Abn logo
May 12 2020 @ 00:27AM

అప్పు చేయి.. పప్పు కూడు తినకు!

Kaakateeya

కొవిడ్- 19తో నెలకొన్న విషమ సమస్యలను అధిగమించాలంటే మన జీవన ప్రమాణాలను విధిగా తగ్గించుకోవల్సి ఉన్నదన్న వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. చమురు ఉత్పత్తులు, ఇతర సరుకులపై దిగుమతి సుంకాలను పెంచి తీరాలి. తద్వారా లభించిన ఆదాయంతో మన ప్రజలకు సార్వత్రిక మౌలిక ఆదాయాన్ని సమకూర్చాలి. దీని వల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహదం జరుగుతుంది.


మానవాళి జీవన శోభను హరించివేస్తోన్న మహామారి కొవిడ్-19. ఈ విపత్తు మూలంగా మనమెదుర్కొంటున్న ప్రశ్న: మన జీవన ప్రమాణాలను తగ్గించుకోవడమా లేక ప్రస్తుత జీవన శైలిని కృత్రిమంగా నిర్వహించుకోవడమా? జీవన స్థాయి విషయం లో రాజీపడేందుకు అంగీకరించని పక్షంలో మనం మరింత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవలసివుంటుంది. 


ప్రభుత్వాలకు రాబడులు తగ్గిపోతాయనడంలో సందేహం లేదు. అయితే అవి తమ వ్యయాలను అనివార్యంగా పెంచవలసివున్నది. ప్రభుత్వాలకు ఇప్పుడు వస్తున్న ఆదాయం, కరోనా కల్లోలానికి ముందు లభించిన రాబడిలో 30 నుంచి 50 శాతం మేరకు మాత్రమే ఉన్నది. ఇదే సమయంలో ప్రజారోగ్యానికి, వ్యాపార సంస్థలకు ఆర్థిక ఉద్దీపనలు సమకూర్చేందుకు చేసే వ్యయాలను ఇతోధికంగా పెంచవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు స్తంభించిపోయిన తరుణంలో ప్రభుత్వాలకు రాబడులు ఎక్కడ నుంచి వస్తాయి? వ్యయాల విషయంలో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యమివ్వాలి అన్నది ఒక సంక్లిష్ట ప్రశ్న. 


ఆదాయాలను పెంచుకునేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి–ఆర్థిక మార్కెట్లనుంచి రుణాలు తీసుకోవడం. ఈ రుణాలపై భవిష్యత్తులో వడ్డీలు చెల్లించవలసివుంటుంది. ఇందుకు ప్రభుత్వం కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం చోటుచేసుకొని ఆదాయం తగ్గిపోతుంది. రెండు–-పన్నులు విధించడం. దీనివల్ల ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆదాయం తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదల భారం ప్రజలందరిపైన పడుతుంది. ప్రయోజనాలు మాత్రం ఉద్దీపన పథకాల లబ్ధిదారులైన నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ప్రాప్తిస్తాయి. ఉదాహరణకు ప్రభుత్వం కోటి రూపాయల రుణం తీసుకొని విమానయాన రంగానికి ఆర్థిక సహాయం సమకూర్చిందనుకోండి. అప్పుడు ఆ రుణంపై చెల్లించాల్సిన వడ్డీ భారం ప్రజలందరిపైన పడుతుంది. ప్రయోజనాలు మాత్రం విమాన ప్రయాణాలు చేసే సంపన్న వర్గాల వారికి మాత్రమే దక్కుతాయి.


