కొవిడ్ ఎఫెక్ట్.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయొద్దంటున్న వైద్య నిపుణులు

ABN , First Publish Date - 2021-05-16T15:53:29+05:30 IST

యూఏఈలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. అయినప్పటికీ అక్కడి డాక్టర్లు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏ

కొవిడ్ ఎఫెక్ట్.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయొద్దంటున్న వైద్య నిపుణులు

అబుధాబి: యూఏఈలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. అయినప్పటికీ అక్కడి డాక్టర్లు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదంటున్నారు. విషయంలోకి వెళితే.. ఇండియాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పలు దేశాల్లో ఇండియన్ వేరియంట్‌కు సంబంధించిన కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో అమెరికా కూడా కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తమ దేశ ప్రజలకు సూచించింది. ఈ క్రమంలో యూఏఈ వైద్య నిపుణులు యూఏఈ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్కులు ధరించడాన్ని మాత్రం మానుకోవద్దని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ ఏడాది చివరి వరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



విధిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని పాటించాలని పేర్కొన్నారు. అలాగే టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దుబాయిలోని మేడియర్ హాస్పిటల్ పని చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ అబ్నర్ రీవాస్ అబేజో స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ ‘కొత్త రకం వైరస్ ఇండియాలో విజృంభిస్తున్న తీరును చూస్తూనే ఉన్నాం. కాబట్టి చాన్స్ తీసుకోవద్దు. ప్రయోగాలు చేయడానికి ఇది సమయం కాదు. ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అన్నారు. అంతేకాకుండా మాస్క్‌ల విషయంలో మార్గదర్శకాలను సవరించడానికి సీడీసీకి వేరే ఏవైనా కారణాలు ఉండొచ్చని పేర్కొన్నారు. యూఏఈ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని నేను నమ్ముతున్నాను. అదే ప్రజలకు సూచిస్తాను అని తెలిపారు. ఇదిలా ఉంటే.. శనివారం రోజు 1,321 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇంత తక్కువ మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా యూఏఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 11.5 మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసింది. 


Updated Date - 2021-05-16T15:53:29+05:30 IST