అడవిలో భూముల లొల్లి

ABN , First Publish Date - 2022-06-02T08:02:39+05:30 IST

భూపాలపల్లి, జూన్‌1(ఆంధ్రజ్యోతి): అడవిలో భూ ముల పంచాయితీ రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదానికి దారి తీస్తున్నాయి. గొడవలు వ్యక్తిగతంగా మారి కులాల లొల్లిగా తెరపైకి

అడవిలో భూముల లొల్లి

-రెవెన్యూ, ఫారెస్టు శాఖల మధ్య రాజుకున్న వివాదం

-భూపాలపల్లి జిల్లా మహాముత్తారం శివారులో గొడవ

-బోర్లు వేస్తున్న రైతులను అడ్డుకున్న ఫారెస్ట్‌ అధికారులు

-తహసీల్దార్‌, డీటీలపై కోర్టులో కేసు 

-పరస్పరం ఎస్సీ, ఎస్టీ కేసులు

-రెవెన్యూ, ఫారెస్టు శాఖల మధ్య రాజుకున్న వివాదం..

-భూపాలపల్లి జిల్లా మహాముత్తారం శివారులో గొడవ

భూపాలపల్లి, జూన్‌1(ఆంధ్రజ్యోతి): అడవిలో భూ ముల పంచాయితీ రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదానికి దారి తీస్తున్నాయి. గొడవలు వ్యక్తిగతంగా మారి కులాల లొల్లిగా తెరపైకి వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో తలెత్తిన అటవీ భూవివాదం రెండు శాఖల మధ్య అగ్గి రాజేస్తోంది.

5 వేల ఎకరాల్లో వివాదం

మహాముత్తారం సర్వే నెంబరు 487లో సుమారు 5 వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో 2 వేల ఎకరాలకు పైగా చుట్టుపక్కల గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల ఆయిల్‌పామ్‌ సాగును ప్రొత్సహిస్తుండటంతో 43 మంది రైతులు  తాము సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేసుకోవడం ప్రారంభించారు. 10 బోర్లు వేసుకున్న తర్వాత ఆజంనగర్‌ ఫారెస్ట్‌ ఇంచార్జి రేంజర్‌ కిరణ్‌ తన సిబ్బందితో వచ్చి అభ్యంతరం చెప్పారు. దీంతో రైతులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. 

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌

రైతులు బోర్లు వేసుకుంటున్న స్థలానికి వచ్చిన తహసీల్దార్‌ మాధవి అటవీ శాఖ అధికారులతో చర్చించారు. అది ప్రభుత్వ రెవెన్యూ భూమి అని, రైతులకు ప్రభుత్వం ఇప్పటికే పట్టాలిచ్చిందని, సాగు కోసం బోర్లు వేసుకుంటే అడ్డుకునే హక్కు అటవీశాఖకు లేదని వాదించారు. అయితే, ఇది అటవీ శాఖ భూమి అని రేంజర్‌ కిరణ్‌ వాదిస్తున్నారు. 

పరస్పరం అట్రాసిటీకేసులు

ఇరుశాఖల అధికారుల మధ్య వాగ్వాదం జరిగిన 12 రోజుల తర్వాత మే 26న మంథని కోర్టులో అటవీ శా ఖ అధికారులు కేసు వేశారు. తమ భూముల్లోకి అక్రమంగా చొరబడి బోర్లు వేస్తున్నారని, రైతులకు దగ్గరుండి అనుమతులు ఇస్తున్నారని, దీనిపై తహసీల్దార్‌ మాధవి, డిప్యూటీ తహసీల్దార్‌ సందీ్‌పను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఇది కోర్టు పరిశీలనలో ఉండగానే తనను కులం పేరుతో దూషించిన ఇంచార్జి రేంజర్‌ శంకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌.. మహాముత్తారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్‌ మాధవి తనను కులం పేరుతో దూషించారని బీట్‌ ఆఫీసర్‌ దిలీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రెండు శాఖల మధ్య నెలకొన్న భూ వివాదం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వరకు వెళ్లడంపై ఇరు శాఖల్లో ఆందోళన వ్యక్తమైంది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో రెవెన్యూ, ఫారెస్ట్‌ శాఖల మధ్య 50 వేల ఎకరాలకు పైగా వివాదాలున్న భూములు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జా యింట్‌ సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభు త్వం సూచించినా.. ఏ శాఖ అధికారి కూడా ముందుకు రాకపోవడంతో ఇలాంటి వివాదాలు తలెత్తుతు న్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

రెవెన్యూ, రైతుల ఆందోళనలు

తహసీల్దార్‌ మాధవిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు.  కేసును ఎత్తివేయాలని కోరుతూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, ఇక్బాల్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అలాగే జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-06-02T08:02:39+05:30 IST