కాంగ్రెస్‌కు ప్రశ్నించే అర్హత ఉందా?

ABN , First Publish Date - 2020-09-08T09:41:42+05:30 IST

‘తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ..’ (నియంతృత్వం సాగదు...) అంటూ కాంగ్రెస్ పార్టీ 2015లో పలు రోజులు పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. ఆ పార్టీ ఉభయసభలను...

కాంగ్రెస్‌కు ప్రశ్నించే అర్హత ఉందా?

పార్లమెంట్ అంటే ఏ మాత్రం గౌరవం లేని కాంగ్రెస్ సెప్టెంబర్ 14 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయం అత్యంత విలువైనదని, సభ్యులు ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం నుంచి విలువైన సమాచారం రాబట్టుకోవచ్చునని అందరికీ తెలుసు. కాని అసాధారణ పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆరుసార్లు ఇలా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఎమర్జెన్సీలో రెండు సంవత్సరాలు అసలు ప్రశ్నోత్తరాల సమయమే సాగలేదు.


‘తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ..’ (నియంతృత్వం సాగదు...) అంటూ కాంగ్రెస్ పార్టీ 2015లో పలు రోజులు పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. ఆ పార్టీ ఉభయసభలను స్తంభింపచేయడానికి కారణం ఏ దేశ ప్రయోజనం నెరవేరేందుకో, లేదా దేశంలో అత్యంత క్లిష్టమైన సమస్య ఏర్పడినందుకో కాదు. ఒక సంస్థ ఆస్తులను అక్రమంగా కబళించాలని చూశారన్న ఆరోపణపై కోర్టు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేశారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు సభావేదికపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఒక కోర్టు సమన్లు జారీ చేస్తే మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని విమర్శించడంలో ఏమైనా అర్థం ఉందా? దానికి పార్లమెంట్‌ను స్తంభింపచేయడం, వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం వివేకవంతమైనదా? 2014లో ఘోరపరాజయం చెందిన నాటి నుంచీ కాంగ్రెస్ నేతలు తమ ఆగ్రహాన్ని పార్లమెంట్‌పై చూపడం ప్రారంభించారు.


నిజానికి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలో ప్రాథమిక ఆధారాలున్నాయని కింది కోర్టు నుంచి హైకోర్టు వరకూ అభిప్రాయపడ్డాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోట్లాది రూపాయల ఆస్తులను జప్తు చేయాల్సి వచ్చింది. ఈ కేసులో ఎన్నో కోణాలున్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది. అసలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ద ఒక రాజకీయ పార్టీ ఒక కంపెనీకి అప్పు ఇవ్వడమే నేరం. నేషనల్ హెరాల్డ్ పేపర్ తెచ్చేందుకు పార్టీ ఈ అప్పు ఇచ్చిందట. రెండు– సోనియా, రాహుల్ కలిసి యంగ్ ఇండియన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఛారిటబుల్ ట్రస్ట్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ 76 శాతం వాటా ఉంటే మిగతా 24 శాతం వారి విధేయులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు ఉన్నాయి. ఈ ట్రస్టు చేసిన దానధర్మాలేమో ఎవరికీ తెలియదు కాని, అసోసియేట్ జర్నల్స్‌కు చెందిన వాటాలన్నీ ఈ ట్రస్టు కేవలం రూ.50లక్షలకు బదిలీ చేసుకున్నది. 1938లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్‌కు అనేక చోట్ల వేల కోట్ల ఆస్తులున్నాయి. ఆ అస్తులన్నీ కబళించడమే సోనియా, రాహుల్ ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.90కోట్ల అప్పును కూడా పొందే అధికారం వారికి లభిస్తుంది. యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్‌ను దక్కించుకున్న విషయం ఆ సంస్థ వాటాదారులకు కూడా తెలియదు. మాజీ న్యాయమంత్రి శాంతిభూషణ్, మాజీ సుప్రీం న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కూడా అసోసియేటెడ్ జర్నల్స్‌లో తమ వాటాలు బదిలీ అయ్యాయన్న విషయం తమకే తెలియదని విమర్శించారు. అసోసియేట్ జర్నల్స్ సంస్థకు కాంగ్రెస్ హయాంలో అక్రమంగా అనేక ఆస్తులు బదిలీ అయ్యాయి. ఉదాహరణకు హర్యానాలో నాటి ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా పంచ్‌కులాలో కొన్ని ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని చూపించి బాంద్రాలో ఆ సంస్థ కోట్లాది రూపాయల ఆస్తులు కొన్నది. సహజంగానే ఈ ఆస్తులన్నీ యంగ్ ఇండియన్ సంస్థకు, అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి దక్కుతాయి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఇలాంటి ఈడీ ఎటాచ్ చేస్తే యంగ్ ఇండియన్‌ను అసలు ధానధర్మాలు చేసే సంస్థగా ఎలా పరిగణిస్తామని ఆదాయపన్ను శాఖ ప్రశ్నించింది. దీనితో వ్యాపార కార్యకలాపాలు సాగించే ఆ సంస్థ ఛారిటబుల్‌ ట్రస్టుగా గుర్తింపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఐటీవోలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ కేంద్ర కార్యాలయ భవనాన్ని 56 ఏళ్ల క్రితం ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ భవనంలో వార్తాపత్రిక తప్ప ఇతర వ్యాపార కార్యకలాపాలు నడుస్తుంటాయి. అందువల్ల ఈ భవనాన్ని ఖాళీ చేసేందుకు కేంద్రం నోటీసులు ఇచ్చింది.


