తెలంగాణ హైకోర్టుకు చేరిన Disha Commission నివేదిక

ABN , First Publish Date - 2022-07-04T20:13:54+05:30 IST

దిశ కమిషన్ (Disha Commission) నివేదిక తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు చేరింది. దిశ అత్యాచారం

తెలంగాణ హైకోర్టుకు చేరిన Disha Commission నివేదిక

హైదరాబాద్: దిశ కమిషన్ (Disha Commission) నివేదిక తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు చేరింది. దిశ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఎన్‌కౌంటరైన నలుగురు నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నిర్ధారించింది. నివేదికపై అభిప్రాయాలను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టుకు దిశ కేసు చేరింది. దిశ కేసులో అమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్‌రెడ్డిని హైకోర్టు నియమించింది.


దిశ కేసులో నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) నిర్ధారించింది. నిందితులకు తమకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెబుతున్న కథనం బూటకమని, తమ నిర్బంధంలో నిరాయుధులుగా ఉన్న నిందితులను పోలీసులే చంపేశారని తేల్చిచెప్పింది. చంపే ఉద్ధేశంతోనే వారిపై కాల్పులు జరిపారని తెలిపింది. బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేసి, విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్. సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం హత్య కేసులు నమోదు చేయాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. ఎన్‌కౌంటర్‌ (Encounter)పై పోలీసులు చెప్పిందంతా కట్టుకథేనని స్పష్టం చేసింది. 


ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, ఐపీసీ 76, ఐపీసీ 300(3)కింద వారు మినహాయింపు పొందలేరని కమిషన్‌ స్పష్టం చేసింది. పది మంది పోలీసు అధికారులపై ఐసీపీ 302, 201, 34 సెక్షన్ల కింద హత్యానేరం   కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిందితుల గుర్తింపు, అరెస్టు సమయాల్లో పోలీసులు అనేక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులను ఉల్లంఘించారని తేల్చింది. నిందితులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదని, వారెంట్‌ ఇవ్వలేదని, న్యాయ సాయం అందించలేదని ప్రస్తావించింది.


కమిషన్‌ ఎందుకు?

2019 నవంబరు 27 రాత్రి హైదరాబాద్‌ శివారులో బెంగళూరు హైవే మీద రోడ్డు పక్కన లారీ ఆపి మద్యం తాగుతున్న నలుగురు యువకులు అక్కడ బైక్‌ పార్క్‌ చేసిన మహిళా వెటర్నరీ డాక్టర్‌ను కిడ్పాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడి, పెట్రోల్‌ పోసి కాల్చిచంపిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా తనను నలుగురు వేధిస్తున్నారని ఆ 27 ఏళ్ల యువతి చెల్లెలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలను తీవ్ర అభద్రతా భావనకు గురి చేసింది. పోలీసులు సకాలంలో స్పందించక పోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మూడో రోజు అదే జాతీయ రహదారి కల్వర్ట్‌ కింద అగ్నికి ఆహుతైన స్థితిలో వెటర్నరీ డాక్టర్‌ మృతదేహం లభించింది. తర్వాత పోలీసులు వేగంగా స్పందించి, సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నలుగురు నిందితులను పట్టుకున్నారు. విచారణ నిమిత్తం వారిని డిసెంబరు 6న తెల్లవారుజామున కల్వర్ట్‌ దగ్గరకు తీసుకెళ్లినపుడు ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ పట్ల దేశవ్యాప్త హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు మాత్రం జి.ఎస్‌.మణి, ప్రదీప్‌, ఎంఎల్‌ శర్మ, ముఖేశ్‌ అనే నలుగురు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ ఆధారంగా వీటిని చట్ట విరుద్ధ హత్యలుగా అనుమానించి, ఎన్‌కౌంటర్‌పై విచారణకు డిసెంబరు 12న ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. 


Updated Date - 2022-07-04T20:13:54+05:30 IST