దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2022-08-04T05:35:11+05:30 IST

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన
ఎన్టీఆర్‌ నగర్‌లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

నగరంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

ముంపు ప్రాంతాల్లో మేయర్‌ పర్యటన

పునరావాస కేంద్రాలకు వరద బాధితుల తరలింపు 


వరంగల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 3: వరంగల్‌ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవా రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 3 గంటల పాటు ఏకధాటిగా ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు రాత్రంతా  కంటి మీద కునుకు లేకుండా జాగరణ చేశారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.  పలుచోట్ల ప్రధాన రహదారుల మీదుగా వరదనీరు ప్రవహించ డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో 140మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యా ప్తంగా 411.8మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వరం గల్‌ నగరంలోని 28, 32 డివిజన్లలో  మేయర్‌ గుండు సుధారాణి పర్యటించారు. హంటర్‌రోడ్డు, సంతోషిమాత కాలనీ, భద్రకాళి బండ్‌, బొందివాగు, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, ఎస్‌ఆర్‌నగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, పలు కాలనీలలో భారీ వర్షానికి నీరు చేరుకుంది. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించా రు. పోతన రోడ్డులోని పెద్ద కాల్వకు మూడు చోట్ల నీరు వెళ్లేందుకు గండ్లు కొట్టారు. హంటర్‌రోడ్డులోని జంక్షన్‌ నుంచి సంతోషి మాత గుడి వరకు ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరింది. చిన్న బ్రిడ్జి సగం వరకు నీరు ప్రవహించింది.  


411.8 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 411.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గీసుగొండ 32.2, దుగ్గొండి 50.2, నల్లబెల్లి 58, నర్సంపేట 11.6, ఖానాపూర్‌ 23.6, చెన్నారావుపేట 2.4, సంగెం 7.8, వర్ధన్నపేట 23.8, రాయపర్తి 41.8, పర్వతగిరి 8.6, నెక్కొండ 11, వరంగల్‌ నగరం 140.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా సగటున 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


లోతట్టు ప్రాంతాలు జలమయం 

వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ కాశిబుగ్గ, వివేకానందకాలనీ, పద్మనగర్‌, శాంతినగర్‌, వీవర్స్‌కాలనీ, ఎంహెచ్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, గాంధీనగర్‌, సాయి గణేష్‌కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురాగనర్‌, సుందరయ్యనగర్‌, వాజ్‌పాయ్‌నగర్‌ తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. లేబర్‌కాలనీ-దేశాయిపేట వంద ఫీట్ల రోడ్డుపై నుంచి ఉధృతంగా వరదనీరు ప్రవహించింది. 14, 19వ డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఓని స్వర్ణలత భాస్కర్‌, తూర్పాటి సులోచన సారయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు వరద బాధితులను పరామర్శించారు. వారికి భోజనం అందించారు. ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌ అరూరి రమేష్‌, మేయర్‌ సుధారాణి, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరారు.  


పునరావాస కేంద్రాలకు తరలింపు

మట్టెవాడ: నగరంలో కురిసిన భారీ వర్షానికి హంటర్‌రోడ్డులోని ఎన్టీఆర్‌నగర్‌, బృందావన్‌కాలనీ, సంతోష్‌మాత కాలనీ, సాయినగర్‌, మైసయ్యనగర్‌, బీఆర్‌నగర్‌ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలను వరంగల్‌ మహేశ్వ రిగార్డెన్‌, వెంకటేశ్వరస్వామి గుడి కమ్యూనిటీ హాల్‌లకు తరలించి భోజనాలు అందించారు. 


ముంపు సమస్య పరిష్కారానికి కృషి

లోతట్టు ప్రాంతాలను ఉదయం మేయర్‌ గుండు సుధారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరద నీరు నిలవకుండా ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. బొందివాగు నాలాతో ముంపునకు గురవుతున్న కాలనీలకు శాశ్వత పరిష్కారం కోసం ఇరిగేషన్‌ అధికారుల సహకారంతో సమగ్ర ప్రణాళి కలను రూపొందించా మన్నారు. రూ.170కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్‌ ముగిసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బల్దియా అధికా రులు జ్ఞానేశ్వర్‌, శ్రీనివాస్‌, రవికిరణ్‌, శానిటరీ సూప ర్‌వైజర్‌ సాంబయ్య, సంపత్‌రెడ్డి, ఏఈ హాబీబ్‌ ఉన్నారు.


వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలో.. 

ఖిలావరంగల్‌ : వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలోని ఖిలా వరంగల్‌, శివనగర్‌, పెరకవాడ, అండర్‌బ్రిడ్జి, ఏసీరెడ్డినగర్‌, మైసయ్యనగర్‌, భూపేష్‌నగర్‌, చింతల్‌, ఆర్‌ఎస్‌నగర్‌, చంద్రవందనకాలనీ, జ్యోతిబసు నగర్‌, శాలినీనగర్‌, చెన్నారెడ్డికాలనీలు నీటి మునిగాయి. ఖిలావరంగల్‌ మాల అగర్తల చెరువు మత్తడి పోసింది. ఖిలావరంగల్‌ చెరువు నుంచి శివనగర్‌ మీదుగా అండర్‌బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలను జీడబ్ల్యూంఎసీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18, 35వ డివిజన్‌ కార్పొరేటర్లు వస్కుల బాబు, సోమిశెట్టి ప్రవీణ్‌లు పలువురికి భోజనాలు ఏర్పాటు చేశారు. 






Updated Date - 2022-08-04T05:35:11+05:30 IST