నాన్న సినిమా తీస్తాడు! అమ్మాయి ఫొటోలు తీస్తుంది!!

ABN , First Publish Date - 2020-06-17T05:46:23+05:30 IST

డాన్‌ లాస్సెన్‌... హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌! ‘ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి ఆయనకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. కెమెరామెన్‌గా నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ‘సైలెంట్‌ హిల్‌’, ‘జాన్‌ విక్‌’ సిరీస్‌లో 2, 3 చిత్రాలు సహా పలు చిత్రాలకు పని చేశారు...

నాన్న సినిమా తీస్తాడు! అమ్మాయి ఫొటోలు తీస్తుంది!!

డాన్‌ లాస్సెన్‌... హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌! ‘ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి ఆయనకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది.  కెమెరామెన్‌గా నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ‘సైలెంట్‌ హిల్‌’, ‘జాన్‌ విక్‌’ సిరీస్‌లో 2, 3 చిత్రాలు సహా పలు చిత్రాలకు పని చేశారు. ఆయనకు  కేవలం నాలుగు అంటే నాలుగే ఫొటోలున్న ఓ తెలుగమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లోని ఓ ఫొటో నచ్చింది. లైక్‌  కూడా చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి పేరు హియా దాసరి. దర్శకుడు మారుతి కుమార్తె. 


వచ్చాను చూశాను బంధించాను ...ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను హియా దాసరి పరిచయం చేసుకున్నారిలా! ఫొటోగ్రఫీలోకి హియా ప్రవేశించి కొన్ని రోజులే అయినప్పటికీ... ఆమె చూసిన, కెమెరాలో బంధించిన దృశ్యాలు మాత్రం అద్భుతమని ప్రశంసలు పొందుతున్నాయి. ఆ మాటే హియా దాసరితో అంటే బోలెడన్ని విశేషాలు పంచుకుంది. 

‘‘కష్టపడి పని చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుందని చెబుతారు కదా! డాన్‌ లాస్సెన్‌గారి ప్రశంస, ఇతరుల అభినందనలు... ఇవన్నీ నా కష్టానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇదో గొప్ప అనుభూతి. నేను ఫొటోలు తీయడం ప్రారంభించినప్పుడు అనుకున్న విధంగా రాలేదు. ఎందుకు రావడం లేదని ఆలోచించా. ఫొటోగ్రఫీలో తొలి ప్రయత్నం ఎప్పుడూ విజయవంతం కాదనీ, ప్రాక్టీస్‌ చేసేకొద్దీ పర్‌ఫెక్ట్‌ అవుతామని తెలుసుకున్నా. రెండు మూడు నెలల క్రితం నేను తీసిన ఫొటోలు, ఇప్పుడు తీస్తున్న ఫొటోలు చూసుకుంటే.... తేడా తెలుస్తోంది. రోజు రోజుకీ మెరుగవుతున్నా.




బొమ్మలతో మొదలై... 

ముందు నుంచీ కళల పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. నేను బొమ్మలు గీస్తా. ఐ లవ్‌ పెయింటింగ్‌, స్కెచింగ్‌! మా నాన్నగారు 2డీ యానిమేషన్‌ ఎలా చేస్తారో, నేను ఆ విధంగా బొమ్మలు వేస్తా. పెయింటింగ్స్‌ వేస్తున్నప్పుడు కలర్స్‌, డిఫరెంట్‌ కాంట్రాస్ట్‌ కంపోజిషన్స్‌ వంటివి చూశాక... నెమ్మదిగా ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది.


ఫొటోగ్రఫీ వరకు... 

ఈ ఏడాది మొదట్లోనే ఫొటోగ్రఫీ స్టార్ట్‌ చేశా. ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ, ఆర్టికల్స్‌ చదువుతూ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకుంటున్నా. పీటర్‌ మెక్‌కిన్నన్స్‌ అని ప్రముఖ ఫొటోగ్రాఫర్‌. ఆయన యూట్యూబ్‌లో చెప్పే పాఠాలు వింటా. ఆయన టిప్స్‌ నాకు చాలా ఉపయోగపడ్డాయి.


నటన ఇష్టమే కానీ...

నాకు నటన అంటే ఆసక్తి ఉంది. నాన్న దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నటించా. అయితే, కెమెరా ముందు కన్నా కెమెరా వెనుక ఉండడానికే ఎక్కువ ఇష్టపడతా. (నవ్వుతూ...) ‘ప్రతిరోజూ పండగే’ సెట్స్‌లో నాన్న తన పనిలో బిజీగా ఉండేవారు. ఆయనను గమనిస్తూ ఉండేదాన్ని. ఒకవేళ ఇప్పుడు షూటింగులకు వెళ్లే 

అవకాశం వస్తే... నాన్న వెనుక కూర్చుని ఫొటోగ్రఫీ గురించి మరింత తెలుసుకుంటా. ‘ప్రతిరోజూ పండగే’లో నా నటన నాన్నకు నచ్చింది. మరో సినిమా చేద్దామన్నారు. కానీ, నాకు నటించాలని లేదు. భవిష్యత్తులో సినిమాటోగ్రఫీ వైపు వెళ్లాలని ఉంది.




నాన్నకు నచ్చిందదే!

బొమ్మ వేసేటప్పుడు... బొమ్మ పూర్తి చేశాక నాన్నకు చూపించేదాన్ని. ఇప్పుడు ఫొటోలు తీసి తర్వాత చూపిస్తున్నా అంతే. నేనెప్పుడూ నాన్న దగ్గర సలహాలు తీసుకోలేదు. నేను గీసిన, తీసిన బొమ్మల్లో తప్పులు ఉంటే తప్పకుండా చెబుతారు. మున్ముందు ఆ తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడతా. నేను లైటింగ్‌ చేసే విధానం నాన్నకు నచ్చుతుంది. ‘నీ లైట్‌ సెన్స్‌ బావుందిరా’ అని ప్రశంసించారు. ఫ్రేమింగ్‌ కూడా మెచ్చుకున్నారు. ‘దర్శకుడి కుమార్తె కదా! ఆ కళ వచ్చేసింది’ అని మా అమ్మ అంటుంటుంది. నేనేం చేసినా అమ్మకు నచ్చుతుంది. ఎంతో సపోర్ట్‌ చేస్తుంది.


క్లాస్‌లో ఉన్న ఫీలింగ్‌ రావడం లేదు!

ఇప్పుడు నేను హైదరాబాద్‌లోని కీస్టోన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నా. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుగుతున్నాయి. ఇదో కొత్త అనుభూతి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే, క్లాస్‌లో వింటున్న ఫీలింగ్‌, ఫ్రెండ్స్‌ను కలిసిన ఆనందం ఉండడం లేదు. స్నేహితులను, తరగతి గదిని ఎంతో మిస్‌ అవుతున్నా.’’


మా అమ్మాయి తీసిన ఫొటోలు చూసి నేనే ఆశ్చర్యపోతుంటా. తనకు కావలసినవి కొని ఇస్తుంటా కానీ... నేనేమీ సలహాలు, సూచనలు ఇవ్వను. ‘డాడీ! ఈ ఫొటో తీశా. ఈ బొమ్మ గీశా. చూడు’ అని తనే అంటుంది. నా అభిప్రాయం చెబుతా. తనకు ఇంత మంచి పేరు రావడం సంతోషంగా ఉంది.

- దర్శకుడు మారుతి



-సత్య పులగం





Updated Date - 2020-06-17T05:46:23+05:30 IST