పోలీసులు కొట్టరు

ABN , First Publish Date - 2020-04-10T07:52:24+05:30 IST

‘వర్గ వైషమ్యాలు, ప్రాంతాల మధ్య గొడవలు, శాంతి భద్రతల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో పోలీసులకు తెలుసు. కానీ స్వతంత్ర భారతావని చరిత్రలో కని, విని, ఎరుగని పరిస్థితులు ...

పోలీసులు కొట్టరు

  • హద్దు మీరితే కేసులు నమోదు చేస్తాం
  • సోషల్‌ మీడియాపై టెక్నాలజీ ద్వారా నిఘా
  • లాక్‌డౌన్‌ పొడిగిస్తే.. మన ప్రాణాల కోసమే 
  • ‘ఆంధ్రజ్యోతి’తో డీజీపీ ముఖాముఖి 
  •  

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘వర్గ వైషమ్యాలు, ప్రాంతాల మధ్య గొడవలు, శాంతి భద్రతల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో పోలీసులకు తెలుసు. కానీ స్వతంత్ర భారతావని చరిత్రలో కని, విని, ఎరుగని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి విపత్తును అందరం కలిసి ఓడించాలి. పోలీసులు, వైద్యులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉంటూ కొవిడ్‌పై విజయం సాధించాలి’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, ప్రజల రక్షణలో పోలీసులు వంటి పలు అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


ఇలాంటి సవాలును ఎదుర్కోవడంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? 

రోడ్డుపైకి వచ్చేవారంతా లా అండ్‌ ఆర్డర్‌ సమస్య సృష్టించడానికే రావడం లేదు. కొందరు ఆకతాయితనంతో వస్తుంటే మరికొందరు మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం వస్తున్నారు. వారిని పోలీసులు డీల్‌ చేసే విధానం మారాలి. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా ఇప్పుడు సర్దుకుంది. 


పోలీసు బాస్‌గా ఇబ్బంది పడిన సందర్భం..?

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనవారిని సరిహద్దుల్లోనే ఆపేయడం బాధ అనిపించింది. వారిని తరిమివేయలేం. అలాగని రప్పించలేం. ఆ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపా. 


అమాయకులను కొట్టారంటూ పోలీసులపై వ్యతిరేకత రావడంపై ఏమంటారు? 

బయటికి రావొద్దని పదేపదే చెబుతున్నా కొందరు అనవసరంగా వస్తుంటారు. వారిని దండించే క్రమంలో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ప్రకాశం జిల్లాలో రైతుపై పోలీసులు లాఠీ ఎత్తితే ఎస్పీ సారీ చెప్పారు. మానవీయ కోణంలోనే మేమున్నాం. ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలి. అమాయకులకు అర్థమయ్యేలా వివరించాలి. ఇలాంటి సవాళ్లు మా పోలీసులకు కూడా మొదటిసారి. . 


సీఎం కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు కదా? 

ముఖ్యమంత్రికి ప్రజలే దేవుళ్లు. వారిపై దెబ్బ పడితే కచ్చితంగా స్పందిస్తారు. అందుకే ఫోర్స్‌ మెంటాలిటీ వదిలేసి సర్వీస్‌ వైపు రమ్మని ఆదేశించాం. ఇకపై ఎవ్వరినీ కొట్టబోం. కేసులు నమోదు చేసి, బండి సీజ్‌ చేస్తాం. 


సోషల్‌ మీడియాతో వస్తున్న ఇబ్బందులేంటి? 

ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ల ఊహకు ఏది తోస్తే దాన్ని వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 8 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 48 సైబర్‌ కేసులు నమోదు చేశాం. సోషల్‌ మీడియాపై టెక్నాలజీ ద్వారా నిఘా పెట్టాం.  


లాక్‌డౌన్‌లో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతోంది?

కరోనా తీవ్రత మొదలయ్యాక వివిధ దేశాల నుంచి 22వేల మంది ఆంధ్రులు దేశంలోకి అడుగుపెట్టారు. వారందరి మొబైల్‌ నంబర్లను ఒక యాప్‌లోకి తీసుకున్నాం. ఏపీలో 21వేల మందికి గాను 11 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారితో సంబంధాలున్న మరో పదిమందికి వైరస్‌ సోకింది. మిగతా వెయ్యిమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అందరినీ 14రోజులు హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచాం. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి నంబర్లు కూడా తీసుకున్నాం. వారు ఏ సెల్‌ టవర్‌ పరిధిలో ఉన్నారో తెలుసుకున్నాం. వారితో ఎక్కువ రోజులు గడిపినవారిని కూడా టెక్నాలజీ ద్వారా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచాం. 


గ్రామ సరిహద్దుల్లో కంచెలతో గొడవల గురించి ఏమంటారు? 

గ్రామాల సరిహద్దుల్లో భయంతో కంచెలు వేశారు. నెల్లూరు, అనంతపురం అనుభవాలతో గ్రామ పెద్దల వద్దకు పోలీసులు వెళ్లి వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యలు లేవు.


అనంతలో వైద్యులు వైరస్‌ బారిన పడ్డారు. పోలీసుల పరిస్థితి ఏమిటి? 

అదృష్టవశాత్తూ పోలీసులకు ఎవ్వరికీ కరోనా సోకలేదు. మేం చెప్పిన దానికన్నా మావాళ్లు ఎక్కువగా చేస్తున్నారు. తల్లి చనిపోయినా ఒక ఎస్‌ఐ డ్యూటీ వదిలి వెళ్లలేదు. చాలామంది పోలీసులు నెల జీతం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చారు. 


ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? 

పోలీసులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే మాకే కదా పూర్తి జీతం వచ్చింది. అంతెందుకు డీఏ కూడా విడుదల అయింది. 


లాక్‌డౌన్‌ పొడిగింపునకు ఎలా సన్నద్ధవుతున్నారు? 

వెనుకడుగు వేయబోం. ప్రజలు ఒకచోట గుమికూడే పరిస్థితి రాకుండా చూస్తాం.. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఇంట్లో ఉండి మాకు సహకరిస్తే చాలు. ఒక ఆకతాయిని ఉపేక్షిస్తే ఆ ప్రాంతమంతా ఇబ్బంది పడుతుంది. తర్వాత జిల్లా, రాష్ట్రం, మొత్తం దేశానికే ప్రమాదం. ప్రజల కోసం పోలీసు, వైద్యులతో పాటు పదకొండు శాఖలు పనిచేస్తున్నాయి. ఏ అత్యవసరాలున్నా ఫోను చేయవచ్చు. 


Updated Date - 2020-04-10T07:52:24+05:30 IST