ప్రాణాలొడ్డిన టీచర్లను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-07-27T06:26:20+05:30 IST

ఈ ఏడాది నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, ఇంకా తక్కిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలను...

ప్రాణాలొడ్డిన టీచర్లను పట్టించుకోరా?

ఈ ఏడాది నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, ఇంకా తక్కిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించింది. కరోనా మహమ్మారి రెండవ దశ ఉధృతంగా ఉన్నప్పటికీ ఏ జాగ్రత్తలు తీసుకోకుండా, కరోనా నిబంధనలను పాటించకుండా ఉద్యోగులతో ఉపాధ్యాయులతో ఈ ఎన్నికలను నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధులు నిర్వహించలేమంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎన్నికలను వాయిదా వేయమని విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎన్నికల విధులకు హాజరు కావాలని ఆదేశాలు పంపారు. హాజరు కానట్లయితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. చాలామంది ఉపాధ్యాయులు కరోనా పాజిటివ్‌‍తో బాధపడుతూ ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరు కాలేదు. శిక్షణా తరగతులు ఇరుకైన గదులలో భౌతిక దూరం ఏమాత్రం పాటించకుండా నిర్వహించడంతో మరికొంతమంది కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. అయినా హాజరుకాని వారికి షోకాజ్ మెమోలు ఇచ్చారు, రెండవ విడత శిక్షణకు హాజరుకాకపోతే సస్పెండ్ చేస్తామని ఆదేశించారు. విధిలేక ఉపాధ్యాయులు ఉద్యోగం కాపాడుకోవాలని ఎన్నికల విధులకు హాజరయ్యారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ గదులు చాలాచోట్ల ఇరుకుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల సిబ్బంది ఐదుగురు, ఏజెంట్లు ఐదుగురు మొత్తం పదిమంది ఎలా భౌతిక దూరం పాటిస్తారో అధికారులు అర్థం చేసుకోలేదు. విధిలేక ఆ ఇరుకైన గదులల్లోనే ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా ఎన్నికల అనంతరం చాలామంది కరోనా బారిన పడ్డారు. కొందరు దుర్మరణం పాలయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విధులలో పాల్గొన్న ఉపాధ్యాయులు వరంగల్ రూరల్ జిల్లా నుంచి ఏడుగురు, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ముగ్గురు, జనగాం జిల్లా నుంచి నలుగురు- మొత్తం 14 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మంలో ఇద్దరు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నలుగురు ఉపాధ్యాయులు మరణించారు. చాలామంది ఉపాధ్యాయులు ఆసుపత్రులలో లక్షల రూపాయల వెచ్చించి చికిత్స పొంది, ఇప్పటికీ ఇంకా మందులు వాడుతున్నారు. 


కరోనా బారినపడి చనిపోయిన, చికిత్స పొందుతున్న, చికిత్స పొందిన ఉద్యోగుల ప్రాణాలకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాలి. వీరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఉపాధ్యాయుల మరణాలు సంభవించాయి. చనిపోయిన ఇరవై మంది ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. చనిపోయిన కుటుంబాల వారికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఇంకా ఎవరైనా కరోనాతో బాధ పడుతుంటే వారికి ప్రభుత్వమే ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత చికిత్స జరిపించాలి. కరోనా చికిత్సకు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టిన ఉపాధ్యాయులకు ఆ మొత్తాన్ని రీ ఇంబర్సుమెంట్ రూపంలో ఇవ్వకుండా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం దారుణం. ఎంత ఖర్చు అయితే అంత డబ్బు చెల్లించాలి. తమకు న్యాయం జరగాలని తెలంగాణ ఉపాధ్యాయులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

కందుకూరి దేవదాసు

జిల్లా అధ్యక్షులు, 

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, వరంగల్ రూరల్ జిల్లా

Updated Date - 2021-07-27T06:26:20+05:30 IST