ఇటు మేయర్‌.. అటు డిప్యూటీ మేయర్‌

ABN , First Publish Date - 2021-05-26T17:32:57+05:30 IST

మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి మంగళవారం గ్రేటర్‌లోని ఆస్పత్రులను వేర్వేరుగా సందర్శించారు...

ఇటు మేయర్‌.. అటు డిప్యూటీ మేయర్‌

హైదరాబాద్‌ సిటీ: మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి మంగళవారం గ్రేటర్‌లోని ఆస్పత్రులను వేర్వేరుగా సందర్శించారు. మేయర్‌ పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 6 గంటలకు మొదట ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి ప్రాంగణంలోని అన్నపూర్ణ భోజన కేంద్రం వద్ద చెత్త పేరుకుపోవడాన్ని చూసి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించేలా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి లోపలికి వెళ్లిన ఆమె పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ లోపాలను గుర్తించి శుభ్రం చేయాలని సూచించారు. రోగులను పరామర్శించి వారికందుతోన్న వైద్యసేవలు అడిగి తెల్సుకున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని గాంధీకి పంపించాలని సూచించారు. ఆపరేషన్‌ థియేటర్‌, మార్చురీకి సంబంధించిన సమస్యలను వైద్యులు ప్రస్తావించగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 


గ్లౌస్‌లు, మాస్క్‌ లేకుండా...

ఆస్పత్రిలో సిబ్బంది చేతులకు గ్లౌస్‌లు లేకుండా, ఓ వ్యక్తి మాస్క్‌ కూడా ధరించకపోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మాస్క్‌లు, గ్లౌస్‌లు అందజేసి తప్పనిసరిగా ధరించాలని సూచించారు. జియాగూడ రోడ్డులో మూసీ పక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గోల్కొండ, లంగర్‌హౌస్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఆమె అక్కడక్కడా వ్యర్థాలు పేరుకు పోవడాన్ని చూసి పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలని పేర్కొన్నారు. జియాగూడలో సీటీపీ ప్లాంట్‌ వద్ద చెత్త నిర్వహణ చేపట్టాలన్నారు. ట్విటర్‌ ఫిర్యాదు ఆధారంగా మోతీదర్వాజ వెళ్లిన విజయలక్ష్మి అక్కడ పేరుకుపోయిన చెత్త తొలగించాలని ఆదేశించారు. అక్కడ కూలిన గోడను పునర్నిర్మించాలని సూచిస్తూ.. చారిత్రక కట్టడాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. 


కొవిడ్‌ రూమ్‌లో ఏం జరుగుతోంది..?

జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మేయర్‌ సందర్శించారు. రోజూ ఎన్ని కాల్స్‌ వస్తున్నాయి, ఎలాంటి సేవలందిస్తున్నారు, విషయాలను సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు. సోమవారం 61 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని, ఆరుగురు ఆయుష్‌ డాక్టర్లు 11 మందికి వైద్య సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు. 15 మంది కిట్‌ల కోసం, 21 మంది వ్యాక్సినేషన్‌ సమాచారం కోసం ఫోన్‌ చేశారని వివరించారు. పడకల కోసం కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేస్తే సమాచారం ఇవ్వడమే కాదని, పడక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


నిలోఫర్‌కు డిప్యూటీ.. 

ఇన్నాళ్లు లాలాపేట, సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధికే పరిమితమైన డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి ఇప్పుడు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. తనదైన శైలిలో అధికారులతో మాట్లాడి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సోమవారం ఆమె నిలోఫర్‌ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడి అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించడంతో పాటు రోగులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

Updated Date - 2021-05-26T17:32:57+05:30 IST