పేదలపై పగ

ABN , First Publish Date - 2021-12-01T08:15:41+05:30 IST

ఈ సర్కారు కొత్తగా ఒక్క ఇల్లూ కట్టలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. కానీ... ఎప్పుడో ఎన్టీఆర్‌ కాలం నుంచి బలహీన వర్గాలకు..

పేదలపై పగ

  • వలంటీర్లకు ఆదేశాలు
  • జిల్లాల్లో సర్క్యులర్లు జారీ
  • త్వరలో రేషన్‌పైనా కోత?
  • ఓటీఎస్‌కు ఒప్పుకోకుంటే పింఛను కట్‌
  • పాత ఇళ్లకు కొత్తగా వసూళ్లు
  • డ్వాక్రా సంఘాలపైనా ఒత్తిళ్లు
  • ‘ఆసరా’తో రుణాలివ్వాలని ఆదేశాలు
  • వలంటీర్లకు ప్రభుత్వం టార్గెట్లు
  • ‘రీచ్‌’ కాకపోతే ఇంటికే అని హెచ్చరికలు
  • ‘సంపూర్ణ గృహ హక్కు’తో చిక్కులు


సర్కారు పేదలపైనా పగపట్టింది. కాసుల కోసం పేదల గూటిపై దండయాత్ర చేస్తోంది. అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా ‘పైసా వసూల్‌’ చేస్తున్న ప్రభుత్వం...  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని హెచ్చరిస్తోంది. ‘డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా’ అంటూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో పేదలు తల్లడిల్లుతున్నారు. ఇదేమి ఘోరమని వాపోతున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఈ సర్కారు కొత్తగా ఒక్క ఇల్లూ కట్టలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. కానీ... ఎప్పుడో ఎన్టీఆర్‌ కాలం నుంచి బలహీన వర్గాలకు కేటాయించిన పేదల ఇళ్లపై ఈ ప్రభుత్వం దండయాత్ర చేస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోని ‘బకాయిల’ కోసం వేట ప్రారంభించింది. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ అని ముద్దుగా ఓ పేరు పెట్టి... వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రూ.10 వేల నుంచి 15 వేలు కట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఇప్పుడు... ఇది పరాకాష్ఠకు చేరింది.


ఓటీఎస్‌ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే కోత పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి  ఆదేశాలు జారీ చేసింది. ‘‘రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఓటీఎస్‌ చేసుకుంటేనే ఇక పెన్షన్‌ చెల్లించండి. పెన్షన్‌దారుల కుటుంబాలకు చెందిన వారెవరైనా గతంలో ప్రభుత్వ హౌసింగ్‌  పథకం ద్వారా గ్రామాల్లో  ఇల్లు నిర్మించుకుని ఉంటే... వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే అలాంటి వారికి డిసెంబరు పెన్షన్‌ ఇవ్వొద్దు’’ అని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లను ఆదేశించారు. అంతేకాదు... ఇవి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలని, వీటిని బేఖాతరు చేస్తే సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచి రాబడతామని కూడా స్పష్టం చేస్తున్నారు. 


ఏదీ వదలకుండా...

‘జగనన్న సంపూర్ణ గృహహక్కు విషయంలో మేం అనుకున్నది జరగాల్సిందే. లేదంటే... ఊరుకునేది లేదు’ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పింఛన్లను ఆపివేస్తున్న సర్కారు... త్వరలో రేషన్‌పైనా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల లబ్ధిదారుల రేషన్‌కార్డు నెంబర్లను సేకరించాలని వలంటీర్లను ఆదేశిస్తున్నారు. అంతేకాదు... వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారి వివరాలు కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అంటే... ఓటీఎ్‌సకు డబ్బులు కట్టకపోతే రేషన్‌ కట్‌ చేయడం, జీతాలు ఆపివేయడం వంటివి చేస్తారన్న మాట! ఓటీఎ్‌సపై వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఇచ్చిన టార్గెట్లు ఎలాగైనా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. 


డ్వాక్రా సంఘాలపైనా... 

