Abn logo
May 23 2020 @ 02:35AM

మేం నమ్మలేం!

Kaakateeya

డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి

‘వైసీపీ రంగుల’ జీవో మళ్లీ కొట్టివేత

వలస కూలీలపై నిర్దిష్ట ఆదేశం

ఒకే రోజు మూడు కీలక తీర్పులు

పొంతన లేకుండా ప్రభుత్వ నివేదికలు

పెద్ద కుట్ర ఉందేమో తేలాల్సిందే

స్వతంత్ర సంస్థతోవిచారణ జరగాలి

సుధాకర్‌ కేసు సీబీఐకి అప్పగిస్తున్నాం

తక్షణం దర్యాప్తు

8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలి

హైకోర్టు కీలక ఆదేశాలు

బలహీనుడి అరెస్టుకు ఏడుగురా?

ఆరు గాయాలుంటే ఒక్కటే అని ఎందుకు చెప్పారు?

ఆస్పత్రి సర్టిఫికెట్‌ సంగతీ తేలుస్తాం

మా జోక్యం తర్వాతే ‘మానసిక స్థితి’పై ప్రకటన

మేజిస్ట్రేట్‌ నివేదికను పరిశీలిస్తే ఆయన స్థితి బాగున్నట్లుగానే ఉంది!

మొత్తం వ్యవహారంలో ఏదో మతలబు

అదేదో తేల్చేందుకే సీబీఐ దర్యాప్తు

ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిప్పులు


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి, పరస్పర విరుద్ధ నివేదికలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానముంది. ఆ సంగతి తేలాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరగాల్సిందే’’ అంటూ ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. బాధ్యులందరిపైనా కేసు నమోదు చేసి తక్షణం దర్యాప్తు చేపట్టాలని, 8 వారాల్లోగా మధ్యంతర నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్‌ను పరిశీలించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన మేజిస్ట్రేట్‌ ఇచ్చిన నివేదికకు, ప్రభుత్వ యంత్రాంగం దాఖలు చేసిన కౌంటర్లకు, డాక్టర్‌ సుధాకర్‌ ఇచ్చిన వాంగ్మూలానికి అస్సలు పొంతనే లేదని హైకోర్టు తెలిపింది.


‘‘డాక్టర్‌ శరీరంపై ఒక గాయముందని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పేర్కొన్నారు. డీజీపీయేమో విశాఖ పోలీసు కమిషనర్‌ వైపు చూస్తారు. పోలీసు కమిషనర్‌ వైద్యుడు ఇచ్చిన సర్టిఫికెట్‌ను చూపిస్తారు. డాక్టరేమో ఒకే ఒక గాయముందని సర్టిఫికెట్‌ ఇచ్చారు. కానీ... ఆరు గాయాలున్నట్లు మేజిస్ట్రేట్‌ ఫొటోలతో సహా స్పష్టంగా నివేదిక ఇచ్చారు. అంటే... ప్రభుత్వ యంత్రాంగం దాఖలు చేసిన కౌంటర్లు, నివేదికలన్నీ తప్పుడువేనని మేం భావించాలా? సుధాకర్‌ శరీరంపై అన్ని గాయాలుంటే.. ఆయనకు ఒకే ఒక గాయముందని ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారు? ఆ సంగతీ తేలుస్తాం?’’ అని ఘాటుగా స్పందించింది.


విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పని చేసిన డాక్టర్‌ సుధాకర్‌ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. అలాగే... డాక్టర్‌ సుధాకర్‌ పట్ల అమానుషంగా వ్యవహరించిన విశాఖ పోలీసులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిల్స్‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 2 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిపింది.


ముక్కలు ముక్కలుగా వీడియో...

విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్ల తరఫున దాఖలు చేసిన కౌంటర్లను, సుధాకర్‌కు సంబంధించి వారు సమర్పించిన వీడియోలను పరిశీలించింది. అదే విధంగా టీడీపీ నేత అనిత పంపించిన వీడియోను కూడా పరిశీలించింది. ఈ రెండింటికీ తేడా ఉండడం పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన వీడియోల్లోని దృశ్యాలు ఖండఖండాలుగా ఉన్నాయని, కొనసాగింపుగా లేవని అసహనం వ్యక్తం చేసింది. అవి సంపూర్ణంగా ఉన్నట్లు పరిగణించలేమని తెలిపింది.  హైకోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా ఉన్న సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ..  సీఎస్‌ దాఖలు చేసిన కౌంటర్‌లో డీజీపీ నివేదిక ఆధారంగా అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ‘‘ఆమె డీజీపీ నివేదిక ఆధారంగానే కౌంటర్‌ వేశారు తప్ప, సొంతంగా పరిశీలించి దాఖలు చేయలేదని అర్థమవుతోంది. డీజీపీ కౌంటర్‌లో హోంగార్డు వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని... సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో వచ్చిన దృశ్యాలు సరికాదని పేర్కొన్నారు.


