ధైర్యంగా ఎదుర్కొందాం!

ABN , First Publish Date - 2020-03-22T05:34:26+05:30 IST

కంటికి కనిపించని సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఇంతవరకూ ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి ఇప్పుడు ఆ సూక్ష్మజీవితో పోరాడుతోంది.

ధైర్యంగా ఎదుర్కొందాం!

కంటికి కనిపించని సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఇంతవరకూ ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి  ఇప్పుడు ఆ సూక్ష్మజీవితో  పోరాడుతోంది. చైనాలో మొదలై కోరలు చాస్తూ ప్రపంచాన్నంతా ముట్టడిస్తున్న ఆ సూక్ష్మజీవి పేరు కరోనా. వైద్య పరిభాషలో కోవిడ్‌  - 19. జాతి, కులం, మతం, రాష్ట్రం, దేశం... సరిహద్దుల్ని చెరిపేసి.. అందరూ ఒక్కటై ఆ వైరస్‌పై పోరాటం చెయ్యాలంటున్న దర్శకుడు బోయపాటి శ్రీను మనోగతం ‘నవ్య’ పాఠకుల కోసం... 


పది రోజులుగా కరోనా గురించి మీడియాలో ఎంతగా ప్రచారం జరుగుతుందో... ప్రమాద స్థాయి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మీడియా ఇంతగా చెబుతుంది ఏంటి? అనుకున్నారు కానీ దీని తీవ్రత ఇలా ఉంటుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు మనిషికి శుభ్రత చాలా అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలూ పూనుకుంటేనే వైరస్‌ వ్యాపించకుండా చేయగలం. గతంలో కూడా చాలా రకాల వైరస్‌లు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. వైద్యులకు, వైద్య శాస్త్రవేత్తలకు అర్థం కాని వైరస్‌ ఇది. అప్రకటిత యుద్ధంలా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని దహించేస్తుంది. ఈ సమస్య ప్రపంచ యుద్ధం లాంటిదని ప్రధాని మోదీ  దేశమంతటా జనతా కర్య్ఫూ విధించాలని పిలుపునిచ్చారంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కోవడం మనకు అంత కష్టమైన పని కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాం. మనం చాలా ధైర్యవంతులం. హుదూద్‌ల్ని లెక్క జేయం. సునామీలను ఎదుర్కొంటాం. అలాగే మనం శుభ్రత పాటించినప్పుడు కరోనా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు. మన పక్కనున్న వాళ్లను ఎడ్యుకేట్‌ చేసి, ఈ వైరస్‌ స్ర్పెడ్‌ కాకుండా చూద్దాం. 


ఆ బాధ్యత ప్రతి ఒక్కరిదీ!

భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకే ఆదర్శం. మన ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తులు. ఎటువంటి ప్రమాదానికైనా సమాధానం అందులోనే ఉంది. పెద్ద వాళ్లు చెప్పిన మాట విని, క్రమశిక్షణతో ఆ నియమాలను పాటిస్తే కరోనానే కాదు ఏ వ్యాధిని అయినా జయించవచ్చు. ఒక వ్యక్తి, కుటుంబం, సమూహం, సమాజం ఈ నాలుగింటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. 


భూమాతకు కేటాయిద్దాం

కరోనా తీవ్రత ఊహించని స్థాయిలో పెరుగుతోంది కాబట్టే దేశ ప్రజల సంరక్షణ కోసం మోదీగారు మన ముందుకు వచ్చి ‘కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉంది. కాబట్టి దీన్ని ఎదుర్కొవాలంటే కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి పెద్ద కొడుకుగా భావించి నా మాట వినండి’ అని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. వారంలో ఒకరోజు మనం దేవుడికి కేటాయించినట్లే... ఈ ఆదివారం భూ మాత కోసం కేటాయిస్తే.. అసలు జరుగుతోంది? ఏం జరగబోతోంది అన్నది తెలుస్తుంది. వృత్తిరీత్యా ఒత్తిడి ఉన్నవాళ్లు సరదాగా కుటుంబ సభ్యులతో గడపండి. 


క్రియేటివిటీ పెరిగింది

ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పలు యాప్‌ల వల్ల క్రియేటివిటీ బాగా పెరిగింది. ఏ విషయాన్నైనా అతి తక్కువ సమయంలో జనాలకు చేరుతోంది ఆ క్రియేటివిటీని యాప్‌ల ద్వారా జనాలకు మంచి సందేశం ఇవ్వడానికి ఉపయోగించమని కోరుతున్నా. దీనివల్ల ఒక్కరికి మంచి జరిగినా మీరు విజయం సాధించినట్లే.




నియమాలు పక్కా...

నా స్టాఫ్‌ 8 మంది. ఆఫీస్‌లో అడుగుపెట్టడానికి ముందే చేతులు శుభ్రం చేసుకుని శానిటైజర్స్‌ ఉపయోగించి లోపలికి రావాలి. ఒక్కో రూమ్‌లో ఇద్దరిద్దరు మాత్రమే పని చేయాలి. రైటర్స్‌తో చర్చలు జరపాలన్నా ఎదురెదురుగా, పక్కపక్కన కాకుండా నాలుగు మూలల నలుగురు కూర్చొని చర్చలు జరుపుతున్నాం. చర్చల మధ్యలో బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని రావాలి. ఇంటి డోర్‌ హ్యాండిల్స్‌ నుంచి తలుపు గొళ్లెం వరకూ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాం. డ్రైవర్‌ నుంచి నా వరకూ ఒకేలా కేర్‌ తీసుకుంటున్నాం. వేడి నీళ్లే తాగుతున్నాం. 


