గ్రామీణ వైద్య నిఘంటువు

ABN , First Publish Date - 2021-05-13T11:31:38+05:30 IST

ఉదయం 9 గంటలు. అందరి కళ్ళూ ఆ వేపే చూస్తున్నాయి. ఉపశమనం కోసం నిరీక్షిస్తున్నాయి. అద్భుత స్పర్శ కోసం అపేక్షిస్తున్నాయి...

గ్రామీణ వైద్య నిఘంటువు

ఉదయం 9 గంటలు. అందరి కళ్ళూ ఆ వేపే చూస్తున్నాయి. ఉపశమనం కోసం నిరీక్షిస్తున్నాయి. అద్భుత స్పర్శ కోసం అపేక్షిస్తున్నాయి. చల్లని చూపును కోరుకుంటున్నాయి. ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారిన ప్రాణం ఒకే ఒక ధైర్యవచనం కోసం ఎదురుచూస్తున్నాయి. ఖచ్చితంగా తొమ్మిది కాగానే నడచివస్తున్న ‘అపర ధన్వంతరి’ని చూసి అందరూ లేచి నిలబడ్డారు. ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కొక్కర్నీ లోపలికి పిలిచి, ఒంట్లో బాధను శ్రద్ధగా ఆలకించి, బిళ్ళలో, గొట్టాలో, టానిక్కులో, సూదిమందో ఇచ్చి ‘ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది’ అనే ధైర్యవచనంతో బయటకు పంపే డాక్టర్‌ కొడాలి పాపారావు రోగుల పాలిట దేవుడు. పేదల ప్రాణదాత. మొండిజబ్బులు నయం చేసే అనుభవశీలి. రోజుకు పది, పన్నెండు ఆపరేషన్లు చేసే శస్త్రచికిత్స నిపుణులు. పాపారావు చదివింది నాలుగక్షరాలు ఎంబిబియస్సే. కాని 66 సంవత్సరాలకు పైగా గ్రామీణ ప్రజలకు అవిశ్రాంత వైద్యసేవలందించిన మహోన్నత వైద్యులు. ఏ పద్మశ్రీలు ఆయన సేవల్ని కొలవలేవు.


గుంటూరు జిల్లాలోని ఒకప్పటి కుగ్రామం, నేడు మండల కేంద్రమైన చెరుకుపల్లి డాక్టరు గారి కార్యక్షేత్రం. మిలటరీలో కొంతకాలం వైద్యుడిగా పని చేసి, 1955లో తండ్రి పేర కెఎస్‌ హరి నర్సింగ్‌హోమ్‌ను ప్రారంభించారు. బాల్యం నుంచి అలవడిన క్రమశిక్షణ, స్వయంకృషి రెండు కళ్ళుగా అడుగులు వేశారు. రోగులు ఎవరైనా రావచ్చు. వైద్యం చేయించుకోవచ్చు. నిర్ణీత ఫీజు లేదు. జబ్బు నయమయ్యాక మనఃస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా తీసుకునేవారు. అంతే! సంఖ్య పదులు, వందలు, వేలు, లక్షలు దాటిపోయింది. ఆయన ఆసుపత్రి రోగులను సేదతీర్చే విశ్రాంతి మందిరమయింది. కొడాలి పాపారావు చెరుకుపల్లి డాక్టరుగా మారిపోయారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లోని దాదాపు వందకు పైగా గ్రామాల నుంచి పేషెంట్లు వచ్చేవారు. డాక్టరు గారి అమృతహస్తం తాకగానే ఎటువంటి రోగాలైనా నయమయ్యేవి. పాపారావు చూసి ‘లాభం లేదయ్యా!’ అంటే పేరుమోసిన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లు సైతం చేతులెత్తేయాల్సిందే!


ప్రసవం నుంచి ఫ్యామిలీప్లానింగ్‌ ఆపరేషన్ల వరకు, పొట్టలో కణుతుల నుంచి గుండె వైద్యం వరకు, కాలినొప్పి నుంచి కంటి వైద్యం వరకు అన్నీ తానై చేసే పాపారావు అంటే పేషెంట్లకు ప్రత్యక్షదైవం. యాంటిబయాటిక్స్‌ లేని రోజుల్లో రోగనిర్ధారణ చేసి పెట్రోమాక్స్‌ లైటు వెలుతురులో ఆపరేషన్లు చేసే సర్జన్‌ పాపారావు. ఒక్క మాటలో చెప్పాలంటే పెషెంట్ల కళ్ళల్లో ఆనందం, బంధువుల గుండెల్లో తృప్తి ఆయనకు తరగని ఆస్తి. పాపారావు పేషెంట్లను ప్రేమించినట్లే పంటపొలాల్ని చూసి పులకించేవారు. స్వయంగా సేద్యం చేయించేవారు. తమ పెద్దరికంతో బంధువులందరికీ మార్గదర్శిగా ఉండేవారు. అర్ధాంగి రాజారత్నం సహకారంతో బిడ్డల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదో డాక్టర్ల కుటుంబం.


ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకి. వారి ఆలోచనలన్నీ శాస్త్రీయంగా ఉంటాయి. హేతువాదాన్ని అభిమానించేవారు. విందులు, వేడుకలకు ధనవ్యయం చేసేకంటే పేదలను ఆదుకుంటే మంచిదనేవారు. వారి పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో కారుణ్యం, గుండెల్లో మానవత్వం నిత్యం తొణికిసలాడుతుంటాయి. ‘‘పోరా! నీ మొహం. ఈ 150తో మందులు, కాయలు కొనుక్కుని తిను’’, ‘‘ఫీజా! నువ్వేమి ఇస్తావులేరా! వద్దులే’’ ఇలాంటి భరోసా మాటలతో డాక్టర్‌ గారి ఆసుపత్రి 365 రోజులు ప్రతిధ్వనించేది. 96 సంవత్సరాల నిండు జీవితంలో 66 సంవత్సరాలు వైద్యవృత్తికే అంకితమైన డాక్టర్‌ కొడాలి పాపారావు గ్రామీణ వైద్యశిఖామణి. భావితరాల వైద్యులకు ఓ నిఘంటువు. ఆయన జీవితం ఓ రోల్‌ మోడల్‌. ఎందరెందరో డాక్టర్లకు ఆయన స్ఫూర్తిప్రదాత.


ఏ చల్లని చూపు ఇంతకాలం పేషెంట్లకు ధైర్యాన్నిచ్చిందో, ఏ తీయని పలకరింపు రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందో, ఏ హస్త స్పర్శ వేలాదిమందికి ప్రాణదానం చేసిందో, ఆ చూపు, ఆ పలకరింపు ఆ స్పర్శ దీపంగా అందరి గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది.

డా. బీరం సుందరరావు

Updated Date - 2021-05-13T11:31:38+05:30 IST