అల్లుడే కాలయముడై..

ABN , First Publish Date - 2021-10-19T08:07:57+05:30 IST

పెళ్లికి కట్నంగా ఇచ్చిన పొలం అమ్మడానికి ఒప్పుకోవడం లేదని అల్లుడు ఉన్మాదిలా మారాడు. అత్తింటి వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు.

అల్లుడే కాలయముడై..

  • పొలం విషయంలో వివాదం.. అత్తింటిపై కత్తితో దాడి
  • మామ దారుణ హత్య.. అత్త, భార్య పరిస్థితి విషమం
  • మరదలికి గాయాలు.. పరారీలో నిందితుడు


మైలవరం రూరల్‌, అక్టోబరు 18: పెళ్లికి కట్నంగా ఇచ్చిన పొలం అమ్మడానికి ఒప్పుకోవడం లేదని అల్లుడు ఉన్మాదిలా మారాడు. అత్తింటి వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దాడిలో మామ మృతిచెందగా.. అత్త, భార్య పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా, మైలవరం మండలం వెదురుబీడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు ధనలక్ష్మికి గన్నవరం మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన వీర్ల రాంబాబుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన అరెకరం పొలం అమ్మేద్దామని రాంబాబు తరచూ ధనలక్ష్మితో గొడవ పడుతుండేవాడు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై ఇద్దరికీ గొడవ జరగడంతో ధనలక్ష్మి పిల్లల్ని తీసుకొని వెదురుబీడెంలోని పుట్టింటికి వచ్చేసింది. దాంతో రాంబాబు అత్తింటివారిపై కోపంతో రగిలిపోయాడు.


సోమవారం తెల్లవారుజామున వెదురుబీడెం వచ్చి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మామ కొలుసు కొండలరావు, అత్త రమణ, భార్య ధనలక్ష్మి, మరదలు భవానీలపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కొండలరావు, రమణ, ధనలక్ష్మికి తీవ్రగాయాలు కాగా, భవానీ స్వల్ప గాయాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా కొండలరావు (50) చికిత్స పొందుతూ మృతిచెందాడు. రమణ, ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాంబాబు పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-10-19T08:07:57+05:30 IST