రుణాలు తీసుకోవడం కాకుండా దిగుమతి చేసుకొంటున్న పెట్రోలియం చమురు ఉత్పత్తులు, ఇతర సరుకులపై సుంకాలు పెంచి తద్వారా లభించిన ఆదాయాన్ని దేశంలోని కుటుంబాలన్నిటికీ సార్వత్రిక కనీస ఆదాయాన్ని సమకూర్చేందుకు ఉపయోగించిందనుకోండి. ఈ చర్య ప్రభావం భిన్నంగా వుంటుంది. పెరిగిన దిగుమతి సుంకాల భారం సంపన్నులపై పడుతుంది. ప్రయోజనాలు ప్రజలందరికీ లభిస్తాయి. దిగుమతి సుంకాలను పెంచడమే అన్నివిధాల ప్రయోజనకరమని నేను విశ్వసిస్తున్నాను. కరోనా ఉత్పాతం వల్ల మన ఆర్థికాభివృద్ధి సంకోచించుకు పోవడం ఖాయం. మన మెదుర్కోవల్సిన తక్షణ సవాల్ ఆర్థిక వ్యవస్థను సంక్షోభ పూర్వ స్థాయికి పునరుద్ధరించడమే. స్పష్టంగా చెప్పాలంటే సంక్షోభ అనంతర ఆదాయాలను సంక్షోభ పూర్వ స్థాయి రాబడులతో సమానంగా సమకూర్చుకోవడమే మన సమస్య. తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీభారం పెరిగిపోతున్నప్పటికీ సమకూరే ఆదాయాలు యథాతథంగా వుండిపోతాయి. వడ్డీ భారం అదనంగా పెరిగిపోతుండడం వల్ల సంక్షోభ పూర్వస్థాయికి ఆర్థిక వ్యవస్థచేరుకోవడం చాలా కష్టం. ‘సంక్షోభ కాలంలో ప్రభుత్వం తీసుకున్న రుణాలకు భవిష్యత్తులో వడ్డీ చెల్లించేందుకై కరెన్సీ నోట్లను ముద్రించాల్సివుంటుంది. అయితే ఆర్థిక కార్యకలాపాలు ఎటు వంటి పురోగతి లేకుండా యథాతథంగా వుండిపోతాయని’ ప్రొఫెసర్ రౌబిని అన్నారు. ఇది సంపూర్ణ సత్యం. ఈ పరిస్థితి ‘స్టాగ్ ఫ్లేషన్’. (స్తబ్దతా ద్రవ్యోల్బణం:- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణంతోపాటు ఆర్థిక స్తబ్దత కూడా కొనసాగుతూ వుండడాన్ని స్తబ్దతా ద్రవ్యోల్బణం అంటారు. ఈ రెండూ నెలకొనివున్నప్పుడు ధరలు, నిరుద్యోగం జంట గా పెరుగుతూ వుంటాయి).


ప్రభుత్వఆదాయాలు పెరిగినా పెర గక పోయినా ప్రభుత్వ వ్యయాలను అనివార్యంగా పెంచవలసివుంటుంది. సంక్షోభ కాలపు ఆర్థిక నష్టాల భారాన్ని భావితరాలపై మోపడం శ్రేయస్కరం కాదు. మరేం చేయాలి? మన జీవనప్రమాణాలను విధిగా ఇప్పుడే, ఇక్కడే తగ్గించుకోవాల్సిన అగత్యం ఎంతైనా వుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించి తీరాలి. ఒక కుటుంబం, తగ్గిన ఆదాయానికి అనుగుణంగా జీవనస్థాయిని కూడా తగ్గించుకోవడానికి నిర్ణయించుకుంటే పండ్లకు బదులు వేరుశనగపప్పును మాత్రమే వినియోగించుకోవడానికి సిద్ధమవుతుంది. దీని వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎలాంటి హాని వుండబోదు. అలా కాకుండా పండ్లను ప్రతిరోజూ విరివిగా వినియోగించుకోవడాన్ని కొనసాగిస్తే అప్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. 


కొవిడ్ 19తో నెలకొన్న విషమ సమస్యలను అధిగమించాలంటే మన జీవన ప్రమాణాలను విధిగా తగ్గించుకోవల్సి వున్నదన్న వాస్తవాన్ని మనం క్రియాశీలకంగా అంగీకరించి తీరాలి. చమురు ఉత్పత్తులు, ఇతర సరుకులపై దిగుమతి సుంకాలను పెంచి తీరాలి. తద్వారా లభించిన ఆదాయంతో మన ప్రజలకు సార్వత్రిక మౌలిక ఆదాయాన్ని సమకూర్చాలి. ప్రతి కుటుంబానికి ఒక నిర్దిష్ట మౌలిక ఆదాయం సమకూరినప్పుడు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహదం జరుగుతుంది. భవిష్యత్తులో వడ్డీ చెల్లింపుల భారమూ వుండబోదు. ప్రస్తుత సంక్షోభం నుంచి సంక్షేమంతో బయటపడగలుగుతాము.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...