భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు.. మోదీ కౌంటర్ ఇవ్వాలంటూ..

ABN , First Publish Date - 2020-10-23T20:48:04+05:30 IST

ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోదీని మంచి స్నేహితుడిగా చెప్పుకునే ట్రంప్.. భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించిన ఆయన.. ఇండియాలో స్వచ్ఛమైన గాలి లేదంటూ ఆరోపించారు. వివరాల్లోకి వెళితే

భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు.. మోదీ కౌంటర్ ఇవ్వాలంటూ..

వాషింగ్టన్: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోదీని మంచి స్నేహితుడిగా చెప్పుకునే ట్రంప్.. భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించిన ఆయన.. ఇండియాలో స్వచ్ఛమైన గాలి లేదంటూ ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య నాష్‌విల్లేలో గురువారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మూడో ముఖాముఖి జరిగింది. ఇందులో భాగంగా ఇద్దరు అభ్యర్థులు పర్యావరణ మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. కాలుష్య కారకాలను భారత్, చైనా, రష్యా దేశాలు విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. తద్వారా పర్యావరణం కలుషితం అవుతోందని ట్రంప్ విమర్శించారు. 


‘చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. అలాగే రష్యా, భారత్‌లను చూడండి అవి ఎంత మురికిగా ఉన్నాయో. అక్కడ గాలి కూడా మురికిగా ఉంటుంది’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. పారిస్ ఒప్పందం నుంచి బయటిరావడాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఆ ఒప్పందం వల్ల అమెరికా ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. కోట్లాది రూపాయలను నష్టపోతుందని తెలిపారు. మిలియన్ల కొద్ది ఉద్యోగాలను వేలాది కంపెనీలను నష్టం పోవడం ఇష్టం లేకే.. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా.. గ్లోబల్ వార్మింగ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల మధ్య 2015లో పారిస్ ఒప్పందం కుదురిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటుందని ట్రంప్ గతంలో ప్రకటించారు. కాగా.. గతంలో కూడా భారత్‌పై ట్రంప్ విమర్శలు చేశారు. కొవిడ్ మరణాల విషయంలో ఇండియా తప్పుడు లెక్కలను వెల్లడిస్తోందని పలు సందర్భాల్లో ట్రంప్ నిందించారు. 


ఇదిలా ఉంటే.. భారత్‌పై ట్రంప్ పదే పదే ఆరోపణలు చేయడం  పట్ల భారతీయులు భగ్గుమంటున్నారు. ట్రంప్‌పై కోపాన్ని ట్వీట్‌ల రూపంలో వ్యక్త పరుస్తున్నారు. ట్రంప్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించాలని కోరుతున్నారు. ట్రంప్ నోరు మూతపడే విధంగా కౌంటర్ ఇవ్వాలని నెటిజన్లు ప్రధాని మోదీని కోరున్నారు. 

Updated Date - 2020-10-23T20:48:04+05:30 IST