Abn logo
Oct 18 2020 @ 04:41AM

న్యూరాలజీలో పరిశోధనలే లక్ష్యం

Kaakateeya

పక్షవాతం, అల్జీమర్స్‌కు మందులు కనిపెట్టడం నా ఆశయం

నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఫస్ట్‌ ర్యాంకర్‌ డాక్టర్‌ దావులూరి అనుదీప్‌


 హైదరాబాద్‌, అక్టోబరు 17: మా ఇంట్లో డాక్టర్లు ఎవరూ లేరు. దాంతో అటూ ఇటూ మా గ్రాండ్‌ పేరెంట్స్‌ ఇంట్లో ఒకరైనా డాక్టర్‌ కావాలని అనుకునే వారు. నేను డాక్టర్‌ అయితే చూడాలని కూడా అనేవారు. నిజానికి నాకు సైంటిస్ట్‌ కావాలని ఉండేది. మెడిసిన్‌లో భాగంగా పరిశోధనలు చేయవచ్చని తెలుసుకున్నాను. అయితే మెడిసిన్‌లో చేరి.. రెండో ఏడాది పూర్తి చేసిన తర్వాత పరిశోధన వైపు నా మనసు మళ్ళింది. ఎండి జనరల్‌ మెడిసిన్‌ చేస్తున్నప్పుడు కూడా ఓ సమయంలో ఇక్కడితో ఆగితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా రాకపోలేదు.


అయితే నేను రెగ్యులర్‌గా చూసే రోగులను చూసినప్పుడు నా మనసు మళ్ళీ పరిశోధన వైపు మొగ్గు చూపేలా చేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. న్యూరాలజీ అంటే.. ముఖ్యంగా పక్షవాతం, డిమెన్షియా, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ ఈ టాపిక్‌ పరిధిలోకి వస్తాయి. ప్రధానంగా అవి ఒక వయసు దాటిన తర్వాత వస్తాయి. వచ్చిన వెంటనే ఏ వ్యక్తీ చనిపోరు. అలా అని నాణ్యమైన జీవితాన్నీ అనుభవించలేరు. నిజానికి వాటికి మంచి మందులు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ఆ రోగులు మరొకరిపై ఆధారపడి బతుకుతుంటారు. పక్షవాతం వచ్చిన వ్యక్తుల్లో కొందరు ఎటూ కదల్లేరు. స్వయంగా పనులు చేసుకోలేక సతమతమవుతుంటారు. అల్జీమర్స్‌ అంటే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అందునా ముదిమి వయసులో ఆ స్థితిలో బతకడం అంటే నరకప్రాయమే. ఆ తరహా పేషంట్లను చూస్తూ ఉన్నప్పుడు వారికి సహకరించాలనే ఆలోచన వచ్చింది. అదే.. ఇంకా చదవాలనే దిశగా నన్ను మళ్లించింది. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనేది, మందులు కనుగొనాలనేది నా ఆశయం. ఆ దిశగా పరిశోధనలు కొనసాగించాలని అనుకుంటున్నాను. ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు లెక్కలోకి రావు.


చదువు మధ్యలో డిప్రెషన్‌కు గురైన కొందరిని నేను చూడకపోలేదు. నిరంతరం సాగే స్ట్రగుల్‌ కొందరిని అలా చేసి ఉండవచ్చు. నా వరకు ఆ ఇబ్బంది ఎప్పుడూ ఎదురుకాలేదు. నాన్నగారి బిజినెస్‌ రీత్యా కొంతకాలం బెంగళూరులో ఉన్నాం. అక్కడ రెండో తరగతి వరకు చదువుకున్నాను. మూడో తరగతి నుంచి నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే. ముఖ్యంగా అమ్మ నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. ఆమె లేకుంటే నా చదువు ఇలా కొనసాగేది కాదు. ఎంసెట్‌లో 201వ ర్యాంక్‌తో గాంధీ వైద్య కళాశాలలో చేరాను. ఆ తర్వాత 286వ ర్యాంకుతో నిమ్స్‌లో ఎండి - జనరల్‌ మెడిసిన్‌లో చేరాను. ప్రస్తుతం కోర్సు  పూర్తయింది. ఈ కోర్సులో అటు ప్రాక్టికల్స్‌ ఇటు థియరీ రెండూ ఉంటాయి. టైమింగ్స్‌ పాటించడం అస్సలు కుదరదు.


ఒక్కో రోజు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. వేళకు భోజనం, నా ఇతర అవసరాలు చూసుకుంటూ అమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అలాగే నిమ్స్‌లో నా కోర్సు జనరల్‌ మెడిసిన్‌లో భాగంగా వేర్వేరు విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సు. విభాగం ఏదైనప్పటికీ ఇక్కడి ప్రొఫెసర్లు మాకు ఎంతో సహకరిస్తారు. న్యూరాలజీ స్పెషాలిటీ సైతం ఇక్కడే చేయాలని అనుకుంటున్నాను. అందుకు ఇక్కడ సదుపాయాలు చాలా బాగుంటాయి కూడా. 

Advertisement
Advertisement