ప్రచారం పిచ్చి తప్ప ప్రజలు పట్టరా!

ABN , First Publish Date - 2020-10-24T08:43:44+05:30 IST

సర్వే రాళ్ళపై జగన్‌ బొమ్మలు చెక్కించుకోవడం... ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం వంటి ప్రచారం పిచ్చి తప్ప ఈ ప్రభుత్వానికి కష్టకాలంలో సామాన్యులు ఎలా బతుకుతున్నారన్న సోయి లేకుండా

ప్రచారం పిచ్చి తప్ప ప్రజలు పట్టరా!

ధరలు మండిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు

ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది: చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సర్వే రాళ్ళపై జగన్‌ బొమ్మలు చెక్కించుకోవడం... ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం వంటి ప్రచారం పిచ్చి తప్ప ఈ ప్రభుత్వానికి కష్టకాలంలో సామాన్యులు ఎలా బతుకుతున్నారన్న సోయి లేకుండా పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం అయ్యారు.


‘‘ఉల్లి ధర రూ.100 దాటిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరెంటు బిల్లు ముట్టుకొంటే షాక్‌ కొడుతోంది. పెట్రోలు, డీజిల్‌, ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. సామాన్యులకు ఆదాయం తరిగిపోతోంది తప్ప పెరగడం లేదు. ఒక పక్క కరోనాకు తోడు వరదలు, వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వారిని ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం ప్రతి రోజూ కోట్లు విరజిమ్మి రంగురంగుల ఫొటోలతో ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. పేదలకు ఐదు రూపాయలకు భోజనం లభ్యమయ్యే అన్న క్యాంటీన్లను నిష్కారణంగా మూసి వేసిన ప్రభుత్వం వివిధ పథకాలనూ ఎత్తివేసింది. పేదలు ఎలా బతుకుతారన్న ఆలోచన కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని చంద్రబాబు విమర్శించారు.


‘‘ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నాం. ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నాడు. బడుగు వర్గాలపై దాడులు, ఆడబిడ్డలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది. జగన్‌ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా అరాచకం. ప్రశ్నిస్తే దాడులు, నిర్భందాలు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన తప్ప ప్రజాస్వామ్య పాలన లేదు’’ అని చంద్రబాబు ఆరోపించారు.


‘‘బెంజి కారు మంత్రి... హవాలా డబ్బుల మంత్రి... బూతుల మంత్రి... బెట్టింగ్‌ మంత్రి... పేకాట మంత్రి... ఇసుక మంత్రి... టెండర్ల మంత్రి వంటి వారితో మంత్రివర్గం కళకళలాడుతోంది. జగన్‌ కేసుల్లో ఏ 1 నుంచి ఏ 8 వరకూ ప్రభుత్వ పదవుల్లో చేరిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 




స్థానికమంటే వద్దంటున్నారు: అచ్చెన్నాయుడు

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేస్తే వైసీపీ నేతలు ఈసీని దుర్భాషలాడారని, ఇప్పుడు ఎన్నికలు పెడతామంటే వద్దని అడ్డుపడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పెడుతుంటే ఇక్కడ స్థానిక ఎన్నికలు పెట్టడానికి ఆటంకం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 


Updated Date - 2020-10-24T08:43:44+05:30 IST