తే రాష్ట్ర ఆర్థిక పతనం అనూహ్య వేగాన్నందుకుంది. ఆర్థిక రంగంలో తిరోగమనం, మైనస్ గ్రోత్ రేట్, తలసరి ఆదాయంలో క్షీణత. ఈ ఆర్థిక విధ్వంసం, అస్థిరత నుంచి రాష్ట్రానికి స్థిరత్వం కల్పించగలమా అనేది సందేహస్పదమే? రెవిన్యూలోటు 918శాతానికి ఎగబాకింది. ద్రవ్యలోటు 388శాతానికి పెరిగిపోయింది. రాకెట్ స్పీడులో దూసుకెళ్తున్న రెవిన్యూలోటు అతి త్వరలోనే ద్రవ్యలోటును కూడా దాటిపోనున్నది. మొత్తం అప్పులు 445శాతానికి పెరిగాయి (బడ్జెటేతర అప్పులతో కలిపి). రెవిన్యూ ఆదాయాలు 212శాతం మాత్రమే పెరిగాయి. మొత్తం అప్పుల కూడిక రాష్ట్ర రెవిన్యూ ఆదాయాన్ని దాటిపోవటం చరిత్రలో చూడలేదు. గ్యారంటీలు 90శాతం నుంచి 180శాతానికి పెరగడం అస్థిరతతకు దారితీయడమే కాకుండా, చెల్లింపులకే పెనువిఘాతం కానుంది. ఇప్పటికే రాష్ట్ర అప్పు 7లక్షల కోట్లు దాటింది. 


అప్పులు తెచ్చిపడేస్తూ, రాష్ట్రంలో ఒక్క ఆస్తినీ సృష్టించకుండా వైసీపీ నాయకులు తమ ఆస్తులు మాత్రం పెంచుకొంటున్నారు. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నాయి. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ 14.5శాతానికి, కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ 4.5శాతానికి చేరడం ఆందోళనకరం. మల్టీ డైమన్షనల్ పావర్టీ రాష్ట్రంలో 20శాతానికి చేరింది. ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయి. విభజన సమస్యలను, ప్రత్యేకహోదాను గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టును బలి తీసుకొన్నారు. రాజధాని అమరావతికి మరణ శాసనం రాశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయ సంక్షోభం కారణంగా గ్రామీణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు పనులు లేక నిరాశలో వలస బాట పడుతున్నారు. పదవ తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసినవారికి 30శాతం పైగా పింఛన్లు అందలేదు. కేంద్రం కొత్త అప్పులకు అనుమతి ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి అథోగతే అని చెప్పాలి. అప్పులకు అనుమతి కోసం ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను ఒప్పించేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. జగన్‌ రెడ్డి పాలనలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని దేశచరిత్రలో ఎన్నడూ చూడలేదు.


యువతే రాష్ట్రానికి భవిత. అటువంటి యువతని నిరుద్యోగ సంక్షోభం చుట్టుముట్టింది. చదువుకొన్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రజలపై బండెడు భారాలు మోపి గుప్పెడు పథకాలతో వారిని ఏమారుస్తున్నారు. వివిధ రూపాల్లో సమస్త ఛార్జీలు పెంచి, పన్నులు వేసి రూ.85వేల కోట్ల భారం మోపారు. కడుపు నింపని, అవసరాలు తీర్చని కనికట్టు నవరత్నాలతో విన్యాసాలు చేస్తున్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేశామని బడాయి ప్రకటనలు ఇస్తున్నారు. సంక్షేమానికి కాదు, సంక్షోభానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెనుభారం పొంచి ఉంది. రానున్న రోజుల్లో ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వినియోగదారులపై రూ.26,475కోట్ల భారం మోపనున్నారు. ఇది ప్రజలు భరించగలరా?


జగన్ పాలనలో వైసీపీ నాయకులు తప్ప ఎవరు సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజల వదనాల్లోనూ చిరునవ్వు కనిపించడంలేదు. జగన్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజన ఎజెండా తప్ప, రాష్ట్రాభివృద్ధి ఎజెండా లేదు. ఇప్పటికైనా జగన్ పరిపాలనలో రాష్ట్రం పురోగమించిందా, అథోగతి పాలైందా అన్నది  ప్రజలు, పౌర సమాజం, మేధావులు ఆలోచించాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రులు ప్రశ్నించడం మొదలుపెట్టాలి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ఆర్థిక అరాచకానికి పాల్పడిన దాఖలాలు లేవు. ప్రజా చైతన్యమే అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం కాగలదు. ప్రభుత్వం 2022 సంవత్సరంలోనైనా రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించాలి. అహంకారం, నిరంకుశత్వం, మొండివైఖరి, కక్షసాధింపు... ఇవన్నీ వీడి సుపరిపాలనపై దృష్టిపెట్టాలి.

యనమల రామకృష్ణుడు

మాజీ ఆర్థిక మంత్రి

Updated Date - 2022-01-11T06:06:28+05:30 IST