ప్రగతి పథంలో పరుగులు

ABN , First Publish Date - 2022-08-16T05:42:53+05:30 IST

హనుమకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. హనుమకొండలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వినయ్‌ భాస్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రగతి పథంలో పరుగులు

అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి
నేటి నుంచి 57  ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌లు
కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు
ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
హనుమకొండ జిల్లాలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు


ఓరుగల్లు , ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
హనుమకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. హనుమకొండలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ  వేడుకల్లో వినయ్‌ భాస్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న పనులతో జిల్లా సర్వతోముఖంగా ప్రగతి సాధిస్తోందన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, నిర్మాణాత్మక సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చవుతున్న నిధులు, జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను గణాంకాలతో వివరించారు.

నేటి నుంచి కొత్త పెన్షన్‌లు
జిల్లాలో ఆసరా పెన్షన్ల కింద 87054 మందికి ప్రతీ నెల క్రమం తప్పకుండా రూ. 19.46 కోట్లు అందుతున్నాయి, 57 సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా పెన్షన్‌లు ఇవ్వబోతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే జీవితంలో ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, బీడి కార్మికులు , బోధకాలు, ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులకు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందన్నారు. అన్ని వర్గాలకు కలిపి 87 వేల 54 మంది కి ఆసరా పెన్షన్‌లు అందిస్తున్నామన్నారు.  అదే విధంగా వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జిల్లాలో వానాకాలం 2022లో 1,38,986 మంది రైతులకు రూ. 132 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రైతు బీమా పథకం కింద జిల్లాలో 2021-22 సంవత్సరానికి 323 మంది రైతు కుటుంబాలకు బీమా క్లేమ్‌లు అందాయి.  రైతు బంధు సమితుల ద్వారా రైతులకు అవసరమైన  సూచనలు, సలహాలకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  రైతు పండించిన పం టను నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేిస్తోందన్నారు. జిల్లాలో యాసంగి 2021-22 సీజన్‌లో 145 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,09,999 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 19928 మంది రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఇందుకుగాను రూ. 215 కోట్లను రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించామన్నారు.

పల్లెల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
పల్లె ప్రగతి కార్యక్రమాల్లో 243 పల్లె ప్రకృతి వనాలు, 208 వైకుంఠధామాలు, 208 కంపోస్టు షెడ్ల నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. పట్టణ ప్రగతిలో భాగంగా 2020 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు రూ 179.32 కోట్లు వరంగల్‌ మహానగర పాలక సంస్థకు మంజూరు కాగా, రూ 108 కోట్లతో 275 రకాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. పరకాల నియోజకవర్గంలో రూ 4.40 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం జరుగుతోంది. 8వ విడత హరిత హారంలో భాగంగా 2022-23 సంవత్సరంలో 25.46 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.

దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ..
జిల్లాలో ఇప్పటి వరకు దళితు బంథు కింద అన్ని నియోజకవర్గాల్లో 2149 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 9.90 లక్ష చొప్పున రూ. 410.55 కోట్లు వారి ఖాతాలో జమ అయినట్టు వినయ్‌ భాస్కర్‌ చె ప్పారు. ఇప్పటి వరకు 3,983 మంది లబ్ధిదారులకు వారు కోరిన యూనిట్‌ను అందచేశామన్నారు. 17 మంది మైనారిటీ విద్యార్ధులకు విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 3.40 కోట్లు,  షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాల కింద మొత్తం 936 మందికి రూ. 9.37 కోట్ల విలువగల చెక్కులను అందచేశామని వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించి రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా  ప్రతీ గ్రామంలో, డివిజన్‌లోనూ కనీసం ఒక ఎకరం స్థలంలో మైదానాలు నిర్మిస్తున్నామని తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులందరికీ ఈ సంవత్సరం నుండి తెలుగు మీడియంతో పాటు ఆంగ్లమాధ్యమంలో బోధన జరుగుతోందన్నారు.

వైద్య రంగంలో మౌలిక వసతులకు ప్రాధాన్యత
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో రూ. 67 లక్షలతో మిల్క్‌ బ్యాంక్‌, రూ. 33 లక్షలతో బ్లడ్‌ బ్యాంక్‌  ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో టి-డయాగ్నస్టిక్‌ హబ్‌, రేడియాలజీ ల్యాబ్‌ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. 74 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలకు రూ. 11 కోట్లు మంజూరు అయ్యాయి. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2193 ప్రసవాలు జరగ్గా 1915 మందికి కేసీఆర్‌ కిట్ల  పంపిణీ జరిగిందన్నారు. .జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి హామీ పథకం కింద 2022-23 ఆర్ధిక సంవత్సరానికిగాను 17.25 లక్షల పనిదినాలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు 14.14 లక్షల పనిదినాలు కల్పించడమైంది. ఇందుకు గాను రూ 34.70 లక్షలు లబ్దిదారుల ఖాతాల్లో జమఅయినాయన్నారు

రహదారుల విస్తరణ కోసం ప్రత్యేక దృష్టి ..
ధర్మసాగర్‌ నుంచి వేలేరు వరకు రహదారుల వెడల్పునకు ఎండీఆర్‌ పథకం కింద రూ.25 కోట్లతో,  కోర్‌నెట్‌ ఎండీఆర్‌ పథకం కింద హుజూరాబాద్‌-పరకాల రోడ్డును 4 వరుసల విస్తరణతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి రూ.144 కోట్లతో పనులు జరుగుతున్నాయి. టీఎ్‌సఐపాస్‌ ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 53 పరిశ్రమలకు అనుమతులు జారీ అయ్యాయి.

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు
‘కుడా‘లో రూ. 240 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ‘హృదయ్‌’ కింద రూ.35 కోట్లతో భద్రకాళి బండ్‌, జైన క్షేత్రం, వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ. 70 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘనపూర్‌ నియోజకవర్గాల పరిధిలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లాకు మంజూరైన 4,718 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో 1477 పూర్తయ్యాయని దాస్యం వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, చల్లా ధర్మారెడ్డి,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌, మేయర్‌ గుండు సుధారాణి, పోలిస్‌ కమిషనర్‌  డాక్టర్‌ తరున్‌ జోషి,  మునిసిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, ఇతర అధికారులు,స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు.

‘చల్లా’కు ఉత్తమ సేవా అవార్డు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఉత్తమ సేవా అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ధర్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఒకే రోజు మూడు వేలకు పైగా రక్తం యూనిట్లను సేకరించినందుకు గాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఉత్తమ సేవా అవార్డును, ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోసి చేతుల మీదుగా ఆయన వీటిని అందుకున్నారు.

గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం : మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ టౌన్‌, ఆగస్టు 15 : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్స్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మంత్రి ఎర్రబెల్లి హనుమకొండలోని తన నివాసంలో, క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 22వ తేదీ వరకు జరిగే స్వాతంత్స్ర వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. 







Updated Date - 2022-08-16T05:42:53+05:30 IST