కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ‘ఆరోగ్యశ్రీ’కి తూట్లు!

ABN , First Publish Date - 2021-06-27T08:21:21+05:30 IST

ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం పేద ప్రజల వైద్య సేవలను పణంగా పెడుతోంది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని

కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ‘ఆరోగ్యశ్రీ’కి తూట్లు!

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు దూరం

బోధనాస్పత్రులకు ఇచ్చే నిధుల్లో 40 శాతం కోత

ఆ మొత్తం ‘ఏపీ మెర్క్‌’కు బదలాయింపు

ఇకపై ట్రస్టు రివాల్వింగ్‌ ఫండ్‌ 5 శాతమే

20 శాతం నిధులతోనే ‘పేషెంట్‌ కేర్‌’

బ్యాంకుల నుంచి 12 వేల కోట్ల రుణం

ఆరోగ్యశ్రీలో కోత నిధులతోనే చెల్లింపు

జీవో 325 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

బోధనాస్పత్రుల్లో సదుపాయాలకు కటకటే

శస్త్రచికిత్సలకు నిధుల కొరత ప్రమాదం

1500 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం


ఏపీ మెర్క్‌! అంటే... ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌! ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన 16 వైద్య కళాశాలల బాధ్యత ఏపీ మెర్క్‌దే. మెడికల్‌ కాలేజీల ఆర్థిక వ్యవహారాలు, ఆస్తులు ఈ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉంటాయి. కాలేజీల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోవాలన్నది ప్రతిపాదన! కానీ... ఆస్తులూ, ఆదాయమూ లేని ‘ఏపీ మెర్క్‌’కు అంత రుణం ఇచ్చేదెవరు? అందుకే... సర్కారు మరో వినూత్నమైన ఆలోచన చేసింది. బోధనాస్పత్రుల్లో పేదలకు చికిత్స అందించే ‘ఆరోగ్యశ్రీ’ నిధుల్లో కోత పెట్టి... వాటిని ‘ఏపీ మెర్క్‌’కు తరలిస్తారు. అవే నిధులతో ‘ఏపీ మెర్క్‌’ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను తిరిగి చెల్లిస్తుందట! ఇదీ... పథకం! మరి... నిధుల్లేకపోతే ఆరోగ్యశ్రీ అమలు ఎలా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం పేద ప్రజల వైద్య సేవలను పణంగా పెడుతోంది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన వరుస ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగిస్తూ... మరింత మెరుగులు దిద్ది అమలు చేశాయి. కానీ... అప్పుడు తండ్రి ప్రారంభించిన పథకం లక్ష్యాన్ని నేడు తనయుడు జగన్‌ నెమ్మదిగా నీరుగార్చేస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన చిన్న జీవో (నంబర్‌ 325)తో పథకం లక్ష్యాన్నే పక్కదారి పట్టించారు. పేదల వైద్యం కోసం కేటాయించే ఆరోగ్యశ్రీ నిధులను ఏపీ మెర్క్‌ ద్వారా  కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి బదలాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు నిర్మించాలని నిర్ణయించుకుంది. దీంతోపాటు ఇప్పటికే ఉన్న 11 బోధనాస్పత్రులను ‘నాడు - నేడు’ కింద మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాల కోసం సుమారు రూ.12 వేల కోట్లు నిధులు అవసరం. అంత మొత్తం సమకూర్చే పరిస్థితి లేకపోవడంతో... బ్యాంకుల నుంచి రుణాలు సేకరించాలని భావించారు. కానీ... రాష్ట్ర ఆర్థిక స్థితిని చూసి బ్యాంకులు కూడా డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో నిధుల సమీకరణకు సర్కారు పలురకాల మార్గాలు అన్వేషించి... ఏదీ కుదరక, చివరికి ‘ఆరోగ్యశ్రీ’ నిధులపై  కన్నేసింది.


ఈ పథకం  నిధులతోనే బ్యాంక్‌లకు ‘రీ పేమెంట్స్‌’ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.  దాని మేరకే జీవో నంబర్‌ 325 జారీ అయ్యింది. సాధారణంగా ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వమే దానికి నిధులు సమకూర్చుతుంది. కానీ... ఏపీ మెర్క్‌కు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. రూ.5 లక్షల మూల ధనాన్ని కూడా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి  తీసుకున్నారు. కానీ... రూ.12 వేల కోట్లు రుణంతెచ్చి మెడికల్‌ కాలేజీలు కట్టే బాధ్యతను ఏపీ మెర్క్‌కు అప్పగించేశారు. ఆదాయం కోసం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నారు.