ఎడిట్‌ చేసి రిలీజ్‌ చేశారని చెప్పారని చెప్పారు. ఏది సరైనదో, ఏది తప్పుడుదో తేలాలంటే ధర్మాసనమే వాటిని పరిశీలించాల్సి ఉంది’’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘అలాగైతే మేం దర్యాప్తు సంస్థగా వ్యవహరించాల్సి ఉంటుంది, అది అయ్యే పనేనా?’’ అని వ్యాఖ్యానించింది. దీనిపై వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ... అయితే, సీబీఐలాంటి స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అదేవిధంగా డాక్టర్‌ సుధాకర్‌ బలహీనంగా ఉన్నారని, ఆయన్ని ఏడుగురు పోలీసులు కట్టేసి, కొట్టడం వీడియోల్లో కనిపిస్తోందని, అక్కడ అంత అవసరమేముందని ప్రశ్నించారు. మరో పిటిషనర్‌ తరఫున జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 


ఇందులో మతలబు... 

డాక్టర్‌ సుధాకర్‌ ఘటన 16వ తేదీన జరగ్గా, హైకోర్టు 18వ తేదీన సుమోటోగా కేసు తీసుకుందని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘ఆయనను 20వ తేదీన తమ ముందు హాజరు పరచాలని ఆదేశించగా... 19వ తేదీన మెంటల్‌ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి, ఆయన స్థితి బాగా లేదని రిపోర్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. మరునాడు నలుగురు వైద్యుల బృందం కూడా సుధాకర్‌కు అదే స్థితి ఉన్నట్లు రాశారు. కోర్టు జోక్యం తరువాత ఈ నివేదికలు సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే, ఇక్కడ ఏదో మతలబు ఉందని అనిపిస్తోంది. వైద్యుల నివేదికల పైనా అనుమానాలున్నాయి. సరైన దర్యాప్తు జరిగితేనే ఈ అనుమానాలు నివృత్తి అవుతాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. సుధాకర్‌ వాంగ్మూలాన్ని బట్టి పోలీసుల చర్య తీవ్రమైనదిగానే అనిపిస్తోందని అభిప్రాయపడింది. ‘‘16వ తేదీన డాక్టర్‌ సుధాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను జుడీషియల్‌ కస్టడీకి గానీ, పోలీసు కస్టడీకి గానీ ఎందుకు తీసుకోలేదు? ఈ నిర్బంధం లీగలా? ఇల్లీగలా? అన్నది తేలాల్సి ఉంది. సుధాకర్‌ తన వాంగ్మూలంలో రాష్ట్ర పోలీసులపై, అధికారులపై పలు ఆరోపణలు చేశారు.


ఇలాంటి స్థితిలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఇదే పోలీసులను ఆదేశించలేం. స్వతంత్ర సంస్థతోనే దర్యాప్తు నిష్పాక్షికంగా సాగుతుంది’’ అని ధర్మాసనం తెలిపింది. మన దేశంలో అన్ని దర్యాప్తు సంస్థలలోకెల్లా సీబీఐ ఉత్తమమైనదన్న పేరుంది కాబట్టి ఆ సంస్థతోనే దర్యాప్తు చేయించాలని నిర్ణయించామని ప్రకటించింది. రాష్ట్ర పోలీసులు సుధాకర్‌పై నమోదు చేసిన కేసును కూడా సీబీఐకే బదిలీ చేసింది. ‘‘ఇందులో పెద్ద కుట్ర ఏదైనా దాగి ఉందా లేదా అన్నది తేల్చాలి. రికార్డులు, వీడియోల కాపీలను సంబంధిత సీబీఐ అధికారికి అప్పగించాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విషయంలో అమికస్‌ క్యూరీ సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి బాగా సహకరించారని, ఆయన సహకారం వల్లనే ఈ ఆదేశాలను జారీ చేస్తున్నామని తెలిపింది. ఆయనకు ధర్మాసనం అభినందనలు తెలియజేసింది.


