డబుల్‌ గృహణం

ABN , First Publish Date - 2022-01-24T07:56:00+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇచ్చేలా చేపట్టిన పథకం.

డబుల్‌ గృహణం

  • నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందని ఇళ్లు
  • పూర్తయిన ఇళ్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ!
  • లాటరీ తీసేందుకూ సాహసించని ప్రజాప్రతినిధులు
  • మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్న నిర్మాణాలు
  • సకాలంలో బిల్లులందక పనులు నిలిపేస్తున్న కాంట్రాక్టర్లు
  • ప్రభుత్వం నుంచి రూ.900 కోట్ల పైగా బకాయిలు
  • లబ్ధిదారుల జాబితాపై కేంద్రం-తెలంగాణ పంచాయితీ
  • నిలిచిపోయిన రూ.800 కోట్ల నిధుల మంజూరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇచ్చేలా చేపట్టిన పథకం. రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో ఈ ఇళ్ల నిర్మాణం ముందుకుసాగకపోవడం ఒక ఎత్తయితే.. పూర్తయినవాటిని కూడా లబ్ధిదారులకు అందజేయడంలేదు. వాటికి తాళం వేసి నెలల తరబడి అలాగే వదిలేయడంతో శిథిలమైపోయే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు.. సిద్దిపేట జిల్లాకు మొత్తం 15,690 ఇళ్లు మంజూరుకాగా, 9,436 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో 3,789 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా 5,647 ఎవరికీ కేటాయించకుండా ఉండిపోయాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లోనైతే ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కాలనీల్లో తాగు నీటి సరఫరా, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల కల్పన పూర్తికానందునే ఇవ్వలేదని అధికారులు చెబుతున్నా.. అసలు కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రధానంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎక్కువమంది ఉండడం, ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండడంతో కేటాయింపు విషయంలో అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కొందరికి మాత్రమే ఇస్తే.. రానివారు ఎలా స్పందిస్తారోనని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా డబుల్‌ ఇళ్ల ప్రారంభంపై నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే వీలున్నా.. ఇందుకు కూడా సాహసించడం లేదు. కొన్నిచోట్ల అధికారులు చొరవ చూపుతున్నా.. ప్రజాప్రతినిధులు బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణం పూర్తయిన ఇళ్లు వినియోగంలోకి రాక దెబ్బతింటున్నాయి. తలుపులు, కిటికీలు ధ్వంసమవుతున్నాయని, వాటి ని అలాగే వదిలేస్తే శిథిలమయ్యే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో 3,305 ఇళ్లనిర్మాణం పూర్తికాగా, లబ్ధిదారులకు పంపిణీ చేసిం ది 369మాత్రమే. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, బోథ్‌ మండలాల్లో కొంద రు లబ్ధిదారులు బలవంతంగా గృహ ప్రవేశాలు చేసి నివాసముంటున్నారు.


కాంట్రాక్టర్లకు రూ.900 కోట్ల బకాయి..  

రాష్ట్ర సర్కారు ముందుగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి, అనంతరం పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి కేటాయిస్తోంది. ఈ విషయంలోనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో పంచాయితీ వస్తోంది. లబ్ధిదారుల జాబితాను తొలుతే తమకు పంపితే.. దానిని పరిశీలించాక నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. తెలంగాణ మాత్రం, ఇళ్ల పథకంలో తమ విధానాలు వేరని.. లబ్ధిదారుల వివరాలను త్వరలో ఇస్తామని చెబుతోంది. లబ్ధిదారుల సంఖ్యే తెలియనప్పుడు నిధుల మంజూరు కుదరదంటూ కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద రెండో కిస్తీగా రావాల్సిన రూ.800 కోట్లను పెండింగ్‌లో పెట్టింది. డబుల్‌ ఇళ్లను ఇప్పటివరకు రుణాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తూ వస్తోంది. పీఎంఏవై ద్వారా వచ్చే నిధులను వీటికి జతచేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో డబుల్‌ ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.900 కోట్ల వరకు బాకీ పడింది. కేంద్రం ఇచ్చే నిధులతో కాంట్రాక్టర్లకు బకాయిలను తీర్చేద్దామనుకుంటే.. నిబంధనల రీత్యా అదీ సాధ్యపడడం లేదు. ఈ రూ.800 కోట్ల నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర అధికారులు కొన్ని నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే, లబ్ధిదారుల జాబితా ఇవ్వకుంటే నిధులు కేటాయించలేమని కేంద్రం కుండబద్దలు కొట్టింది. మార్చి నాటికి జాబితా సమర్పిస్తామని రాష్ట్ర అధికారులు లేఖ ఇచ్చినా సమ్మతించలేదు. చివరకు కేంద్రం కొంత తగ్గి, 25 వేల మంది జాబితా సమర్పిస్తే పరిశీలిస్తామని పేర్కొంది. అధికారులు ఇప్పుడీ పనిలోపడ్డారు.


నత్తనడకన నిర్మాణం

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పెద్దఎత్తునే మంజూరు చేసినా..నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మంజూరై ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. అత్యధిక శాతం ఇళ్లకు టెండర్లే ఖరారు కాకపోవడంతో పనులు మొదలుకాలేదు. టెండర్లు ఖరారై.. నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. పూర్తి చేసిన మేరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులు నిలిపివేస్తున్నారు. దీంతో జాప్యం చోటుచేసుకుంటూ వ్యయం మరింత పెరిగిపోతోంది. నిజామాబాద్‌ జిల్లాకు మొత్తం 14,269 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. వీటిలో 10,586 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. కానీ, కాంట్రాక్టర్లు ఇప్పటివరకు1,785 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. 5,830 ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా.. బిల్లులు రాని కారణంగా 4,756 ఇళ్ల పనులను మొదలుపెట్టి నిలిపివేశారు. ఈ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రూ.179.9 కోట్ల విలువైన పనులు చేయగా.. రూ.150 కోట్ల వరకు అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారు. ఇంకా రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కాగా, కామారెడ్డి జిల్లాలో మొత్తం 8,226 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.416.56 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.306 కోట్ల బిల్లులు మాత్ర మే చెల్లించారు. ప్రభుత్వం ఒక్కో డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి రూ.5.40 లక్షలు చెల్లిస్తుండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో టెండర్లు పూర్తయిన ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు మొదలుపెట్టడం లేదు. అంతేగాక కొత్తగా నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఎవ రూ ఆసక్తి చూపడం లేదు. ఎవరైనా నిర్మాణ బాధ్యతలు చేపట్టినా.. మార్కెట్‌ ధరల నేపథ్యంలో ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 


ఇళ్లలోకి దరఖాస్తుదారులు.. నచ్చజెప్పి ఖాళీ

పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా, పంపిణీ కాలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. చాలాచోట్ల గృహ ప్రవేశాలు  కూడా చేసేస్తున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పి ఖాళీ చేయిస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు తరచూ ఏదో ఒక జిల్లాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగులో 80 ఇళ్లు మంజూరైతే 20 కట్టారు. అధికారులు లబ్ధిదారుల జాబితా విడుదల చేయడంతో.. మిగతావారు ఎదురుతిరిగారు. 15 మంది గృహ ప్రవేశాలు చేశారు. వీరిని అధికారులు ఖాళీ చేయించారు. తర్వాత లాటరీ తీసి 20 మందికి ఇళ్లు కేటాయించారు. ఇదిలాఉంటే.. మిగతా 60 ఇళ్లు ఇంతవరకు పూర్తికానేలేదు. 


బిల్లు రావట్లేదని..గోడలు తొలగించారు!

బిల్లు రావడం లేదనే ఆగ్రహంతో.. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధి కైకొండాయిగూడేనికి చెందిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కాంట్రాక్టర్‌ నిర్మాణం జరిపిన గోడలను తొలగించి 

ఇటుకలు, పిల్లర్ల కోసం అమర్చిన ఇనుప చువ్వల బుట్టలను అమ్మేయడం చర్చనీయాంశమైంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ 

నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు పొందిన కాంట్రాక్టర్‌.. సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించగా అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి తెచ్చిన ఇసుకను అధికార పార్టీ నాయకులు 

తరలించుకుపోయారన్న ఆరోపణలున్నాయి.



Updated Date - 2022-01-24T07:56:00+05:30 IST