సీఐడీ నుంచి దేవినేని ఉమకు వరుస ఫోన్లు

ABN , First Publish Date - 2022-07-15T23:53:56+05:30 IST

టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni Uma)కు సీఐడీ నుంచి వరుస ఫోన్లు వస్తున్నాయి. ఫేక్‌ ట్వీట్ల విషయంలో ఫిర్యాదుపై దేవినేని ఉమా స్టేట్‌మెంట్ రికార్డ్‌ కోసం సీఐడీ

సీఐడీ నుంచి దేవినేని ఉమకు వరుస ఫోన్లు

అమరావతి: టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni Uma)కు సీఐడీ నుంచి వరుస ఫోన్లు వస్తున్నాయి. ఫేక్‌ ట్వీట్ల విషయంలో ఫిర్యాదుపై దేవినేని స్టేట్‌మెంట్ రికార్డ్‌ కోసం సీఐడీ (CID) ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఫోన్లు చేస్తుండడంపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu)ను కాకుండా.. తన వెంట పడడమేంటంటూ ఫోన్లో ఉమ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ (CM Jagan)ను, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తున్నానని సీఐడీ ఛీఫ్‌కు తనపై ప్రేమ వచ్చిందా..? అని సీఐడీ పోలీసులను ఉమ ప్రశ్నించారు. దోషులను పట్టుకోకుండా.. సీఐడీ ఛీఫ్‌కు తనపై కోపమెందుకు వచ్చిందంటూ మండిపడ్డారు. సజ్జలను ప్రశ్నించినందుకా..? లేక లండన్ మందుల గురించి లేవనెత్తినందుకా..? అని ప్రశ్నించారు. తాను ఫిర్యాదు చేస్తే.. ఇంకా స్టేట్‌మెంట్ ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగని పట్టుకోకుండా తన వెంట పడతారేంటంటూ అంబటిని ఉద్దేశిస్తూ సీఐడీ పోలీసులను ప్రశ్నించారు. తానేం భయపడనని రాజమండ్రి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నానని దేవినేని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఐడీ తన ఫిర్యాదుపై అంబటిని అరెస్ట్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.


తన పేరుతో నకిలీ ట్వీట్‌ సృష్టించి ప్రచారంలో పెట్టడంపై దేవినేని మండిపడిన విషయం తెలిసిందే. ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్‌ చేసినట్లు ఒక నకిలీ ట్వీట్‌ తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో పెట్టారని తెలిపారు. ఇటువంటి నకిలీ ప్రచారాలు మానుకోవాలని వైసీపీని హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశారు. నకిలీ ట్వీట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటిపై సీఐడీ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-07-15T23:53:56+05:30 IST