ఓటమితో మొదలు

ABN , First Publish Date - 2021-04-12T09:55:41+05:30 IST

బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరుకు కళ్లెం వేసినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎప్పటిలాగే బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.

ఓటమితో మొదలు

తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌కు నిరాశ

10 పరుగుల తేడాతో కోల్‌కతా గెలుపు


 బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరుకు కళ్లెం వేసినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎప్పటిలాగే బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. మనీశ్‌ పాండే, బెయిర్‌స్టో ఆటతీరు విజయంపై ఆశలు కలిగించినా కీలక దశలో కేకేఆర్‌ బౌలర్లు దెబ్బ తీశారు. అటు పాండేకు సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే కోల్‌కతా మాత్రం అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా రైజర్స్‌ బౌలర్లను నితీశ్‌ రాణా ఆటాడుకున్నాడు. అతడి మెరుపులకు రాహుల్‌ త్రిపాఠి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ జత కలవడంతో కేకేఆర్‌ శుభారంభం చేసింది.


చెన్నై: ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ఆరంభించింది. ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు స్థానిక చెపాక్‌ మైదానంలో రైజర్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 ిసిక్సర్లతో 80), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) అర్ధసెంచరీలు సాధించారు. స్పిన్నర్లు రషీద్‌, నబీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి ఓడింది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్‌), బెయిర్‌స్టో (40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాణా నిలిచాడు.


పాండే, బెయిర్‌స్టో మినహా..:

లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు వార్నర్‌ (3), సాహా (7) వికెట్లను కోల్పోయింది. అయితే ఇబ్బందుల్లో పడిన జట్టును మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే ఆదుకున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ నెమ్మదిగా స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఏడో ఓవర్‌లో బెయిర్‌స్టో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 రన్స్‌ రాబట్టాడు. అదే జోరుతో ఓ సిక్సర్‌తో తను 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే ఈ ఇద్దరూ కుదురుకున్న దశలో బెయిర్‌స్టోను కమిన్స్‌ అవుట్‌ చేయడంతో జట్టు లయ దెబ్బతింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం అందించింది. అటు మనీశ్‌ చివరి వరకు క్రీజులో నిలిచినా సహకారం కరువైంది. నబీ (14), విజయ్‌ శంకర్‌ (11) కూడా కాసేపట్లోనే వెనుదిరగడంతో రైజర్స్‌ గెలుపునకు చివరి 12 బంతుల్లో 38 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్‌లో సమద్‌ (8 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్‌) రెండు సిక్సర్లు బాది 16 రన్స్‌ సాధించగా సమీకరణం 6 బంతుల్లో 22 రన్స్‌కు మారింది. అయితే అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రస్సెల్‌ ఆ ఓవర్‌లో 11 పరుగులే ఇవ్వడంతో ఓటమి ఖాయమైంది. 


రాణా-త్రిపాఠి కీలక భాగస్వామ్యం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌ నుంచే దూసుకెళ్లింది. ముఖ్యంగా ఓపెనర్‌ నితీశ్‌ రాణా కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడికి రాహుల్‌ త్రిపాఠి జత కలవడంతో పరుగుల వరద పారింది. అయితే ఓ దశలో 200 స్కోరు సునాయాసంగా కనిపించినా చివరి 5 ఓవర్లలో రైజర్స్‌ బౌలర్లు ఆధిపత్యం చూపారు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన రాణా క్రీజులో ఉన్నంత సేపు చెలరేగాడు. రషీద్‌ ఒక్కడే అతడి ధాటిని తట్టుకోగలిగాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 50 పరుగులు సాధించింది.


ఏడో ఓవర్‌లో గిల్‌ (15)ను రషీద్‌ బౌల్డ్‌ చేయడంతో రాణా-రాహుల్‌ త్రిపాఠి కలిసి మిగతా బౌలర్ల పనిబట్టారు. ఈ జోడీ ఆటతీరుతో ప్రతీ ఓవర్‌లో దాదాపుగా ఓ సిక్స్‌ రావడంతో రన్‌రేట్‌ పరుగులు పెట్టింది. రాణా ఓ అద్భుత సిక్సర్‌తో 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక 15వ ఓవర్‌లో భువీని రంగంలోకి దించగా త్రిపాఠి 6,4,4తో సమాధానమిస్తూ 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 16వ ఓవర్‌లో త్రిపాఠిని నటరాజన్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్‌లో రస్సెల్‌ (5)ను రషీద్‌.. 18వ ఓవర్‌లో వరుస బంతుల్లో రాణా, మోర్గాన్‌ (2)లను నబీ దెబ్బతీయడంతో స్కోరు నెమ్మదించింది. ఆఖరి ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌ (9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 నాటౌట్‌) 16 రన్స్‌ రాబట్టి కాస్త స్కోరు పెంచాడు. 


స్కోరుబోర్డు

కోల్‌కతా:

నితీశ్‌ రాణా (సి) విజయ్‌ శంకర్‌ (బి) నబీ 80; గిల్‌ (బి) రషీద్‌ 15; త్రిపాఠి (సి) సాహా (బి) నటరాజన్‌ 53; రస్సెల్‌ (సి) పాండే (బి) రషీద్‌ 5; మోర్గాన్‌ (సి) సమద్‌ (బి) నబీ 2; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 22; షకీబల్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 3; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 187/6; వికెట్ల పతనం: 1-53, 2-146, 3-157, 4-160, 5-160, 6-187; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-45-1; సందీప్‌ 3-0-35-0; నటరాజన్‌ 4-0-37-1; నబీ 4-0-32-2; రషీద్‌ 4-0-24-2; విజయ్‌ శంకర్‌ 1-0-14-0.


హైదరాబాద్‌:

సాహా (బి) షకీబల్‌ 7; వార్నర్‌ (సి) దినేష్‌ కార్తీక్‌ (బి) ప్రసిద్ధ్‌ 3; మనీష్‌ పాండే (నాటౌట్‌) 61; బెయిర్‌స్టో (సి) రాణా (బి) కమిన్స్‌ 55; నబీ (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌ 14; విజయ్‌ శంకర్‌ (సి) మోర్గాన్‌ (బి) రస్సెల్‌ 11; సమద్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 177/5; వికెట్ల పతనం: 1-10, 2-10, 3-102, 4-131, 5-150; బౌలింగ్‌: హర్భజన్‌ 1-0-8-0; ప్రసిద్ధ్‌ 4-0-35-2; షకీబల్‌ 4-0-34-1; కమిన్స్‌ 4-0-30-1; రస్సెల్‌ 3-0-32-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-36-0. 


Updated Date - 2021-04-12T09:55:41+05:30 IST