కొవిడ్ మరణాలపై భారత్ ఖచ్చితమైన గణాంకాలు ఇవ్వడం లేదు: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-30T18:17:29+05:30 IST

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఇరుపార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ కార్యక్రమం ముగిసింది.

కొవిడ్ మరణాలపై భారత్ ఖచ్చితమైన గణాంకాలు ఇవ్వడం లేదు: ట్రంప్

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఇరుపార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ కార్యక్రమం ముగిసింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తమ సంవాదాలతో ఈ బహిరంగ చర్చ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై ఇరువురూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ చర్చల్లో భాగంగా మహమ్మారి కరోనావైరస్ వల్ల దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు ట్రంప్ చర్యలే కారణమని బిడెన్ మండిపడ్డారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అమెరికాలో కరోనావైరస్ కారణంగా మరణించిన 2 లక్షల మంది ప్రజలు ప్రపంచ మరణాల సంఖ్య 10 లక్షల్లో 20 శాతం అని బిడెన్ చెప్పారు. అదే యూఎస్ జనాభా ప్రపంచంలో కేవలం 4 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.


బిడెన్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్... “మీరు కరోనా మరణాల సంఖ్య గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ వైరస్ వల్ల చైనాలో ఎంత మంది మరణించారో మీకు తెలుసా? రష్యాలో ఎంత మంది మృతిచెందారో మీకు తెలుసా? భారతదేశంలో ఎంత మంది చనిపోయారో మీకు తెలియదు. మరణాలపై భారత్ ఖచ్చితమైన గణాంకాలు ఇవ్వడం లేదు." అని అన్నారు. "కొవిడ్ కేవలం చైనా తప్పిదంతో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది." అని ట్రంప్ చెప్పారు. తాము దేశ ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-30T18:17:29+05:30 IST