పురిటిగుడ్డును చంపుతారా?

ABN , First Publish Date - 2020-08-15T09:48:05+05:30 IST

రాజధాని లేకుండా వట్టి చేతులతో బయటకు వచ్చిన మనకు.. ఒక అధునాతన నగరాన్ని నిర్మించుకునే అవకాశం వచ్చిందని.. పురిటిగుడ్డును చంపేసినట్లు దానిని చంపేస్తే మనకు మించిన తెలివితక్కువ వారు ఉండరని మాజీ ముఖ్యమంత్రి

పురిటిగుడ్డును చంపుతారా?

  • అమరావతిని నాశనం చేయొద్దు
  • దాని విలువ రూ.2-3 లక్షల కోట్లు
  • 400- 500 ఎకరాల్లో రాజధాని కడితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా?
  • ప్రజలు ఓటేసింది విధ్వంసానికి కాదు
  • చంద్రబాబు స్పష్టీకరణ


అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని లేకుండా వట్టి చేతులతో బయటకు వచ్చిన మనకు.. ఒక అధునాతన నగరాన్ని నిర్మించుకునే అవకాశం వచ్చిందని.. పురిటిగుడ్డును చంపేసినట్లు దానిని చంపేస్తే మనకు మించిన తెలివితక్కువ వారు ఉండరని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నగర నిర్మాణం పూర్తయితే దాని విలువ రూ.2-3 లక్షల కోట్లు ఉంటుందని, దానిని నాశనం చేయడమంటే.. అంత విలువైన సంపదను పోగొట్టుకున్నట్లేనని చెప్పారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రం కోసం అమరావతి తప్ప అమరావతి కోసం రాష్ట్రం కాదు. ఏదో ఒక జాతీయ రహదారి పక్కన నాలుగైదు వందల ఎకరాల్లో రాజధానిని నిర్మించడం పెద్ద సమస్య కాదు. కానీ దానివల్ల ఉద్యోగాలు, ఉపాధి ఎలా లభిస్తాయి’ అని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..


పన్నుల రూపంలో వస్తుంది..

‘అమరావతిలో మౌలిక వసతులు, ప్రభుత్వ పాలనా భవనాలు, కొన్ని నగరాలు నిర్మించాలి. దీనికి రూ.50 వేల కోట్లు ఖర్చు కావచ్చు. కానీ రకరకాల పన్నుల ద్వారా ఇందులో 40-50 శాతం తిరిగి ప్రభుత్వానికే వస్తుంది. ప్రైవేటు నిర్మాణాలు కూడా వస్తాయి. దానివల్ల మరి కొంత ఆదాయం లభిస్తుంది. రోడ్లు, పార్కులు, రైతులకు తిరిగి ఇవ్వాల్సిన భూమి పోను ప్రభుత్వానికి అక్కడ 8 వేల ఎకరాల భూమి మిగులుతుంది. అమరావతికి విలువ పెరిగాక ఆ భూమిని అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్లు వస్తాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో 1,200 ఫ్లాట్లు అమరావతిలో కట్టాలని నిర్ణయించి అమ్మకానికి పెడితే హాట్‌ కేకుల్లా నిమషాల్లో అమ్ముడయ్యాయి. అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత విలువ ఏర్పడిందో ఇదే పెద్ద ఉదాహరణ. విద్యుత్‌ పీపీఏలను రద్దు చేస్తామంటే న్యాయస్ధానాలు కుదరదని చెప్పాయి. అమరావతిలో రైతులతో ఒప్పందాలను కూడా గౌరవించక తప్పదు. ఒప్పందాలను ఉల్లంఘిస్తే వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు? మన సంపద మనం పాడు చేసుకుని కేంద్రాన్ని రూ.9.90 లక్షల కోట్లు ఇవ్వాలని కోరుతున్నారు. చేతిలో ఉన్నది చేసుకోకుండా బీద అరుపులు అరిస్తే ఎవరు వింటారు? రోజుకు రాష్ట్రంలో పది వేల కరోనా కేసులు వస్తున్నాయి. రోగులకు చాలినన్ని పడకలు ఇవ్వలేకపోతున్నాం. మంచి భోజనం పెట్టలేకపోతున్నాం. ఈ సమయంలో ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసిన రాజధానిని వదిలిపెట్టి మరో చోటికి పోవాలనుకోవడం తుగ్లక్‌ చర్య కాక మరేమిటి? రాజకీయ క్రీడలకు ఇదేనా సమయం? ప్రస్తుతం ఏ నగరంలో కొత్తగా మంచినీటి పైపు వేయాలన్నా రోడ్లు తవ్వుకుంటూ వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. అమరావతిలో రోడ్డు తవ్వాల్సిన పనే లేకుండా.. ఏదైనా రోడ్డు పక్క నుంచే వెళ్లడానికి వీలుగా డక్టులు నిర్మించాం. అమరావతిని పూర్తి చేసే శక్తి లేదని ప్రభుత్వం అనుకుంటే కనీసం అలా వదిలేసినా సరిపోతుంది. రూ.2-3 వేల కోట్లు ఖర్చు చేస్తే సగానికి పైగా నిర్మాణం జరిగిన భవనాలు పూర్తవుతాయి. ప్రభుత్వం నడపడానికి అవసరమైన సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు ఇప్పటికే ఉన్నందున ఇబ్బందేమీ రాదు. రాజధాని మార్పు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందా లేదా అన్నది సమస్య కాదు. ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న. దేశంలో ఎక్కడైనా ఇలా మార్చారా? వారెవరికీ ఈ తెలివి లేక మార్చలేదా? ఎవరో తుగ్లక్‌ వచ్చి మారుస్తానంటే ప్రజలు భరించాల్సిందేనా?’

Updated Date - 2020-08-15T09:48:05+05:30 IST