Miss Universe 2021 లో భారత్ నుంచి పోటీపడుతున్న హర్నాజ్‌ సంధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ABN , First Publish Date - 2021-12-10T18:15:54+05:30 IST

మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్‌ కౌర్ సంధు.

Miss Universe 2021 లో భారత్ నుంచి పోటీపడుతున్న హర్నాజ్‌ సంధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్‌ కౌర్ సంధు. 17 ఏళ్లకే ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ఈ చండీగఢ్ భామకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హర్నాజ్‌కు బాల్యం నుంచే మోడలింగ్‌పై అమితమైన ఆసక్తి. అటు వెండితెరపై కూడా మెరవాలనుకునేది. అందుకే విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడంపై దృష్టిసారించింది. మొదట మోడలింగ్‌లో బాగా రాణించిన హర్నాజ్ ఆ తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాలను చేజిక్కించుకుంది.


ఇప్పటికే ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు 2022లో విడుదల కానున్నాయి. ఇక మోడల్‌గానూ ఎన్నో వేదికలపై మెరిసిన ఆమె.. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్నీ సొంతం చేసుకుంది. దాంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌-2021’లో భారత్ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. అంతకుముందు హర్నాజ్ 2019లో 'మిస్ ఇండియా పంజాబ్‌'గా నిలిచారు. అనంతరం ఆమె ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు. 


అయితే, హర్నాజ్‌ ఇంతవరకు రావడం అంత సులువుగా ఏమీ జరగలేదు. ఎన్నో అవమానాలను భరించింది. మొదట్లో ఆమెను అందరూ పీలగా ఉన్నావంటూ హేళన చేసేవారట. వారి విమర్శలను పక్కనబెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగారామె. ఇప్పుడు తనను విమర్శించిన వారికి విజయంతోనే సమాధానం చెబుతానంటోంది. ఇక గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని సుస్మితాసేన్‌ (1994), లారాదత్తాలు (2000) మాత్రమే సాధించారు. ఈసారి తప్పకుండా కిరీటం సాధించి వారి సరసన చేరతానంటోంది ఈ పంజాబీ చిన్నది. ఇందులోనూ విజయం సాధించి దేశం గర్వపడేలా చేస్తానని చెబుతోంది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నా హర్నాజ్.. అమ్మాయిలకూ చదువూ చాలా ముఖ్యం అంటోంది. త్వరలో మిస్ యూనివర్స్‌ పోటీల కోసం ఇజ్రాయెల్‌ వెళ్లనున్న హర్నాజ్‌ విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం. 



Updated Date - 2021-12-10T18:15:54+05:30 IST