వరంగల్ ఘటనలో ఆ ఇద్దరిపైనే అనుమానం!?

ABN , First Publish Date - 2020-05-24T12:35:25+05:30 IST

గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఓ బావి నుంచి బయటపడిన తొమ్మిది మృతదేహాలు మిస్టరీ ఇంకా వీడడం లేదు.

వరంగల్ ఘటనలో ఆ ఇద్దరిపైనే అనుమానం!?

  • బిహారీ కార్మికుల మృతిపై రాని స్పష్టత
  • దొరకని ఆధారాలు.. మరోసారి క్లూస్‌ సేకరణ
  • అనుమానితులతో సంఘటనా స్థలంలో విచారణ
  • ఆ ఫోన్లు ఏమయ్యాయి.. మక్సూద్‌ ఫోన్‌లోనే గుట్టు
  • వివిధ కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు

వరంగల్‌ రూరల్‌ : గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఓ బావి నుంచి బయటపడిన తొమ్మిది మృతదేహాలు మిస్టరీ ఇంకా వీడడం లేదు. కేసును పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియ్‌సగా తీసుకుంటున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడం.. దీనికి తోడు ఆ ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. బిహార్‌ కార్మికులు నీటిలో మునిగిపోవడం వల్లనే మృత్యువాత పడ్డారని ఎంజీఎం పోస్టుమార్టం నిపుణులు తేల్చడంతో కేసులో స్పష్టత వచ్చింది. సజీవంగా అంతమంది ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమయ్యేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు మృతుల్లో ఉండడంతో ఎవరో విష ప్రయోగం చేయడంతో స్పృహ కోల్పోయిన అనంతరం నీటిలో పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. దీనికి తోడు శనివారం సంఘటనా స్థలానికి బీహార్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను తీసుకొచ్చి జరిగిన తీరును వారితో రిహాల్సల్స్‌ చేయించడంతో హత్య అనే కోణానికి బలాన్నిస్తోంది. 


తాడుతో కట్టి షో!

బావిలో నుంచి మృతదేహాలు బయట పడి 48 గంటలు దాటింది. మొదటి రోజు ఆదరాబాదరాగా క్లూస్‌ను స్థానిక బృందం సేకరించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మరోసారి శనివారం ఉదయం మక్సూద్‌ నివాసం ఉంటున్న రెండు గదులను నిశితంగా పరిశీలించి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించింది. మొదటి రోజు గదుల్లోకి ఎవరుబడితే వాళ్లు యథేచ్ఛగా లోపలికి వెళ్లి వస్తువులను కదిపారు. శనివారం ప్రత్యేక బృందం వస్తుందనే నెపంతో అక్కడికి ఎవరూ వెళ్లకుండా అడ్డుగా తాడుతో కట్టి షో చేశారు. చాలా మంది పోలీసులతో పాటుగా, మీడియా ప్రతినిధులు సైతం మృతుల గదుల్లోకి పదుల సంఖ్యలో వెళ్లడంతో నిందితుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇప్పుడు మరోసారి సేకరించడం వల్ల క్లూ దొరుకుతుందా..? అన్న సంశయం నెలకొంది. 


బిహారీలపైనే అనుమానం?

పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై అందరి దృష్టి పడింది. ఇద్దరు వ్యక్తులను సంఘటనా స్థలానికి శనివారం పోలీసులు తీసుకొచ్చారు. బిహార్‌కు చెందిన శ్యాం, శ్రీరాంలకు చెందిన గది దగ్గర పోలీసుల వెంట ఉన్న అనుమానితులతో మాట్లాడారు. భవనం పక్కనే బావి ఉండడంతో ఎలా పడేశారో సరిపోల్చిచూశారు. ఇదిలా ఉంటే మృతులకు సంబంధించిన మొబైల్స్‌ ఇప్పటి వరకు పోలీసులకు లభించలేదు. కేవలం మక్సూద్‌, అతడి కుమార్తె బుస్రాకు చెందిన నెంబర్లతో కాల్‌ డేటాను సేకరించి ఎవరెవరితో వాళ్లు మాట్లాడారనే విషయాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరి వ్యక్తులకే ఎక్కువ సార్లు కాల్స్‌ రావడంతో వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మక్సూద్‌ ఫోన్‌ వర్ధన్నపేట మండలం కట్ర్యాల సమీపంలో సిగ్నల్స్‌ బంద్‌ కాగా, మిగిలిన వారివి బావి పరిసర ప్రాంతాల్లోనే సిగ్నల్స్‌ కోల్పోయాయి. మక్సూద్‌ ఫోన్‌ను ఎవరు తీసుకెళ్లారో ఆ కోణంలో పరిశీలిస్తున్నారు. పోలీసులకు అనుమానం వచ్చిన ప్రతీ నెంబర్‌కు సంబంధించిన సీడీఆర్‌(కాల్‌ డేటా రికార్డు)ను తీస్తుండడంతో గజిబిజీగా మారిపోయింది. 


మిస్టరీ వీడేదెప్పుడో..?

9మంది మృతి ఎలా జరిగిందో ఇప్పటి వరకు అంతుపట్టకుండా మిగిలిపోయింది. వాస్తవానికి సంఘటన జరిగిన భవనంలో ఉండాల్సింది 8 మంది కాగా, అనూహ్యంగా తొమ్మిదో వ్యక్తి బయటపడ్డాడు. ఇది ఎలా జరిగి ఉంటుందో అంతుబట్టడం లేదు. ఘటన జరిగిన భవనం, బావి దగ్గర ఎలాంటి క్లూ లభించకపోవడంతో మక్సూద్‌ ఫోన్‌ చుట్టే విచారణ కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు. అసలు క్లూలే లభించని చోట ఈ ప్రత్యేక బృందాలు ఏం చేస్తాయనే చర్చసాగుతోంది. పోలీసుల అదుపులో ఉన్నవారు మాత్రం నోరు విప్పడం లేదని తెలుస్తోంది. మృతులకు సంబంధించిన ఫోన్లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ పోలీసులు పెద్ద చిక్కుముడిలా ఉండడంతో బావి దగ్గరికి వస్తూ అక్కడే వ్యూహాలను రచించే పనిలో ఉండిపోయారు. మరోపక్క మృతదేహాలు డీకంపోజ్‌ అయ్యే దశకు చేరుకున్నాయి. పోస్టుమార్టం సమయంలో మృతుల నోటి, కడుపులో నుంచి సేకరించి పదార్థాలను విస్రా పరీక్షకు పంపారు. ఆ నివేదిక పది నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-05-24T12:35:25+05:30 IST