ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారా!

ABN , First Publish Date - 2022-09-23T08:11:45+05:30 IST

ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారా!

ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారా!

తీసుకున్నది అనాగరిక చర్య

మళ్లీ చేతగాని సమర్థనలు

షర్మిల కూడా ఛీ కొట్టారు

పేరు మార్పుపై జాతీయ స్థాయి ఉద్యమం

వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై బాబు


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చే ముందు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చెబుతున్నారు. ఏం ఆలోచించారు? ఎవరితో మాట్లాడారు? అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకొన్నారా? మీ నాన్న ఆత్మతో మాట్లాడారా? కనీసం మంత్రులతో కూడా చర్చించకుండా ఫోన్లలో ఆఘమేఘాలపై ఆమోదం తీసుకొని ఈ చీకటి చట్టం తెచ్చారు. అనాగరిక పనికిమాలిన చర్య తీసుకొంది కాక మళ్లీ చేతగాని సమర్థనలు’’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడ రాజ్‌భవన్‌లో తమ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌కు, వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పోలిక తెచ్చి ఎన్టీఆర్‌ బదులు వైఎ్‌సఆర్‌ పేరు పెట్టానని సీఎం మాట్లాడటం సిగ్గుచేటు. ఎన్టీఆర్‌కు, వైఎ్‌సఆర్‌కు మధ్య పోలిక ఉందా? ఎన్టీఆర్‌ ఒక మహోన్నత వ్యక్తి. తెలుగువారు ప్రతివారూ ఆయనను ఆరాధిస్తారు. ఎన్టీఆర్‌ వందేళ్ల జయంతి కార్యక్రమాలు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకొన్నారు తప్ప వైఎ్‌సఆర్‌ని కాదు. అదీ ఎన్టీఆర్‌ స్థాయి. మీకు వైఎ్‌సఆర్‌ పేరు పెట్టాలని ఉంటే కొత్తగా పెట్టే కాలేజికి పెట్టండి. లేదా కొత్త యూనివర్సిటీ తెచ్చి దానికి పెట్టుకోండి. అది చేతగాక ఉన్నవి మార్చడం ఏమిటి? మీ నిర్ణయాన్ని మీ చెల్లెలు షర్మిల కూడా ఛీ కొట్టింది. ఎన్టీఆర్‌ పేరు తీసివేసి తన తండ్రి పేరు పెట్టడం సరికాదని, కొత్తవాటికి పెట్టవచ్చని ఆమె చెప్పారు. ఆ మాత్రం ఇంగితం ఈ ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. రాజకీయాల్లో స్పర్థలు ఉంటాయిగాని వ్యక్తిగత వైషమ్యాలు ఉండవు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో మేం హోరాహోరీగా పోరాడినా వారికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చాం. కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు పేర్లతో పార్కులు, కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరుతో స్టేడియం, మర్రి చెన్నారెడ్డి పేరుతో మానవ వనరుల సంస్థ పెట్టాం. తప్పుడు విధానాలతో మీ ప్రతిష్ఠ పెరగదు. ఇంకా దిగజారుతుంది’’ అని వ్యాఖ్యానించారు. 


సీఎం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

చట్ట సభల్లోకి ప్రవేశించే ప్రతి సభ్యుడు ప్రమాణ స్వీకారం చేసి అడుగు పెడతారని, ఆ సభలకు ఉన్న గౌరవాన్ని కూడా దిగజారుస్తూ ఆ వేదికలపైనే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘టీడీపీ ప్రభుత్వాలు ఒక్క వైద్య కళాశాల కూడా పెట్టలేదని, వైద్య రంగానికి ఏమీ చేయలేదని ఆయన పచ్చి అబద్ధాలు సభలో చెప్పారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు 32 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 18 కళాశాలలు టీడీపీ హయాంలో పెట్టినవే. ఇందులో ఐదు ప్రభుత్వ కళాశాలలు, 13 ప్రైవేటు కళాశాలలు. ఈయన వచ్చిన తర్వాత ప్రతిపాదనలు పంపిన వాటిలో కేవలం మూడు వైద్య కళాశాలలకు మాత్రం అనుమతులు వచ్చాయి. వాటిని కూడా ఇంతవరకూ కట్టలేదు. కడతారని నమ్మకం కూడా లేదు. మా హయాంలో మేం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌ ఆస్పత్రి, దానికి అనుబంధంగా మెడికల్‌ కళాశాల తెచ్చాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య వ్యవస్థ అభివృద్ధికి 23 రకాల కార్యక్రమాలు చేపట్టాం’’ అంటూ వాటిని వివరించారు. ఇప్పుడు ఆస్పత్రుల్లో భోజనాలు లేవు, మందులు లేవని ఆరోపించారు. ‘‘నేను మొదటిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైద్య కళాశాలలు బాగా తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎంసీఐ చైర్మన్‌గా ఉన్న కేతన్‌ దేశాయితో మాట్లాడి ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల విధానాన్ని రూపొందించి అనేక కళాశాలలు తెచ్చాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రైవేటు రంగంలో ఉండేది. ఎన్టీఆర్‌ వాళ్లతో మాట్లాడి దానిని ప్రభుత్వ రంగంలోకి తీసుకొన్నారు. వైద్య విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి దేశంలో మొదటిసారి వైద్య విశ్వ విద్యాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు’’ అని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెబుతున్న వ్యక్తికి ఆ సభలో ఉండే అర్హత లేదని అన్నారు. పేరు మార్పుపై అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును తిరస్కరించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. దీనిపై జాతీయ స్థాయి ఉద్యమం చేస్తామని, ఎంసీఐ, యూజీసీ సంస్థలకు  ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పేరు మార్పు వల్ల ఈ విశ్వ విద్యాలయానికి ఇంతకాలం వచ్చిన బ్రాండ్‌ ఇమేజి పోతుందని, ఆ మాత్రం ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2022-09-23T08:11:45+05:30 IST