వర్గీకరణను వృథా కానీయొద్దు!

ABN , First Publish Date - 2020-09-03T08:10:28+05:30 IST

షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగ(ఎస్టీ)లకు రిజర్వేషన్లను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత ధర్మాసనం...

వర్గీకరణను వృథా కానీయొద్దు!

రిజర్వేషన్ల పుణ్యాన అభివృద్ధిలోకి వచ్చిన మాలలు, మాదిగలు, లంబాడీలు, ఆదిఆంధ్ర, ఇతర సామాజిక వర్గాల్లోని కుటుంబాలు వాటిని వినియోగించకుండా తక్షణం నిలిపివేయాలి. అర్హులైన ఎస్సీలు, ఎస్టీలకే అవి దక్కాలి. లేకపోతే రిజర్వేషన్ల అమలు అసలు లక్ష్యం, ఉద్దేశాలు పక్కదారి పట్టి వచ్చే వర్గీకరణలోనూ ఇంతకుముందు జరిగిన అన్యాయమే కొనసాగి సామాజిక అశాంతికి దారి తీస్తుంది.


షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగ(ఎస్టీ)లకు రిజర్వేషన్లను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత ధర్మాసనం అభిప్రాయపడిన నేపథ్యంలో ఇన్నాళ్లు దేశవ్యాప్తంగా ఎస్సీల్లోనే ఎస్సీలుగా, ఎస్టీల్లోనే ఎస్టీలుగా అన్యాయానికి గురైన వర్గాల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. దీంతో తెలుగు నేలపై రిజర్వేషన్ల సమ పంపిణీ కోసం 25 ఏళ్లకుపైబడి ఉద్యమిస్తున్నవారికీ అండనిచ్చినట్లయింది. అయితే అదే సర్వోన్నత న్యాయస్థానం క్రీమీలేయర్‌ ప్రస్తావన కూడా తీసుకురావడం గమనార్హం. ఇకముందు పాలకులు చేసే రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం క్రీమీలేయర్‌ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ విధానం వల్ల తరతరాలుగా తెలుగు నేలపై ముదిరిన మాల, మాదిగల వివాదం; లంబాడీలు ఇతర ఆదివాసీల మధ్య నెలకొన్న విబేధాలు కూడా సమసిపోయి సుదీర్ఘ లక్ష్యాలైన రాజ్యాధికారం, అన్ని రంగాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు మార్గం సులభమవుతుంది. అంటే దేశవ్యాప్తంగా చేపట్టబోయే కొత్త వర్గీకరణ విధానం శాశ్వత పరిష్కారంగా ఉండాలి. రిజర్వేషన్లు అనుభవించి ఒకస్థాయిలో స్థిరపడ్డ కుటుంబాల స్థానంలో, రిజర్వేషన్లు అమలైనా ఇన్నేళ్లకాలంలో అవి ఏమాత్రం దరిచేరని కులాలు, కుటుంబాలకు వాటి ఫలాలు దక్కేలా పకడ్బందీ చట్టం రూపొందించాలి. 


సూటిగా చెప్పాలంటే రిజర్వేషన్ల పుణ్యాన అభివృద్ధిలోకి వచ్చిన మాలలు, మాదిగలు, లంబాడీలు, ఆదిఆంధ్ర, ఇతర సామాజిక వర్గాల్లోని కుటుంబాలు వాటిని వినియోగించకుండా తక్షణం నిలిపివేయాలి. అర్హులైన ఎస్సీలు, ఎస్టీలకే అవి దక్కాలి. లేకపోతే రిజర్వేషన్ల అమలు అసలు లక్ష్యం, ఉద్దేశాలు పక్కదారి పట్టి వచ్చే వర్గీకరణలోనూ ఇంతకుముందు జరిగిన అన్యాయమే కొనసాగి సామాజిక అశాంతికి దారి తీస్తుంది. ఊతకర్రల్లాగా ఉపయోగపడాల్సిన ఈ ప్రత్యేక సౌకర్యాలు ఉన్నతస్థానానికి చేరుకున్న వ్యక్తులకు కూడా ఉపయోగపడాలనుకోవటం సాటివారి బతుకుల్లో నుంచి ఊపిరి తీయడంలాంటిదే. ఈ స్వార్థపూరితమైన ఆలోచననే వైషమ్యాలకు దారితీస్తుంది.


చరిత్రలో ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న చర్చలోకి పోవడం లేదు. కానీ వివిధ రాష్ట్రాల పరిస్థితులను పక్కనబెట్టి తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలు, సామాజిక హోదాలను గమనిస్తే.. రిజర్వేషన్లను ఉపయోగించుకొని మాలలు, మాదిగలు, లంబాడీ సామాజిక వర్గాల్లోని కొన్ని కుటుంబాలు మాత్రమే విద్యా, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార తదితర రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధిలోకి వచ్చాయి. అలా ఒకస్థాయిలో స్థిరపడ్డ కుటుంబాలు రిజర్వేషన్లను వదులుకోకుండా తరతరాలుగా తమ కుటుంబాలకే ఆ వెసులుబాటును వారసత్వంగా దక్కేలా చేస్తున్నాయి. దీనివల్ల సంపన్న మాలలు-పేద మాలలు, సంపన్న మాదిగలు-నిరుపేద మాదిగలు, బాగుపడ్డ లంబాడీలు-వెనుకబడ్డ లంబాడీలు.. ఇలా దాదాపు రిజర్వేషన్లు అమలైన కాలం నుంచి నేటిదాకా ప్రతి కులంలో రాజు-పేద అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ అసమానతలను సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు రిజర్వేషన్ల అమలుతీరును ఎప్పటికప్పుడు సమీక్షించకపోవడం వల్ల, ఎస్సీ ఎస్టీలను కేవలం ఓటుబ్యాంకు కోసం వాడుకోవడంతో ఆ వర్గాల్లో దళిత దొరలు, దళిత బ్రాహ్మణులు అనే కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి. వీరికితోడు మోసపూరితంగా ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొంది ఉద్యోగాలు సంపాదించి బాగా స్థిరపడ్డ ఇతర కులాలవారు; కులాంతర వివాహాలు చేసుకుని తమ భార్యలు, భర్తలకు దొడ్డిదారిన క్యాస్ట్‌ సర్టిఫికేట్లు సంపాయించిపెట్టి సొంత సామాజిక వర్గాన్నే మోసం చేస్తున్న ఎస్సీ ఎస్టీలు; వారిని ముందుపెట్టి వారికి రావాల్సిన ప్రయోజనాలను మింగేస్తున్నవారూ ఉన్నారు. దీంతో రిజర్వేషన్ల ఫలాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదు. ఫలితంగా దళితుల్లోనే దళితులుగానే మిగిలిపోతున్నారు. 


మన దేశం అనేక కులాల సమాహారం. చేపట్టే వృత్తి, ఆచార, వ్యవహారాలను బట్టి ప్రతి కులం దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నది. అయితే కొన్ని కులాలు మాత్రం వృత్తుల్లోనూ, సంప్రదాయాల్లోనూ, సామాజిక హోదాల్లోనూ సామీప్యతను కలిగి ఉన్నాయి. అయినా ఒక కులం మరో కులానికి ఎక్కువ, తక్కువ స్థాయిలు అనుభవిస్తున్నాయి. ఈ కులవ్యవస్థ రాజేసిన నిప్పుల వల్ల అంటరానికులాల్లోనూ కంచంపొత్తు (కలిసి భోజనం చేయడం, సహోదరత్వం), మంచం పొత్తు (వివాహ సంబంధాలు) లేకుండా పోయాయి. తదనంతర కాలంలో కులానికి విలువ పెరగడం, అది రాజకీయాలతో పెనవేసుకోవడంతో మాల, మాదిగల నుంచి మొదలుకొని దాదాపు ప్రతి కులం మరో కులానికి వైరిపక్షంగా మారింది. ఫలితంగా కులాన్ని కాదనుకున్నా, రిజర్వేషన్లను వదులుకున్నా బతుకే లేదన్న భయం మొదలైంది. అలా రిజర్వేషన్లతో ఏమాత్రం లబ్ధిపొందినా, లాభం ఉందని తెలిసినా పోటీ అనుకున్న కులాన్ని మొత్తంగా దోషిగా చేయడం, అందుకు అనుగుణంగా ప్రతిఘాతక చర్యలకు దిగడం పరిపాటిగా మారింది. 


బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కాలంలో జరిగిన వ్యవస్థీకృతమైన పొరపాటే 1994లో ఉద్యమం మొదలుపెట్టిన మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) డిమాండ్‌లోనూ జరిగింది. వేల సంవత్సరాలుగా అంటరానితనం, అణచివేతలు, పేదరికాలు వారసత్వంగా అనుభవిస్తున్న ఎస్సీలు, ఎస్టీలు అప్పటికే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన కులాలు, సామాజిక సమూహాలతో పోటీపడేలా అంబేద్కర్‌ సహా నాటి పాలకులు స్వాతంత్య్రానంతరం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పటికీ అంటరాని కులాలుగా పిలువబడ్డ కులాల్లోనూ, అడవుల్లోనూ, సంచార జీవితాలు గడుపుతున్న ఆదివాసీలు, గిరిజనుల్లోనూ కులాలున్నప్పటికీ నాటి పరిస్థితుల దృష్ట్యా వీటిని ఒక సమూహంగా భావించి ఎస్సీ, ఎస్టీలను గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు. ఈ విధానం వల్ల వృత్తులు లేని కులాల వారు సహజంగానే బతుకుపోరాటంలో వ్యవసాయ కూలీలుగా, ఇతర రంగాల్లో కూలీలుగా మారడం అటు నుంచి అటు చదువుపై దృష్టిసారించడంతో రిజర్వేషన్లు వారికి ఉపయోగపడ్డాయి. పైగా తెలంగాణ వంటి ప్రాంతాలు నిజాం పాలనలో, ఆంధ్రా వంటి ప్రాంతాలు బ్రిటిష్‌ ఏలుబడిలో ఉండటం వల్ల వృత్తులపై ఆధారపడి జీవించేవారి చేతుల్లోకి పుస్తకాలు రావడం ఆలస్యమైంది. దీనివల్ల చదువుకున్నవారు ఉద్యోగాలు చేసుకోవడం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఫలితంగా అధికారం (పరిమితంగానైనా) వంటి అవకాశాలు రావడంతో వారి జీవితాల్లో అభివృద్ధి చోటుచేసుకుంది. అలా అంబేద్కర్‌ కాలం నుంచి నేటి దాకా రిజర్వేషన్ల సౌలభ్యాన్ని వినియోగించుకున్నవారు మరింత బలపడ్డారు. బలహీనులు అలాగే ఉండిపోయారు. 


మాదిగ దండోరా ఉద్యమం మాల, మాదిగల మధ్య వ్యత్యాసాల్ని గుర్తించి ఉద్యమించింది. ఒక గ్రూపుగా చూసినప్పుడు మాదిగలతో పోల్చితే మాలల్లో కొంత అభివృద్ధి కనపించవచ్చు కానీ అది కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. ఈ రెండు కులాలను ఒకదానికొకటి పోల్చినప్పుడు హెచ్చుతగ్గులుండవచ్చు కానీ మొత్తంగా కులాలుగా లబ్ధి పొందింది లేదు. అటు గిరిజనుల్లోనూ, ఆ మాటకొస్తే రిజర్వేషన్లు పొందే ఏ కులమైనా అంతే. కుటుంబాలే అధికంగా లాభపడ్డాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ: దండోరా ఉద్యమం మొదలైనప్పుడు భాగస్వాములైన నిరక్షరాస్యులు, కూలీలు, నిరుద్యోగులు, కొద్దిమంది విద్యార్థులే ఇప్పటికీ ఉద్యమిస్తున్నారు తప్పితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన మాదిగలు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదు. వారు అంటీముట్టనట్టుగానే ఉన్నారు. అలాగే మాల మహానాడును తీసుకున్నా.. ‘స్థితిమంతులై’న మాలలు ఇళ్లల్లో కూర్చొని నిరుపేద మాలలను నిరసనలకు రెచ్చగొట్టినప్పటికీ సాటి సమాజ మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టలేకపోయారు. కారణం మాదిగలు లేవనెత్తిన సామాజిక న్యాయం డిమాండ్‌ రాజ్యాంగ విలువలకు కట్టుబడి, అంబేద్కర్‌ ఆశయసాధనకు లోబడి ఉండటమే. 


అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం అమలైన ఎ, బి, సి, డి వర్గీకరణ విధానం రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల షెడ్యూల్డు కులాలకు అంగీకారయోగ్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 59, 60 ఎస్సీ కులాలు, వాటి జనాభా తదితరాలు ఇప్పుడు ఒకేలా లేవు. ఆంధ్రలో ఉన్న కులాలు తెలంగాణలో లేవు. తెలంగాణలో ఉన్న కులాలు ఆంధ్రలో లేవు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో కులాలవారీగా, కుటుంబాలవారీగా రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సంక్షేమ, వ్యాపార రంగాల వారీగా లెక్కలు తేలాలి. ఒక వ్యక్తి రిజర్వేషన్ల ద్వారా ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి తన వారసులకూ అవే రిజర్వేషన్లు వినియోగించుకుంటే తక్షణ నిలువరించాలి. ఈ క్రీమీలేయర్‌ విధానం తరతరాలుగా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా పదవులను ‘రిజర్వుడ్‌’ చేసుకున్న కుటుంబాలను కట్టడి చేసేంత వరకు అమలు కావాలి. పాఠశాల ముఖం చూడని ఎస్సీ, ఎస్టీ కులాలు.. అలాగే పార్లమెంటు, అసెంబ్లీలు అటుంచి స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులుగా అడుగుపెట్టని ఉపకులాలూ ఉన్నాయి. వీరికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన న్యాయమైన వాటాలు దక్కాలంటే జనాభా దమాషా ప్రకారం వర్గీకరణతోపాటు రిజర్వేషన్ల వల్ల లబ్ధిపొందిన వారి పైన కఠినంగా క్రీమీలేయర్‌ విధానం అమలు చేయాలి. ఈ విధానాన్నే రిజర్వేషన్లకు అర్హులైన అన్ని కులాలకూ వర్తింపజేయాలి. క్రీమీలేయర్‌ అమలైనంత మాత్రానా, రిజర్వేషన్లు నిలిపివేసినంత మాత్రానా కులం నుంచి తొలగించినట్లుకాదు. ఈ దేశంలో కులం, దాని తాలుకూ విషం ఉన్నంత వరకు ఏ స్థాయిలో ఉన్నా వివక్షలకు గురయ్యే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు అండగా ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించి, సాటి వారిని తమలాగే అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అంబేద్కర్‌ చెప్పిన ‘పే బ్యాక్‌ టు ద సొసైటీ’ సూత్రానికి కట్టుబడి రిజర్వేషన్లు ఆజన్మాంతం అట్టిపెట్టుకునేవి కావన్న వాస్తవాన్ని గ్రహించి, ‘గివప్‌ రిజర్వేషన్‌’ నినాదాన్ని పాటించాలి. అప్పుడే పేద, ధనిక తారతమ్యాలు రూపుమాసేందుకు, బాధిత సమూహాలైన ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, అన్ని వర్గాల్లోని మహిళలు, ముస్లింలు, సంపన్న కులాల్లోని పేదలు ఏకమయ్యేందుకూ మార్గం సుగమమవుతుంది. 

మహేష్‌ కొంగర

Updated Date - 2020-09-03T08:10:28+05:30 IST