కార్మికుల గురించి చర్చ...

సినీ పరిశ్రమలో రోజు కూలీకి పని చేసే కార్మికులు వేలమంది ఉన్నారు. వారం రోజులో, పది రోజులో పని లేకపోతే వాళ్లు తట్టుకోగలరు. ఇంకొన్ని రోజులు ఇదే కొనసాగితే వాళ్ల పరిస్థితి ఏంటన్న విషయంపై ఇండస్ట్రీ పెద్దలంతా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. సోమవారం తర్వాత దానిపై ఓ నిర్ణయానికొస్తారు. కార్మికులను ఆర్ధికంగా ఎలా ఆదుకోవాలా అని నిర్ణయిస్తారు.


బాలకృష్ణ స్పందించారు

బాలకృష్ణగారితో నేను తీస్తున్న సినిమా షెడ్యూల్‌ ఈ నెల పన్నెండోతేదీతో పూర్తయింది. అప్పటికి కరోనా ప్రభావం ఇంత లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాం. పదిహేనో తేదీ నుంచి కరోనా తీవ్రత బాగా పెరిగింది. బాలయ్యబాబుతో కూర్చొని పరిస్థితిని వివరిస్తే ఆయన ప్రజా ప్రతినిధిగా మానవత్వంతో స్పందించి ‘ఒక నెల ఆలస్యం అయినా పరవాలేదు. షూటింగ్‌ ఆపేద్దాం. జనం ఆరోగ్యం మనకు ముఖ్యం’ అన్నారు. ప్రభుత్వం 31వ తేదీ వరకూ షూటింగ్‌లకు బంద్‌ ప్రకటించినా మేం మాత్రం ఈ తీవ్రత తగ్గే వరకూ సెట్‌కి వెళ్లకూడదనుకున్నాం. జనం ఆనందంగా లేనప్పుడు మనం సినిమాను విడుదల చేయడం పద్ధతి కాదు కదా! వాళ్లు సినిమా చూసే మూడ్‌లో ఉన్నప్పుడే విడుదల చేయాలి. సినిమాల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని సినిమా పరిశ్రమ మొత్తం ఒకే మాట ఉంది. 


ప్రాణం పెట్టి పని చేస్తున్నా...

బాలకృష్ణగారితో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు చేసి నేను సాధించిన సక్సెస్‌ గురించి నాకు ఐడియా ఉంది. ఆయనతో చేస్తున్న మూడో సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్‌ కావడానికి ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఓ ప్రణాళికతో ప్రాణం పెట్టి పని చేస్తున్నా. వేరే వ్యాపకాలు లేకుండా పని మీదే శ్రద్ధ పెట్టి పని చేస్తాను కాబట్టి తప్పకుండా మరో సక్సెస్‌ సాధిస్తా. మా కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ఇందులో బాలయ్య రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారు. దానికోసం ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌ క్రియేట్‌ చేశా. పాత్రను ప్రేమించినప్పుడే హీరో అందులో లీనమై నటించగలడు. బాలయ్య ఆ పాత్రను ప్రేమించారు కనుకే అద్భుతంగా చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం ఆయన ఆకృతి మార్చాం. ఆ గెటప్‌తోనే ఇటీవల ఓ ఎమోషనల్‌ యాక్షన్‌ పార్ట్‌, రెండు సీన్లు షూటింగ్‌ చేశాం. ఇంకో ఐదారు సీన్లు చిత్రీకరించాలనుకున్నా కరోనా వైరస్‌ కారణంగా ఆపేశాం. వారణాసిలో షూటింగ్‌కి ఇంకా టైమ్‌ ఉంది. అక్కడ చిత్రీకరించే ఎపిసోడ్‌లో పాల్గొనే ఆర్టిస్టులు, గెటప్‌ల వివరాలు తర్వాత చెబుతాను. 


అలాంటి హీరోయిన్‌ కోసం చూస్తున్నాం

ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రను పోషించే మంచి నటి కోసం ఎదురుచూస్తున్నాం. బాలకృష్ణ పక్కన నటించడానికి సీనియర్‌ హీరోయిన్‌ కావాలని లేదు. ఫ్రెష్‌ లుక్‌ కలిగి, ఆ పాత్రకు న్యాయం చేసే నాయికను తీసుకుంటాం. హీరోయిన్‌ పాత్ర ఎంటర్‌ అవడానికి ఇంకా టైమ్‌ ఉంది. హీరోయిన్‌ లేకుండానే నెల రోజులు చేయాల్సిన వర్క్‌ ఉంది. కొంతమందిని సంప్రదించాం. కానీ ఫైనల్‌ చెయ్యాల్సి ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌   ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో ఓ బాలీవుడ్‌ నటుడు విలన్‌గా నటిస్తారు. శ్రీకాంత్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.


వినాయకరావు

Updated Date - 2020-03-22T05:34:26+05:30 IST