దిశ.. మారింది
ABN , First Publish Date - 2020-12-04T08:43:24+05:30 IST
దిశ బిల్లు-2019 కథ ముగిసింది. దిశ బిల్లును కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపించిన తర్వాత... ఏ మాత్రం జవం, జీవం లేని కొత్త బిల్లును
21 రోజుల్లో విచారణ, ఉరి వంటి కీలక నిబంధనలన్నీ తొలగింపు
జవం, జీవం లేని కొత్త దిశ బిల్లు
ప్రత్యేక కోర్టులతో సరిపెట్టిన వైనం
నిర్భయ, పోక్సో ప్రకారమే విచారణ
కేంద్ర చట్టాలకు లోబడే అమలు
జిల్లాకు ఒకటికి మించి కోర్టులు
స్పెషల్ పీపీల నియామకం
డీఎస్పీకి విచారణ బాధ్యతలు
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దిశ బిల్లు-2019 కథ ముగిసింది. దిశ బిల్లును కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపించిన తర్వాత... ఏ మాత్రం జవం, జీవం లేని కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. 21 రోజుల్లోనే విచారణ పూర్తి... మరణ శిక్ష వంటి కఠినమైన నిర్ణయాలను పక్కన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-శిక్షాస్మృతి-2019ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2020గా (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రత్యేక కోర్టులు) మార్చేశారు. పేరు ఒక్కటే కాదు.. బిల్లులోని అనేకానేక అంశాలు తొలగిపోయాయి. బిల్లు స్వరూపమే మారిపోయింది. దేశానికి మార్గనిర్దేశం చేస్తామన్న ఏ ఒక్క అంశమూ కొత్త బిల్లులో లేదు. మహిళలను ముట్టుకుంటే మరణ శిక్షే అంటూ సర్కారు చేసిన ప్రకటనలు, 21 రోజుల్లోనే శిక్షలు వేస్తామన్న హామీలు కొత్త బిల్లులో లేవు.
కేవలం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇందులో కొత్తేమీలేదు. ఎలాంటి కేసుల విచారణకయినా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. సర్కారు కూడా ఇప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొంది. దిశ అనే పేరును మాత్రం కొనసాగించారు.
మొదటి బిల్లులో అలా..
1) మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినవారిపై కేసు నమోదు చేసిన తొలివారంలో విచారణ పూర్తిచేయాలి. విచారణ 14 రోజుల్లో కోర్టుల్లోముగియాలి. 21 రోజుల్లో (పనిదినాలు) దోషులనుతేల్చి శిక్షణ ఖరారు చేయాలని క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ (సీపీసీ-1973)లోని సెక్షన్ 173, సెక్షన్ 309లను సవరించి అదనపు క్లాజులను చేర్చారు. 2) పోస్కో చట్టం-2012 ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడటం, వేధించేవారికి కనిష్ఠం మూడు సంవత్సరాలు, గరిష్ఠంగా ఏడేళ్లపాటు జైలు శిక్షలు ప్రతిపాదించారు. దిశ బిల్లులో జీవిత ఖైదును ప్రతిపాదించారు. ఇందుకు ఐపీసీ-1860లో354 ఎఫ్, 354 జి క్లాజులు చేర్చారు. 3) అత్యాచార కేసుల్లో అప్పీల్స్ సమయాన్ని మూడు నెలలకు కుదించారు. ఈమేరకు సీపీసీ-1973లో సెక్షన్ 374, సెక్షన్377లను సవరించారు. 4) కొన్ని కేసుల్లో మరణ శిక్ష ప్రతిపాదించారు. ఈమేరకు ఐపీసీలోని 376 సెక్షన్‌కు సవరణ చేశారు. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 5) సోషల్‌మీడియాలో మహిళలు, చిన్నారులపై అసభ్యకర పోస్టులు పెడితే శిక్షలు ఉంటాయి. మొదటిసారి తప్పునకు రెండేళ్లు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు ఐపీసీ (1860)లో 354 ఈ చేర్చారు.
మారింది ఇలా..
కొత్తగా తీసుకొచ్చిన బిల్లు పేరు ఆంధ్రప్రదేశ్ దిశ(మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు) చట్టం-2020. ఈ బిల్లు ప్రకారం.. 1) మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులపై ఇప్పటికే అమల్లో ఉన్న నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం, ఐపీసీ-1860, సీపీసీ-1973ల పరిధిలోనే కేసుల నమోదు, విచారణ జరుగుతుంది. వీటిని ప్రత్యేక నేరాలుగా పరిగణిస్తారు. 2) ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)-1860 లోని సెక్షన్ 326ఏ, 326బి, 354, 354ఏ, 354బి, 354సి, 354డి, 376, 376ఏ, 376-ఏబి, 376బి, 376సి, 376డి, 376డిఏ, 376డిబి, 376ఈ, 509లతోపాటు పోక్సో చట్టం, మహిళలు, చిన్నారులపై దాడులకు వ్యతిరేకంగా అమల్లో ఉన్న ఇతర కేంద్ర చట్టాల్లోని సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. 3) ఈ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. జిల్లాకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కోర్టులను ఏర్పాటు చేయవచ్చని బిల్లులో ప్రతిపాదించారు.
ప్రత్యేక కోర్టుల జడ్జిలను ప్రభుత్వమే సిఫారసు చేస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ -1973 కింద కోర్టులు ఆ కేసులను విచారిస్తాయి. 4) ప్రభుత్వం ఈ కోర్టులకోసం ఒక ప్రత్యేక పీపీని నియమించనుంది. కనీసం ఏడేళ్లపాటు ప్రాక్టీసులో ఉన్న వారిని పీపీగా నియమించాలని ప్రతిపాదించారు. 5) కేసుల విచారణకు పనికొచ్చేలా రాష్ట్రస్థాయిలో మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల సంఘటనలను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 6) ప్రత్యేక నేరాల కేసుల విచారణకు జిల్లా స్థాయిలో డీఎస్పీ ర్యాంకు స్థాయి అధికారి నేతృత్వాన ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారు.