మీకు మీరే రక్ష!

ABN , First Publish Date - 2020-07-08T07:50:30+05:30 IST

కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో.... ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటికి ‘కుయ్‌ కుయ్‌’మని అంబులెన్స్‌ వచ్చేది. వైద్యసిబ్బంది పీపీఈ కిట్లు వేసుకొని దిగేవారు. ఎలాంటి ఇబ్బందిలేకుండా

మీకు మీరే రక్ష!

  • చేతులెత్తేస్తున్న యంత్రాంగం
  • కేసులు పదుల్లో ఉన్నప్పుడు కట్టడి
  • వేలల్లోకి చేరాక ‘డోన్ట్‌ కేర్‌’
  • కట్టుజారుతున్న కరోనా చికిత్స 
  • పదే పదే నిబంధనలు మార్పు 
  • స్వీయ జాగ్రత్తలు, ఇంట్లోనేవైద్యం
  • సగం చికిత్సతో వైరస్‌ వ్యాప్తికి చాన్స్‌!
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాలు
  • లక్ష పడకలు... మాటలకే పరిమితం 

(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో.... ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటికి ‘కుయ్‌ కుయ్‌’మని అంబులెన్స్‌ వచ్చేది.  వైద్యసిబ్బంది పీపీఈ కిట్లు వేసుకొని దిగేవారు. ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసేందుకు ఇద్దరు పోలీసులూ తోడుగా వచ్చేవారు.  ఆరోగ్య సిబ్బంది ఆ ప్రాంతాన్ని శానిటైజ్‌ చేయించి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించేవారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని 14రోజులు  చికిత్స తర్వాత ఒకటికి రెండుసార్లు పరీక్షించి... ‘నెగెటివ్‌’ వచ్చాకే తిరిగి ఇంటికి పంపించేవారు. మరి ఇప్పుడో... ఒక్కో ఇంట్లో అరడజను కేసులొచ్చినా ఎలాంటి అప్రమత్తత ఉండటం లేదు. ‘మీకు పాజిటివ్‌ వచ్చింది... ఆస్పత్రికి రండి’ అని ఫోన్‌కాల్‌ వెళ్తుంది. ఆటోలోనో, సొంత వాహనంలోనో ఆస్పత్రికి వెళ్లేలోపు అతను ఎక్కడైనా తిరగొచ్చు, ఎంతమందిని అయినా కలవచ్చు.


కాంటాక్ట్‌లను గుర్తించడం మానేశారు. ఒకే ప్రాంతంలో డజన్ల కొద్దీ కేసులు వచ్చినా, మరణాలు సంభవించినా శానిటైజేషన్‌ చేయడం దాదాపుగా మర్చిపోయారు. ఎవరైనా ఒత్తిడి చేస్తే సిబ్బంది వచ్చి బ్లీచింగ్‌, సున్నం చల్లుతున్నారు. ఇప్పుడు... ఏకంగా ఆస్పత్రికి కూడా రానక్కర్లేకుండా, ‘ఇంట్లో ఉంటే చాలు’ అని తేల్చేస్తున్నారు. అప్పుడు... ఒక కేసు వస్తే వీధివీధంతా మూత! ఇప్పుడు... ఇరుగింట్లో కరోనా వచ్చినా పొరుగింటి వారికి తెలియదు! ఇదీ పరిస్థితి. మొదట్లో ఉన్న స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌(ఎ్‌సఓపీ) ఇప్పుడు లేదు. ఆస్పత్రులు నిండిపోతున్నాయనే పేరుతో డిశ్చార్జిలపైనే దృష్టిపెట్టారు. రాష్ట్రంలో కొత్త కేసులు అధికమై, డిశ్చార్జిలు త గ్గిపోవడానికి మారిన కట్టుబాట్లే ప్రధాన కారణంగా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. 


హోం ఐసోలేషన్‌... పర్యవేక్షణ ఏదీ? 

రాష్ట్రంలో కరోనా కేసులు 300లోపే ఉన్నప్పుడు లాక్‌డౌన్‌తో పాటు వైరస్‌ నియంత్రణ పేరిట ప్రభుత్వం అనేక నియమ, నిబంధనలు, కట్టుబాట్లు అమలు చేసింది. ఆ చర్యలను చూసి సర్కారు దెబ్బకు రాష్ట్రం నుంచి కరోనా పారిపోవడం ఖాయమనుకున్నారు. ప్రస్తుతం కేసులు 21వేలు దాటిపోగా, మరణాలు 252 పైమాటే. పట్టణాలు, పల్లెలను దాటుకొని వైరస్‌ విజృంభిస్తోంది. వైద్యం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాను కట్టడిచేసి, ప్రజలను జాగ్రత్తగా ఉంచాల్సిన ఈ సమయంలో స్వీయజాగ్రత్తలు, సొంత వైద్య పర్యవేక్షణ అంటూ నిబంధనలను నీరుగారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కరోనా సోకినవారికి అందించాల్సిన చికిత్స, పరీక్షల నిర్వహణ, డిశ్చార్జి తదితరాలపై నిబంధనలు ఇప్పటికి  పదిసార్లు మారాయి. ఇప్పుడు వాటిని మరోసారి మరింత సడలించారు.


‘మీకు మీరే దిక్కు. ఇంట్లోనే వైద్యపర్యవేక్షణకు అలవాటు పడండి’ అంటూ ఇన్‌స్టాండ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దీని ప్రకారం కరోనా లక్షణాలున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చాక వరుసగా 3రోజుల పాటు జ్వరం లేకపోతే ఇంటికి పంపిస్తారు. డిశ్చార్జి సమయంలో మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వు ఇచ్చారు. తర్వాత 7రోజులు ఇంట్లోనే ఉంటూ సొంతంగా వైద్యపర్యవేక్షణ చేసుకోవాలి. దీని అమలు తీరును పర్యవేక్షించడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. కరోనా సోకిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరిగినా, ఎంతమందికి వైరస్‌ అంటించినా అడ్డుకునేవారు లేరు. ఆ వ్యక్తి కదలికలపై సర్కారు నియంత్రణ లేదు. స్వీయ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ఉన్నవారికి వైరస్‌ వ్యాప్తి చెందితే దాన్నెలా కట్టడి చేస్తారనే దానిపైనా ఎలాంటి స్పష్టత లేదు. 


కేసులు పెరిగిపోతే...  

రాష్ట్రంలో కరోనా కేసులు 500లోపే ఉన్నప్పుడు జిల్లాకో కొవిడ్‌-19 ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే లక్ష పడకలు సిద్ధం చేస్తామని గొప్పగా ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రులను ఎపిడమిక్‌ చట్టం కిందకు తెచ్చారు. కేసులు 21వేలు దాటేసరికి ఈ మాటలు చేతల్లోకి మారడం లేదు. పైగా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అనేకమందిని తిప్పిపంపిస్తున్నారు. అలా వెళ్లినవారు కరోనా ఉందో, లేదో కూడా తెలియకుండానే చనిపోతున్నారు. రానున్న రోజుల్లో కేసులు భారీగా పెరిగితే ఆస్పత్రుల్లో పడకలు పెంచుతారా లేక ఎవరింట్లో వారే ఉండి సొంత వైద్యం చేయించుకోమని సలహాలు ఇస్తారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే స్వీయ వైద్యపర్యవేక్షణతో ఎప్పటికైనా చేటేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా విషయంలో ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయినా ‘‘ఏం ఫర్వాలేదు... ఎవరి ఖర్మకు వారే బాధ్యులని నిబంధనలను మళ్లీ నీరుగారుస్తారేమో’’ అని సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-07-08T07:50:30+05:30 IST