కరోనాపై డీఆర్‌డీవో సమరం

ABN , First Publish Date - 2020-03-27T10:44:23+05:30 IST

మహమ్మారి కరోనాపై సమరంలో.. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) నేను సైతం అంటోంది. వైరస్‌ నిరోధంలో కీలకమైన

కరోనాపై డీఆర్‌డీవో సమరం

యుద్ధప్రాతిపదికన నాణ్యమైన వస్తువుల రూపకల్పన

శానిటైజర్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు, బాడీ సూట్‌ తయారీ

ప్రైవేటు కంపెనీలతో కలిసి ఉత్పత్తి ప్రారంభం 

త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం

ఆంధ్రజ్యోతితో డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి 


హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మహమ్మారి కరోనాపై సమరంలో.. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) నేను సైతం అంటోంది. వైరస్‌ నిరోధంలో కీలకమైన హ్యాండ్‌ శానిటైజర్లు, క్రిటికల్‌ కేర్‌ వెంటిలేటర్లు, ఎన్‌-99 అడ్వాన్స్‌డ్‌ మాస్క్‌లు, బాడీ సూట్‌ల తయారీకి నడుంబిగించింది. సంస్థ శాస్త్రవేత్తలు కేవలం మూడు వారాల్లోనే వీటిని రూపొందించడం విశేషం. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ వస్తువులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రైవేటు పరిశ్రమలతో ఒప్పందం పూర్తయిందని, ఉత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పారు. వైర్‌సను అరికట్టడంలో డీఆర్‌డీవో పాత్రతో పాటు పలు కీలక విషయాలను చైర్మన్‌ సతీ్‌షరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్యం కోసం ఉపయోగించే వస్తువులను ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీవో, ప్రైవేటు పరిశ్రమల మధ్య ఒప్పందాలు అంత సులభంగా జరుగవని, కానీ, విపత్తు దృష్ట్యా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. సరికొత్త సాంకేతికత ఉపయోగించి తమ శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే నాణ్యమైన వస్తువులకు రూపకల్పన చేశారని అభినందించారు. చాలా తక్కువ ధరకే వీటిని అందించనున్నట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..


రోజుకు 30 వేల లీటర్ల శానిటైజర్‌ తయారీ

కరోనా నిరోధంలో ముఖ్యమైన హ్యాండ్‌ శానిటైజర్‌ను రోజుకు 20 వేల నుంచి 30 వేల లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. ఒక్కో బాటిల్‌ ధర రూ.120. ఇప్పటికే 4 వేల లీటర్ల శానిటైజర్‌ను సైన్యానికి అందించాం. పార్లమెంట్‌కు 300 లీటర్లు, ఇతర రక్షణ విభాగాలకు 500 లీటర్లు సమకూర్చాం. ఢిల్లీ పోలీసులకు వెయ్యి లీటర్ల శానిటైజర్‌ పంపిణీ చేశాం.


మల్టీ పేషంట్‌ వెంటిలేటర్స్‌

ఒకేసారి పలువురు రోగులకు ఉపయోగించేలా మల్టీ పేషెంట్‌ వెంటిలేటర్‌ను రూపొందించాం. ఇవి వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. 


మొదటి నెలలో 5 వేలు, తర్వాత నెల నుంచి 10 వేల వెంటిలేటర్లను అందించగలం. ఒక్కో దాని ధర రూ.4 లక్షల వరకు ఉంటుంది.


ఐదు లేయర్లతో మాస్క్‌లు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎన్‌-95 మాస్క్‌లను మించిన మన్నికతో ఎన్‌-99 మాస్క్‌లను అభివృద్ధి చేశాం. ఈ మాస్క్‌ ఐదు లేయర్లతో ఉంటుంది. వీలో రెండు నానో మాష్‌ లేయర్లు. కరోనాను అడ్డుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు 10వేల మాస్కులను తయారు చేయనున్నాం. ఒక్కోదాని ధర రూ.70.


నాణ్యమైన పాలిస్టర్‌తో బాడీ సూట్‌

చికిత్సలో పాల్గొనే వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులను వైరస్‌ నుంచి రక్షించేందుకు శరీరాన్ని ఆసాంతం కప్పి ఉంచేలా నాణ్యమైన పాలిస్టర్‌తో బాడీ సూట్‌ రూపొందించాం. రోజుకు 10 వేల సూట్స్‌ తయారు చేస్తాం. ఒక్కోదాని ధర రూ.7 వేలు.

Updated Date - 2020-03-27T10:44:23+05:30 IST