సుధాకర్‌ అతిగా వ్యవహరించారు.. ప్రభుత్వ న్యాయవాది

ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. డాక్టర్‌ సుధాకర్‌ 16వ తేదీన విశాఖ రోడ్డుపై అసహజంగా వ్యవహరించారని, అక్కడున్న పోలీసులను, లారీ, ఆటోడ్రైవర్లను దూషించడంతో పాటు చేయి చేసుకున్నారని తెలిపారు. ఆయన్ని అదుపు చేసేందుకే పోలీసులు అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. తాము సమర్పించిన వీడియోలను పరిశీలిస్తే నిజానిజాలు అవగతమవుతాయని పేర్కొన్నారు. ఆ వీడియోల్లో డాక్టర్‌ సుధాకర్‌ దూషణలు, కొట్లాట స్పష్టంగా ఉందని వివరించారు. వీడియోలను పరిశీలించిన ధర్మాసనం.. డాక్టర్‌ సుధాకర్‌ కూడా కొంత అసహజంగా, అతిగా స్పందించినట్లే ఉందని అభిప్రాయపడింది.


ఆ ఐదు గాయాలు ఎలా?

విశాఖ మేజిస్ట్రేట్‌ సమర్పించిన నివేదికలోని  సుధాకర్‌ వాంగ్మూలాన్ని, ఆయన శరీరంపై 6 గాయాలున్నట్లు గుర్తించే ఫొటోలను కూడా ధర్మాసనం పరిశీలించింది. సీఎస్‌, డీజీపీ దాఖలు చేసిన కౌంటర్లలో డాక్టర్‌ ఎడమ కనుబొమ్మపై చిన్న గాయం ఉన్నట్లు పేర్కొన్నారని... మేజిస్ట్రేట్‌ ఇచ్చిన నివేదికలో ఆరు గాయాలున్నట్లు తేలిందని తెలిపింది. ‘‘ఇంత తేడా ఎందుకు వచ్చింది. మిగిలిన ఐదు గాయాల గురించి ఎందుకు చెప్పలేదు? మేజిస్ట్రేట్‌ పంపిన ఫొటోలు అబద్ధం చెప్పవు కదా!  సుధాకర్‌ను పరిశీలించిన విశాఖ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఒక్క గాయమున్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇదెలా సాధ్యం? ప్రభుత్వ నివేదికలు నమ్మే స్థితిలో లేవు’’ అని పేర్కొంది. ‘‘సుధాకర్‌ అరెస్టు ఘటన ఈ నెల 16న  జరిగింది. 20వ తేదీన మేజిస్ట్రేట్‌ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ ఒంటిపై గాయాలను పరిశీలించారు. అప్పటికీ ఆ ఆరు గాయాలున్నాయంటే అవి పెద్దవనే భావించాల్సి ఉంటుంది. ఆ గాయాలు ఎప్పుడయ్యాయి? ఎలా అయ్యాయి అన్నది తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అధికారుల కౌంటర్లకు, సుధాకర్‌ వాంగ్మూలానికి పొంతనే లేదని తెలిపింది. ‘‘ఇందులో ఏది వాస్తవమనే సహేతుకమైన అనుమానం కలుగుతోంది.


డాక్టర్‌ సుధాకర్‌ను ఏడుగురు వ్యక్తులు అదుపు చేయలేకపోయారన్న ప్రభుత్వ వాదన కూడా సంతృప్తికరంగా లేదు. ఆయనను ఘటనా స్థలి నుంచి స్టేషన్‌కు, అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు గంటలపాటు స్టేషన్‌లోనే ఉంచినట్లు తేలింది. మరి ఆ సమయంలో మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరచలేదు? మేజిస్ట్రేట్‌ సమర్పించిన నివేదిక ప్రకారం డాక్టర్‌ సుధాకర్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించడం లేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న రోజే మెంటల్‌ ఆసుపత్రికి తరలించినట్లు కౌంటర్‌లో చెప్పారు. అదే నిజమైతే ఆయనను ఎప్పుడు ఎగ్జామిన్‌ చేశారు?’’ అని ధర్మాసనం నిలదీసింది. 


Advertisement
Advertisement