తాలిబన్ల దురాక్రమణకు బైడెన్ వైఫల్యమే కారణం: ట్రంప్

ABN , First Publish Date - 2021-08-15T18:43:57+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్​ అనుసరిస్తున్న విధానాన్ని​ ట్రంప్​ తప్పుపట్టారు. ఆఫ్గాన్​లోని పలు నగరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం పూర్తిగా బైడెన్​ అధికార వైఫల్యానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.

తాలిబన్ల దురాక్రమణకు బైడెన్ వైఫల్యమే కారణం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్​ అనుసరిస్తున్న విధానాన్ని​ ట్రంప్​ తప్పుపట్టారు. ఆఫ్గాన్​లోని పలు నగరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం పూర్తిగా బైడెన్​ అధికార వైఫల్యానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్గాన్‌లో తాలిబన్లు కొనసాగిస్తున్న దురాక్రమణపై మాట్లాడిన ట్రంప్... ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాలు తాలిబన్లకు వరంగా మారితే, ఆఫ్గాన్‌ను కోలుకోని దెబ్బతీశాయని ఆయన దుయ్యబట్టారు.  


ఇప్పటివరకు అగ్రరాజ్యంపై ఉన్న భయం, గౌరవం ఇకపై తాలిబన్లకు ఉండబోదని, కాబూల్​లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయంపై తాలిబన్లు వారి జెండా ఎగరవేస్తారని జోస్యం చెప్పారు. అదే జరిగితే ఆ ఘటన యూఎస్‌కు ఏంతో అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఇది కచ్చితంగా బైడెన్ వైఫల్యంగా పరిగణించాలన్నారు. గతంలో అనుసరించిన ప్రణాళికలను కొనసాగించి ఉంటే మన రాయబార కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా వారిలో కలిగేది కాదన్నారు. ఇప్పుడు అగ్రరాజ్యంపై కొత్త దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. ఇది అమెరికా అధ్యక్షుడి బలహీనత, అసమర్థతకు అద్దం పడుతోందని చెప్పుకొచ్చారు. కాగా, ఆఫ్గానిస్తాన్‌లో 5వేల మంది అమెరికా బలగాలను మోహరిస్తున్నాట్లు బైడెన్​ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 

Updated Date - 2021-08-15T18:43:57+05:30 IST