DivyaVani: చంద్రబాబును కలిసిన దివ్యవాణి.. టీడీపీ అధినేత ఆమెకు క్లియర్‌గా చెప్పిందొక్కటే..

ABN , First Publish Date - 2022-06-02T02:07:30+05:30 IST

సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను..

DivyaVani: చంద్రబాబును కలిసిన దివ్యవాణి.. టీడీపీ అధినేత ఆమెకు క్లియర్‌గా చెప్పిందొక్కటే..

అమరావతి: సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని దివ్యవాణి మాట్లాడారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగ్యాస్త్రం సంధించారు. తనను సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు. ఫేక్‌ ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారని దివ్యవాణి మీడియాకు చెప్పారు.


అసలేం జరిగిందంటే..

మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి ఆరోపణలు చేశారు. ఇంకా ఏం చెప్పారంటే.. ‘మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు. ఒక క‌ళాకారుడు (NTR) పెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంది. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను’ అని దివ్యవాణి చెప్పారు. అంతటితో ఆగని ఆమె వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. మంగళవారం (31-05-2022) ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్య వాణి ట్వీట్ చేశారు. ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు.


అయితే.. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. దీంతో.. దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టమైంది. ఈ గందరగోళానికి తెరపడింది. ఈ విషయంపై వివరణ ఇచ్చి, తన ఇబ్బందులను వివరించేందుకు దివ్యవాణి చంద్రబాబును కలిశారు.

Updated Date - 2022-06-02T02:07:30+05:30 IST