కావాలనే వెళ్లలేదు.. అయితే ఏంటి?

ABN , First Publish Date - 2022-02-09T07:16:23+05:30 IST

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌

కావాలనే వెళ్లలేదు.. అయితే ఏంటి?

  • ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే తప్పేంది?
  • ఏడున్నరేళ్లుగా తెలంగాణకు ఏం చేశారు?: తలసాని

 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ హాజరవకపోవడంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ‘ప్రధాని పర్యటనలో సీఎం కావాలనే పాల్గొనలేదు.. అయితే ఏంటి?’ అన్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఏడున్నరేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నరు. మన రైతుల నుంచి ధాన్యం కొనలేదు. సింగరేణినీ అమ్ముతమంటున్నరు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే తప్పేముంది?’’ అని మంత్రి  వ్యాఖ్యనించారు.


మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయకముందే ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపేశారని, వారి ఇష్టం ఉన్నట్లు వారు చేస్తున్నప్పుడు.. తమ పద్ధతులు తమకు ఉంటాయన్నారు. విభజన జరిగిన తీరు బాగాలేదంటూ పార్లమెంటులో మాట్లాడిన మోదీ.. ఏపీ, తెలంగాణలకు ఈ ఏడేళ్లలో చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘కేంద్రంలో అధికారం బీజేపీ చేతిలోనే ఉంది కదా? ప్రత్యేక హోదా ఇస్తవా.. ప్యాకేజీ ఇస్తవా.. ఏం ఇస్తావో ఇవ్వు? రాజ్యాంగ ప్రకారం విభజన జరిగింది. ఆ విభజన చట్టంలో ఏమున్నయో చేయాలి కదా?’’ అని అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతరు. కానీ హైదరాబాద్‌లో ఎకరం భూమి అమ్ముతమంటే ఈ కుక్కలన్నీ భౌభౌ అంటయి. ఈ కుక్కలు ఎయిరిండియా, ఎల్‌ఐసీలు అమ్మితే.. విశాఖ ఉక్కును.. సింగరేణిని అమ్ముతమంటే ఎక్కడికి పోయినయి?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


అంబేడ్కర్‌ను ఇష్టానుసారం తిట్టిన అరుణ్‌శౌరీని కేంద్ర మంత్రిని చేసిన బీజేపీ వాళ్లు.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారని విమర్శించారు. కాగా.. మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి మోదీ వ్యాఖ్యలపై వేర్వేరు ప్రకటనలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Updated Date - 2022-02-09T07:16:23+05:30 IST