డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతల చిట్టా ఇస్తా

ABN , First Publish Date - 2022-04-04T09:59:42+05:30 IST

డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతల చిట్టా బహిర్గతం చేస్తా.. దమ్ముంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్టు చేస్తారా..?’...

డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతల చిట్టా ఇస్తా

వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారా..?  

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ 

షాద్‌నగర్‌, ఏప్రిల్‌, 3: ‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతల చిట్టా బహిర్గతం చేస్తా.. దమ్ముంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్టు చేస్తారా..?’ అని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పాలమూరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం క్రికెట్‌ కప్‌ పోటీలను ఆయన ఆదివారం జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. డ్రగ్స్‌ కేసుల్లో బీజేపీ నేతలు ఉంటే వెంటనే అరెస్టు చేయాలని చెప్పారు. ఈ కేసుల్లో పెద్ద తలకాయలను పక్కనపెట్టి అనామకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం కాలయాపన, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్‌ కేసును ముందుకు తెస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 200 స్టేడియాలను టీఆర్‌ఎస్‌ కబ్జా చేసి వాటిని టీఆర్‌ఎస్‌ కార్యాలయాలుగా మారుస్తోందని ఆరోపించారు. ఏటా క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయిస్తున్నా, రూపాయి కూడా ఖర్చుచేయడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతల బార్లు, వైన్‌షాపుల వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఉండదని.. ఇతరుల షాపులు, బార్ల వద్దనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను వెలికి తెచ్చేందుకు పాలమూరు జిల్లా కేంద్రం నుంచి ఈ నెల 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్‌ తెలిపారు.

Updated Date - 2022-04-04T09:59:42+05:30 IST