వరుస విషాదాలు.. అయినా జట్టుతోనే విష్ణు సోలంకి

ABN , First Publish Date - 2022-02-28T22:42:13+05:30 IST

విష్ణో సోలంకి.. ఈ బరోడో క్రికెటర్ పేరు విషాదానికి, అంకితభావానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెండు వరుస విషాదాల

వరుస విషాదాలు.. అయినా జట్టుతోనే విష్ణు సోలంకి

న్యూఢిల్లీ: విష్ణో సోలంకి.. ఈ బరోడా క్రికెటర్ పేరు ఇప్పుడు విషాదానికి, అంకితభావానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెండు వరుస విషాదాల తర్వాత కూడా జట్టుతోనే ఉండాలన్న అతడి దృఢ సంకల్పానికి సర్వత్ర ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరోడా జట్టుకు సోలంకి సారథ్యం వహిస్తున్నాడు.


కొన్ని రోజులుగా అతడి జీవితం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. కుమార్తె పుట్టబోతోందని ఎంతో సంబరపడిన సోలంకికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పుట్టగానే నవజాత శిశువు మరణించింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే అనారోగ్యంతో బాధపడుతున్న సోలంకి తండ్రి నిన్న (ఆదివారం) మరణించారు.


రెండు వరుస విషాదాలను తట్టుకుని నిలబడిన విష్ణు బాధను దిగమింగుకుని జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆటపై అతడికున్న అంకితభావానికి ఇది నిదర్శమని సహచరులు, జట్టు మేనేజ్‌మెంట్ చెబుతోంది. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సాయం చేస్తామన్నప్పటికీ డ్రెస్సింగ్ రూము నుంచే వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను వీక్షించాడు. 


29 ఏళ్ల సోలంకి ఫిబ్రవరి 10న తండ్రయ్యాడు. అతడి భార్య పాపకు జన్మనిచ్చింది. దీంతో వారింట సంతోషాలు వెల్లివిరిశాయి. అయితే, ఆ ఆనందం కొన్ని గంటల్లోనే మాయమైంది. ఆ పండంటి బిడ్డ తర్వాతి రోజే కన్నుమూసింది. విషయం తెలిసిన వెంటనే బయోబబుల్ నుంచి బయటకు వచ్చి ఇంటికెళ్లిన అతడు కుమార్తె అంత్యక్రియల అనంతరం తిరిగి కటక్ చేరుకున్నాడు.


ఇలాంటి కఠిన పరిస్థితుల్లో భార్యతో ఉండాల్సిన సోలంకి జట్టు కోసమే ఆలోచించాడు. ఆ తర్వాత చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన సోలంకి బాధను పంటికింద అదిమిపెట్టుకుని ఏకంగా సెంచరీ (104) బాదాడు. నిన్న (ఆదివారం) మ్యాచ్ చివరి రోజున సోలంకి ఇంట్లో మరో విషాదం నెలకొంది. నిన్న అతడు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తండ్రి మరణవార్త జట్టుకు చేరింది.


జట్టు మేనేజర్ వెంటనే అతడికి ఈ సమాచారాన్ని అందించాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి చనిపోయాడని చెప్పాడు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇంటికి వెళ్లేందుకు సాయం చేస్తామని చెప్పాడు. అయినప్పటి తాను జట్టుతోనే ఉంటానని చెప్పాడు. అతడి గుండె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, బరోడా తన చివరి ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఈ నెల 3న భువనేశ్వర్‌లో హైదరాబాద్‌తో తలపడుతుంది. 

Updated Date - 2022-02-28T22:42:13+05:30 IST