కాంగ్రెస్ పాలనలో ఇలాంటి అక్రమాలెన్నో జరిగినా అవి ప్రజల దృష్టికి రావు. కాని ఈ అక్రమాలపై ఎవరైనా కేసు వేస్తే, కోర్టులు నోటీసులు ఇస్తే మాత్రం తమపై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తుంది. అంతే కాదు, ఏ మాత్రం పస లేని విషయాలను ప్రస్తావించి పార్లమెంట్‌ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిన సందర్భాలెన్నో. 2014 ఎన్నికల తర్వాత లలిత్ మోదీకి సుష్మాస్వరాజ్ సహాయం చేశారని కొన్ని రోజులు, మోదీ పాకిస్థాన్‌తో తమకు సంబంధం అంటగట్టారని మరికొన్ని రోజులు సభను అడ్డుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఎలాంటి కుంభకోణం లేదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ సభలో చిచ్చు రేపింది. ఎక్కడో, ఏ రాష్ట్రంలోనో ఏ సంఘటన జరిగినా కాంగ్రెస్ పార్లమెంట్‌లో హంగామా సృష్టించిన రోజులు లేకపోలేదు. 2014 నుంచి వరుసగా అయిదేళ్లూ పార్లమెంట్ లో ఏదో ఒక నెపంతో పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకున్న కాంగ్రెస్ 2019లో ఘోర పరాజయం చెందడంతో దిగ్భ్రాంతి చెందింది. ప్రధానిని దొంగ అంటూ రాహుల్ గాంధీ దుర్భాషలాడడంతో ఆ ఎన్నికల్లో ప్రజలు ఆగ్రహం ప్రకటించారు. పార్లమెంట్‌లో కన్ను గీటి, ప్రధానిని హత్తుకునేందుకు ఆయన చేసిన వెకిలి చేష్టలను ప్రజలు అసహ్యించుకున్నారు.


పోనీ 2019 పరాజయం తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధిగా, హుందాగా ప్రవర్తించిందా అంటే అది కూడా లేదు. కాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు చేసిన నిర్ణయాన్ని భారత అస్తిత్వాన్ని నిలిపే చర్యగా దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకంతో ఆహ్వానిస్తే కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ స్తంభింపచేసింది. పౌరసత్వ చట్టం వల్ల దేశంలో పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టంగా తెలిసినప్పటికీ సభాకార్యక్రమాలను భగ్నం చేసి సమాజంలో అశాంతిని ప్రేరేపించింది. విచిత్రమేమంటే పార్లమెంట్ అంటే ఏ మాత్రం గౌరవం లేని కాంగ్రెస్ సెప్టెంబర్ 14 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయం అత్యంత విలువైనదని, సభ్యులు ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం నుంచి విలువైన సమాచారం రాబట్టుకోవచ్చునని అందరికీ తెలుసు. కాని అసాధారణ పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆరుసార్లు ఇలా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఎమర్జెన్సీలో రెండు సంవత్సరాలు అసలు ప్రశ్నోత్తరాల సమయమే సాగలేదు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్యరీత్యా ఎమర్జెన్సీ నెలకొన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు, సిబ్బంది భయం భయంగా తమ రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చేందుకు ఈ సమావేశాలకు తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ, లోక్‌సభ చెరి నాలుగు గం టలు సమావేశమై, సభ ముందున్న అత్యవసర బిల్లులను, ఆర్జినెన్స్‌లను ఆమోదించాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రశ్నోత్తరాల సమయానికి గంట వెచ్చించలేమని, తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ప్రభుత్వం భావించింది. ప్రతిపక్షాలకు, ఉభయసభల అధ్యక్షులకు లేఖ రాసింది. దీనికి ఉద్దేశాలను ఆపాదించడం సరైంది కాదు.


అయినా గత అయిదేళ్ల చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు చాలా తక్కువ. 2015 నుంచి 2019 వరకు ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయంలో కేవంల 40 శాతం మాత్రమే వినియోగించుకున్నాయి. మిగతా 60 శాతం వృథా చేశాయి. ఏ సమస్య వచ్చినా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి చర్చ నిర్వ హించాలని ప్రతిపక్షాలు నోటీసు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. గత అయిదేళ్లలో 332 గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగాల్సి ఉంటే ప్రతిపక్షాలు కేవలం 133 గంటల సమయాన్ని మాత్రమే ఉపయోగించుకున్నాయి. కరోనాను దృష్టిలో ఉంచుకుని కేరళ, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కూడా ప్రశ్నోత్తరాలసమయాన్ని నిర్వహించ కూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసి కూడా కేవలం మోదీ ప్రభుత్వమే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసిందని, ప్రశ్నించే గొంతు నొక్కిందని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయి. ఈ దేశంలో ప్రశ్నించే గొంతు నొక్కిన చరిత్ర ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీలో ప్రతిపక్షాలే లేకుండా పార్లమెంట్‌ను నడిపారు. విపక్షాలను జైలులో బంధించి మీడియా గొంతు నులిమారు. అసలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ప్రతిపక్షాలకు ఉన్నదా అన్నది అసలు ప్రశ్న.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-09-08T09:41:42+05:30 IST