మహిళలు లక్షలిచ్చి.. శిక్షలు అనుభవిస్తున్నారు!

ABN , First Publish Date - 2021-04-12T13:52:22+05:30 IST

ఇద్దరూ ఐటీ ఉద్యోగులే.. చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ...

మహిళలు లక్షలిచ్చి.. శిక్షలు అనుభవిస్తున్నారు!

  • మహిళలపై తగ్గని గృహ హింస
  • భరించలేక మహిళా భద్రతా విభాగానికి వస్తున్న బాధితులు

హైదరాబాద్‌ : ఇద్దరూ ఐటీ ఉద్యోగులే.. చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ఈ దంపతుల పెళ్లయింది. పెళ్లి సమయంలో రూ. లక్షల్లో కట్నం ఇచ్చారు. గచ్చిబౌలిలో ఉంటున్నారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్లయినప్పటి నుంచి ఆ దంపతుల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు కూడా పెరుగుతూ వచ్చాయి. భార్యపై లింగవివక్ష చూపించడంతో పాటు.. మానసిక క్షోభకు గురిచేసేవాడు. ఇటీవల కాలంలో అతని వేధింపులు మరింత పెరిగిపోవడంతో.. మహిళా భద్రతా విభాగం పోలీసులను ఆమె ఆశ్రయించింది. తన భర్త చెర నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంది. ఇది మచ్చుకు ఒక సంఘటన మాత్రమే. ఎంతోమంది మహిళలు పెళ్లికి ముందు రూ. లక్షల్లో కట్నాలు ఇచ్చి భర్తను కొనుకున్న తర్వాత.. పెళ్లియిన కొన్నాళ్లకే భర్త, అత్తామామలు, ఆడపడచులు వేస్తున్న శిక్షలు భరిస్తున్నారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజూ సుమారు పదికి పైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మహిళా పోలీసులు అంటున్నారు.


ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు..

భర్త అత్తామామల వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు. భర్తే.. తనపై లింగ వివక్ష ప్రదర్శించి, మానసిక వేదనకు గురిచేస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దు. ధైర్యంగా నిలదీయాలి. బయటకు వచ్చి వాళ్ల అహంకారానికి చరమగీతం పాడాలి. చేసిన తప్పుకు శిక్షపడేలా చేయాలి. పురుషులతో సమానంగా, తలెత్తుకొని జీవించే అవకాశం, హక్కు మహిళలకు ఉందని గుర్తించాలి. - అనసూయ, డీసీపీ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, సైబరాబాద్‌.

Updated Date - 2021-04-12T13:52:22+05:30 IST