రోగులకు, బోధనాస్పత్రులకే నష్టం

‘ఆరోగ్యశ్రీ’ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించడం బాగున్నప్పటికీ... దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతాయని అప్పట్లో నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో... ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ‘ఆరోగ్యశ్రీ’ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం నిధులతో బోధనాస్పత్రుల్లో వసతులు మెరుగుపరుస్తూ... చికిత్స అందించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. దీనికి ఒక పద్ధతి నిర్ణయించారు. శస్త్ర చికిత్సకు నిర్ణయించిన మొత్తంలో 20 శాతాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు రివాల్వింగ్‌ నిధిగా తానే ఉంచుకుంటుంది. 45 శాతాన్ని ‘పేషంట్‌ కేర్‌’ కింద రోగికి అవసరమైన ఔషధాలు, బెడ్‌ చార్జీలు, ఇంప్లాంట్ల కోసం వెచ్చిస్తారు. మిగిలిన 35 శాతం మొత్తాన్ని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, క్లాస్‌ 4 సిబ్బందికి ప్రోత్సాహకంగా అందిస్తారు. ఈ మొత్తం పద్ధతిని శుక్రవారం సాయంత్రం జారీ చేసిన జీవో ద్వారా మార్చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ వద్ద ఉండాల్సిన రివాల్వింగ్‌ ఫండ్‌ను 20 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. ‘పేషంట్‌ కేర్‌’ నిధులను 45 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. చికిత్స చేసే సిబ్బందికి ఇచ్చే 35 శాతం నిధులను మాత్రం యథాతథంగా ఉంచారు. వెరసి... రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి 15 శాతం, పేషంట్‌ కేర్‌ నిధుల నుంచి 25 శాతం... ఇలా 40 శాతం మొత్తాన్ని కొత్త మెడికల్‌ కాలేజీల కోసం తీసుకునే రుణం తిరిగి చెల్లింపునకు వీలుగా... ‘ఏపీ మెర్క్‌’కు బదిలీ చేస్తారు.


ఇక జరగబోయేదేమిటి?

20 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ను బోధనాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆపరేషన్‌ థియేటర్లలో వసతుల కల్పన, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనిని 5 శాతానికి కుదించడంతో ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడనుంది. అంటే... కొత్త ఆస్పత్రుల నిర్మాణం కోసం పాత ఆస్పత్రుల అభివృద్ధిని పణంగా పెడుతున్నారన్న మాట! ఇక... 45 శాతం పేషంట్‌ కేర్‌ నిధులే కొన్ని శస్త్రచికిత్సలకు సరిపోవడంలేదు. ఉదాహరణకు... గుండె చికిత్సకు సంబంధించి నాణ్యమైన స్టంట్స్‌ వేసేందుకు ఆ డబ్బులు సరిపోవు. దీనిని 20 శాతానికి తగ్గిస్తే ఏ స్థాయిలో శస్త్ర చికిత్సలు చేస్తారో, ఎలాంటి వైద్య సేవలు అందిస్తారో!


1500 ఉద్యోగాలు హుష్‌కాకి...

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి పేషంట్‌ కేర్‌ కింద వచ్చే నిధుల్లో కొంత మొత్తం బోధనాస్పత్రుల వద్ద ఉంటుంది. ఈ నిధులను ఆరోగ్యశ్రీ రోగుల అవసరాలకే ఉపయోగించాలి. 11 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగుల సేవల కోసం ఆయా ఆస్పత్రుల అధికారులు సమారు 1500 మంది సిబ్బందిని నియమించుకున్నారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, ఫార్మసిస్టులు ఇలా అన్ని రకాల కేడర్‌ సిబ్బంది ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నిధుల ద్వారానే జీతాలు అందిస్తున్నారు. ఇప్పుడు బోధనాస్పత్రులకు వచ్చే నిధుల్లో కోత పడటంతో 1500 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే తప్ప... వారు ఉద్యోగాల్లో కొనసాగే పరిస్థితి లేదు. కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ఒక చిన్న జీవో పేద ప్రజలకు అందాల్సిన నాణ్యమైన వైద్యాన్ని... వందల మంది ఉద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-06-27T08:21:21+05:30 IST