ధీమా ఇవ్వని బీమా

ABN , First Publish Date - 2022-08-20T06:39:19+05:30 IST

ధీమా ఇవ్వని బీమా

ధీమా ఇవ్వని బీమా

మహిళలకు నాలుగు పథకాల ఎత్తివేత

‘అభయహస్తం’ డబ్బుల కోసం ఎదురుచూపులు

ఊసే లేని ‘స్వావలంభన’ ప్రీమియం

అమ్‌ ఆద్మీ, జనశ్రీ బీమా యోజనలు రద్దు

మహిళా సంఘాల పట్ల ప్రభుత్వాల చిన్నచూపు

జిల్లాలో 1.59 లక్షల మంది మహిళా సభ్యులు


కేసముద్రం, ఆగస్టు 19 : మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని స్వశక్తితో జీవించగలిగే విధంగా రూపొందించిన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ధీమా ఇచ్చే బీమా పథకాలు కరువయ్యాయి. తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కల్పించే పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థాంతరంగా ఎత్తివేశాయి. మహబూబాబాద్‌ జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 16 మండల సమాఖ్యలు ఉండగా 676 గ్రామైక్య సంఘాలు, 14,970 స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. వీటిలో 1,59,499 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) పరిధిలోని ఈ మహిళా సంఘాలకు కొనసాగుతున్న ‘స్వావలంభన, అమ్‌ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమాయోజన, అభయహస్తం’ పథకాలను ఎత్తివేయడంతో మహిళలకు ఎలాంటి బీమా రక్షణ లేకుండా పోయింది. స్వావలంభన, అభయహస్తం పథకాల్లో తమ వాటాగా చెల్లించిన ప్రీమియం డబ్బులు ఏమయ్యాయనే  విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పథకాల్లో తాము చెల్లించిన డబ్బులు ఎవరు, ఎప్పుడు  ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో రాబోయే రోజుల్లో నూతనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి బీమా ఏవైనా పథకాలు ప్రకటిస్తే వాటిలో చేరేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు కొద్దినెలల క్రితం సిద్ధిపేట జిల్లాలో అభయహస్తం పథకం డబ్బులు మహిళలకు తిరిగి ఇచ్చినట్లు మహిళా సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


అభయహస్తం పథకం ఇదీ...

ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకంలో స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు మధ్యనున్న మహిళలు చేరారు. ప్రతి సభ్యురాలు సంవత్సరానికి రూ.365 చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.365లు కలిపి కార్పస్‌ నిధిగా జమ చేస్తుంది. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకారవేతనాలను అందిస్తారు. ఈ పథకంలో చేరిన 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.500 చొప్పున పింఛన్‌ అందిస్తారు. అంతేకాకుండా పథకంలో చేరిన వారు సాధారణ మృతికి రూ.30వేలు, ప్రమాదవశాత్తు మృతికి రూ.75వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500, శాశ్వత వైకల్యానికి రూ.75వేల బీమా పరిహారం అందిస్తారు. పింఛనుదారురాలు మృతి చెందిన అనంతరం కార్పస్‌ నిధిలో ఉన్న మొత్తాన్ని ఆమె నామినీకి అందజేస్తారు. ఈ పథకంలో జిల్లాలో 69,641 వేల మంది చేరారు. 


బంద్‌ అయిన మరో మూడు పథకాలివే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్వావలంభన పథకంలో మహిళలతోపాటు దినసరి కూలీలు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి రూ.వెయ్యి చొప్పన సభ్యురాలు చెల్లిస్తే అంతేమొత్తం కేంద్రం జమ చేస్తుంది. అభయహస్తం లాగానే 60 ఏళ్ల అనంతరం పింఛన్‌, సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాద మరణానికి రూ.75వేల పరిహారం అందిస్తారు. అమ్‌ ఆద్మీ బీమా యోజన పథకం మహిళలతోపాటు భూమిలేని వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకం కూలీలు రూ.15 ప్రీమియంతో ఇందులో చేరే వీలుంది. సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాద మరణానికి రూ.75వేల పరిహారం, ఏటా రూ.1200 ఉపకార వేతనం చెల్లిస్తారు. జిల్లాలో ఉన్న ఉపాధి హామీ కూలీలంతా ఈ పథకంలో సభ్యులుగానే పరిగణించవచ్చు. మహిళా సంఘాల గ్రూపుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన జనశ్రీ బీమా యోజన పథకంలో సభ్యురాలు, ఆమె భర్తకు బీమా రక్షణ ఉంటుంది. ఇందులో రూ.230 ప్రీమియం చెల్లించడం ద్వారా చేరే వీలుంది. ఇందులో సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాద మరణానికి రూ.75వేలు, రూ.1200 స్కాలర్‌షిప్పులు అందిస్తారు. 


రాష్ట్రం ఏర్పడ్డాక పథకాలు బంద్‌

మహిళా సంఘాలకు ఉద్దేశించిన పథకాలు 2014 అనంతరం దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంద్‌ అయ్యాయి. అభయహస్తం, స్వావలంభన పథకాల్లో ప్రీమియం చెల్లించిన మహిళలకు ఆ డబ్బులు ఏళ్లు గడుస్తున్నా అందడంలేదు. రేపు, మాపు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అభయహస్తంలో జిల్లాలో 2016, సెప్టెంబర్‌ నెల వరకే చెల్లింపులు చేశారు. జిల్లాలోని పింఛనుదారులు 3,533 మందికి నెలకు రూ.17.66 లక్షల పింఛన్లు ఇస్తున్నారు. సెప్టెంబర్‌, 2016 నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. అంతేకాకుండా సభ్యురాళ్ల పిల్లలకు 2014-15 వరకే స్కాలర్‌షిప్పులను అందించారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకం స్వావలంభన పథకం డబ్బులపై ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాము ఏడాదికి  రూ.వెయ్యి చొప్పున 4 నుంచి 6 ఏళ్లపాటు చెల్లించామని వాటిని ఊసే లేకుండా పోయాయని వాపోతున్నారు. ఆయా పథకాల్లో బకాయి డబ్బుల చెల్లింపులపై ఎలాంటి సమాచారం లేదని సంబంధింత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అభయహస్తం, స్వావలంభన పథకాల్లో బకాయిలు ఉన్న ప్రీమియం డబ్బులతో పాటు, స్కాలర్‌షిప్పులు, పింఛన్లను, బీమా పరిహారం డబ్బులు కూడా చెల్లించాలని మహిళా సంఘాల బాధ్యులు, పింఛనుదారులు కోరుతున్నారు. 


మహిళలపట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వాలు : అంబటి లక్ష్మి, ఎంపీటీసీ, అమినాపురం 

మహిళలకు అమలు చేస్తున్న బీమా పథకాలన్నీ రద్దు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. ప్రీమియంలు తీసుకొని, పథకాలను నిలిపివేయడమే మహిళల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయనడానికి నిదర్శనం. రద్దు చేసిన అభయహస్తం, స్వావలంభన పథకాల్లో బకాయిలను వెంటనే చెల్లించాలి. గతంలో ఉన్న బీమా పథకాలను మళ్లీ అమలు చేయాలి.

Updated Date - 2022-08-20T06:39:19+05:30 IST