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ డ్వాక్రా సంఘాలకూ శాపంగా మారింది. ‘మా దగ్గర డబ్బుల్లేవ్‌. అసలే కష్టాల్లో ఉన్నాం’ అని ఎవరైనా చెబితే... స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని ఓటీఎస్‌ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే.... వారికి రుణ సౌకర్యం కల్పించి ఓటీఎస్‌ పూర్తి చేయాలని ఆదేశాలిస్తున్నారు. మెప్మా సిబ్బందికి దీనిపై సూచనలు ఇచ్చారు. ప్రతి డివిజన్‌కు రోజుకు రూ.కోటి చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయాలని టార్గెట్లు పెట్టారు. సచివాలయ సిబ్బంది గొంతు మీద కత్తి వేలాడదీశారు. ఇటీవల ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాలకు డబ్బులు జమయ్యాయని, ఆయా లబ్ధిదారుల కుటుంబ సభ్యులెవరైనా ఆ గ్రూపుల్లో ఉంటే వారి నుంచి అప్పు తీసుకోవాలని సలహాలిస్తున్నారు. దీంతో డ్వాక్రా గ్రూపుల్లోని మిగతా సభ్యులను ఎలాగోలా ఒప్పించి లబ్ధిదారులకు రుణమందిస్తున్నారు. 


ఇళ్ల లబ్ధిదారుల మెడపై కత్తి...

జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా వారి ఇళ్లకున్న బకాయిలను మాఫీ చేసి... రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. అందుకోసం గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.10 వేలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ అమలులో ఉన్న ఇబ్బందులను పట్టించుకోవడంలేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారికే ఇది వర్తింప చేయాలని, గొంతుపై కత్తిపెట్టి అమలు చేయడం సబబు కాదనే విమర్శలు వస్తున్నాయి. ‘‘దీని కోసం డ్వాక్రా సంఘాల నుంచి రుణమిప్పించడమేంటి? మేం దాచుకున్న సొమ్ములపై సర్కారు పెత్తనం ఏమిటి? పొదుపు సొమ్ము ఖాళీ అయిపోతే... సంఘాలు నిర్వీర్యం అవుతాయి.’’ అని సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆసరా ద్వారా వచ్చిన డబ్బులను ఇతరులకు రుణంగా ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ‘ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇచ్చి తీరాల్సిందే’ అని సెర్ప్‌ సిబ్బంది డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో అక్కడక్కడ గ్రూపు సభ్యుల మధ్య విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. 


ఓటీఎస్‌కు దొరకని ఆదరణ...

ప్రభుత్వం ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు, వడ్డీ వ్యాపారస్తుల తరహాలో బెదిరిస్తుండటంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. ‘‘ఇది నిజంగా మాకు మేలు చేస్తే... ఇంతలా ఒత్తిడి చేయడమెందుకు?’’అని జనం అనుమానిస్తున్నారు. కొంతమం ది లబ్ధిదారులకు ఇల్లు మంజూరైనప్పటికీ వారికి పూర్తి స్థాయి లో రుణమందలేదు. 10 బస్తాల సిమెంట్‌ ఇచ్చి ఇల్లు పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్‌ అధికారులు రికార్డుల్లో రాసేశారు. లబ్ధిదారులు అప్పోసప్పోచేసి ఇళ్లను పూర్తి చేసుకున్నారు. అలాంటి ఇళ్లకు కూడా రూ.20 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి ఓటీఎస్‌ చేయించుకోవాలని ఒత్తిడి తేవడంపై మండిపడుతున్నారు. ‘మాకు ఓటీఎస్‌ వద్దు’ అని గుంటూరులో కొందరు మహిళలు సిబ్బందిపై తిరగబడ్డారు.


‘ఓటీఎస్‌’ ఒత్తిడితో ఆగిన గుండె!

సరుబుజ్జిలి/ఆమదాలవలస రూరల్‌, నవంబరు 30: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన అలూరి రాధ (52) అనే మహిళ గతంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి రుణం పొందారు. కొద్దిరోజుల కిందట ఆమెకు ఓటీఎస్‌ కింద రూ.10 వేలు కట్టాలని సచివాలయ ఉద్యోగులు నోటీసులు జారీచేశారు. కూలీనైన తాను అంత మొత్తంలో కట్టలేనని చెప్పినా వారు వినలేదు. ఇటీవల ఒత్తిడి పెంచడంతో ఆమె ఆందోళనతో అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతానికి గురికావడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె మంగళవారం మృతిచెందారు. కాగా, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ఈ పథకాన్ని అడ్డుకోవద్దని విపక్షానికి హితవు పలికారు.

Updated Date - 2021-12-01T08:15:41+05:30 IST