బిడెన్ బలహీనుడు.. తొలి డిబేట్ నేనే గెలిచాను: ట్రంప్

ABN , First Publish Date - 2020-10-01T20:13:39+05:30 IST

ఒహియోలోని క్లీవ్‌లాండ్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన అభ్యర్థుల మధ్య బుధవారం తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే.

బిడెన్ బలహీనుడు.. తొలి డిబేట్ నేనే గెలిచాను: ట్రంప్

వాషింగ్టన్ డీసీ: ఒహియోలోని క్లీవ్‌లాండ్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన అభ్యర్థుల మధ్య బుధవారం తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ తొలి డిబేట్‌లో తానే గెలిచానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డిబేట్ అనంతరం వైట్‌హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ బలహీనుడని, ఆయనపై తాను తొలి డిబేట్‌లో చాలా సులువుగా గెలిచానని అన్నారు. "ఈసారి ఎన్నికల్లో నా ప్రత్యర్థి బిడెన్ చాలా బలహీనం. ఇక తొలి ముఖాముఖి చర్చలో ఆయనపై ఎలా చూసిన ప్రతి విషయంలో నాదే పైచేయి. ప్రతి పోల్‌లో నేనే విజయం సాధించాను. దాదాపు ఆరు అంశాలలో నేనే గెలిచాను." అని చెప్పుకొచ్చారు. తొలి డిబేట్‌లో సులువుగా విజయం సాధించిన తాను ఫ్లోరిడా, టెన్నెసీలో జరిగే రాబోయే రెండు డిబేట్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అన్నారు. అటు బిడెన్ క్యాంపెయిన్ కూడా తొలి డిబేట్‌లో తామే గెలిచామని ప్రకటించుకోవడం గమనార్హం. 


ఇదిలాఉంటే... బుధవారం జరిగిన తొలి ముఖాముఖి చర్చలో ఇరువురు అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగడం తప్పిస్తే... ఏ ఒక్క విధానంపై కూడా సరియైన చర్చ జరపలేదు. డిబేట్‌లో ఇరువురు అభ్యర్థులు రచ్చరచ్చ చేశారు. దీంతో తొలి ముఖాముఖి చర్చ పూర్తిగా రసాభాస అయింది. అయితే మొదటి చర్చలో విజేత బైడెనేనని, ఆయన హుందాగా వ్యవహరించారని, తన విధానాలను ట్రంప్‌ సమర్ధంగా సమర్థించుకోలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ చర్చ వల్ల ఓటింగ్‌ సరళి పెద్దగా మారిపోదని కూడా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. 


Updated Date - 2020-10-01T20:13:39+05:30 IST