సుక్క తాగక సెక్కరొచ్చెరో!

ABN , First Publish Date - 2020-03-31T08:23:34+05:30 IST

ఏళ్ల తరబడి కల్లు తాగేందుకు అలవాటు పడిన వారు ఒక్కసారిగా అది దూరమయ్యేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కల్లు డిపోలు మూత పడడంతో రాష్ట్రవ్యాప్తంగా

సుక్క తాగక సెక్కరొచ్చెరో!

‘కల్లు మత్తు’ అందక వింత ప్రవర్తన.. పెరుగుతున్న బాధితులు

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఆరుగురు మృత్యువాత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఏళ్ల తరబడి కల్లు తాగేందుకు అలవాటు పడిన వారు ఒక్కసారిగా అది దూరమయ్యేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కల్లు డిపోలు మూత పడడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం గుక్కెడు కల్లు గొంతులో పడకపోతే ఆగమాగమయ్యే వారికి.. ఏకంగా వారం రోజులుగా అందుబాటులో లేకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. కల్లు మత్తు లేకపోవడం.. కనీసం మద్యం తాగుదామనుకున్నా.. అదీ దొరక్క మతి స్థిమితం కోల్పోతున్నారు. మరి కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కల్లు, మద్యం దొరక్క రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఆరుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొడిచర్లలో మతిస్థిమితం కోల్పోయిన చింతకింది లక్ష్మయ్య(39) విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లా మద్గుల్‌ చిట్టంపల్లికి చెందిన బురాంతపల్లి భీమయ్య(75).. మద్యం లభించక పోవడంతో ుతిస్థిమితం కోల్పోయాడు.


శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన సోమవారం దామగుండం అడవుల్లో మృతి చెంది కనిపించాడు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలోని బూరుగుపల్లికి చెందిన చాకలి రాచయ్య(42)... రెండు రోజుల నుంచి మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని మంచినీటి బావిలో రాచయ్య మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. నవాబుపేట మండలం ఎకమామిడిలో గోరియా వెంకటమ్మ(45).. కల్లు దొరక్క శుక్రవారం కళ్లు తిరిగి పడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆదివారం గ్రామానికి తీసుకురాగా, సోమవారం తెల్లవారుజామున మరణించింది. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన రాజయ్య(65) కల్లు దొరక్క ఫిట్స్‌ వచ్చి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మీ కాలువలో గల్లంతైన కట్కె శంకర్‌(60) మృతదేహం సోమవారం లభ్యమైంది. 

Updated Date - 2020-03-31T08:23:34+05:30 IST